జిల్లాలో వైసిపికి దిక్కెవరు?
ఆత్మస్థైర్యం కోల్పోతున్న పార్టీ శ్రేణులు
క్యాడర్ కు ధైర్యం చెప్పి, నడిపించే నాయకత్వ లోపం
కూటమి పార్టీల వైపు వైసిపి నేతల చూపు
చేజారుతున్న మున్సిపాలిటిలు
నిస్సహాయ స్థితిలో వైసిపి నాయకత్వం
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లాలో సాధారణ ఎన్నికల ఫలితాల షాక్ నుంచి ఇంకా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదు. జిల్లాలో ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీకి నాయకత్వలేమి ఏర్పడింది. గతంలో వైసిపి తరఫున గెలుపొందిన ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. కొంతమంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిని నివారించడానికి జిల్లా నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం వారికి ధైర్యం చెప్పే సాహసం కూడా చేయడం లేదు. జిల్లాలో వైసిపి నాయకులు కార్యకర్తలలో నిరాశ, స్తబ్దత రాజ్యమేలుతోంది. కనీసం విలేకరుల సమావేశాలు పెట్టి కేడర్ కు ధైర్యం చెప్పే నాయకులకు కూడా కనిపించడం లేదు. జిల్లాకు ఒకప్పుడు పెద్ద దిక్కు అయినా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కష్టాలలో కూరుకుపోతున్నారు. ఫలితంగా జిల్లాలో వైసిపి నాయకత్వం పట్ల ఆ పార్టీ ప్రజాప్రతినిధులు నమ్మకాన్ని కోల్పోతున్నారు. కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భవిష్యత్తులో జిల్లా నాయకత్వం తమను ఆదు కుంటుందన్న నమ్మకం వారిలో కనిపించడం లేదు. దీంతో ఎక్కువమంది ప్రజాప్రతినిధులు తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల పట్ల మొగ్గు చూపుతున్నారు.
చిత్తూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆరింటిని గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అలాగే పార్లమెంటును కూడా కైవసం చేసుకుంది. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయి. ఎన్నికలు జరిగాయి అనడం కంటే ఏకగ్రీవలే ఎక్కువ. తెలుగుదేశం పార్టీ నాయకులకు నామినేషన్ వేసే అవకాశం కూడా లభించలేదు. వైసీపీ పార్టీ నాయకులు టిడిపి నాయకులను భయపెట్టి నామినేషన్లు కూడా వేయకుండా జిల్లాల్లో అన్ని ఎన్నికలను ఏకగ్రీవం చేసుకున్నారు. జిల్లా నుంచి ముగ్గురికి మంత్రులుగా ప్రాతినిధ్యం లభించింది. పుంగనూరు నుంచి గెలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గంగాధర నెల్లూరు నుంచి నారాయణస్వామి, నగిరి నుంచి రోజాలు మంత్రివర్గంలో స్థానం సాధించారు. పేరుకు ముగ్గురు మంత్రులు ఉన్న, జిల్లాలో పెత్తనం మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే. జిల్లాలో పరిపాలన, జిల్లా అధికారుల మార్పులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర వ్యవహారాల్లో అన్నీ తానై వ్యవహరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా రాయలసీమ జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక కూడా చాలా వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డిల జిల్లా కనుసన్నల్లో జరిగాయి. జిల్లాలో ముగ్గురు మంత్రులు తరచుగా పర్యటిస్తూ కార్యకర్తలలో ఆత్మవిశ్వాసాన్ని నింపేవారు. పేరుకు జిల్లా అధ్యక్షుడిగా కుప్పం కు చెందిన భరత్ ఉన్నా, పెత్తనమంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే. జిల్లా కార్యవర్గంతో పాటు మండల కార్యవర్గాలను కూడా ఆయన ఆదేశాల ప్రకారం నియమించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయాన్ని మోటగట్టుకుంది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో పుంగనూరు నియోజకవర్గంలో మాత్రం బొటాబొటి మెజార్టీతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గట్టునబడ్డారు. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలను, పార్లమెంటును ఆ పార్టీ కోల్పోవాల్సి వచ్చింది. దీనితో వైసీపీకి జిల్లాలో గడ్డి షాక్ తగిలింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో జిల్లాలో వైసీపీ కార్యక్రమాలు పూర్తిగా తెర మరుగయ్యాయి. కనీసం ప్రెస్ మీట్ ల ద్వారా ప్రభుత్వాన్ని విమర్శించే నాయకత్వం కూడా కరువైంది. గతంలో చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇరుకున పెట్టడానికి అధికార కూటమి ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలను పరిశీలిస్తుంది. ఆయనను పుంగనూరులో కూడా పర్యటించకుండా నిలువరిస్తోంది. అలాగే గతంలో వైసీపీ తరఫున గెలుపొందిన వారిని తమ పార్టీలోకి ఆహ్వానించడానికి పావులు కదుపుతోంది. ఇప్పటికే చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్, ఉప మేయర్, మరో 20 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరి, చిత్తూరు కార్పొరేషన్ మీద తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు. అలాగే కుప్పం, పుంగనూరు మున్సిపాలిటీలో కూడా చైర్మన్లు, కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వీరిని నిలువరించే ప్రయత్నాలు కూడా వైసీపీ నుంచి జరగడం లేదు. వైసిపి కార్యకర్తలకు ధైర్యం చెప్పి పార్టీలో కొనసాగే విధంగా సూచించే నాయకత్వం కరువైంది. దీంతో జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు పలువురు ప్రజాప్రతినిధులు కూటమి పార్టీలలో చేరడానికి సిద్ధమవుతున్నారు. వైసిపి జిల్లా అధ్యక్షుడు ఉన్న కుప్పం నుంచి చైర్మన్, కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రయత్నం చేయగా వారిని నిలువరించే ప్రయత్నం ఏమి జరగలేదు. అలాగే పుంగనూరులో కూడా పరిస్థితి చేయి దాటినట్లు తెలుస్తోంది. దీంతో వైసిపి నాయకులు చేయునదిలేక మిన్న కుంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ వైసీపీ ప్రజాప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకోకూడదన్న విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని సడలిస్తే జిల్లా పరిషత్తు మొదలు మున్సిపాలిటీలు, మండల పరిషత్తులు తిరిగి తెలుగుదేశం పార్టీ ఖాతాలో చేరడానికి సిద్ధంగా ఉన్నాయి. వైసీపీ కార్యకర్తలకు సొంత పార్టీలో భరోసా లేకపోవడంతో పలువురు కూటమి పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు.