జిల్లాలో భారీగా ప్రకృతి వనరుల దోపిడీ
వాహనాలతో ఇసుక తవ్వకాలు
గ్రానైట్ గనులు, కంకర ఫ్యాక్టరీలు స్వాదీనం
విచ్చలవిడిగా ఎర్రచందనం అక్రమ రవాణా
శ్వేతపత్రంలో చంద్రబాబు వెల్లడి
విచారణ జరుగుతోందన్న ముఖ్యమంత్రి
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున సహజ వనరులు దోపిడీకి గురయ్యాయి. వైసిపి పాలనలో నిబంధనలకు వ్యతిరేకంగా సహజ వనరులను విచ్చలవిడిగా దోపిడీ చేశారు. ప్రభుత్వ భూములను కబ్జా చేశారు. డీకేటి భూములను బలవంతంగా వైసిపి నాయకులను పేరుమీద పట్టాలు చేసుకున్నారు. హౌసింగ్ కాలనీల పేరుతో భారీ ఎత్తున అవకతవకలు, అవినీతి జరిగింది. ఇసుక రవాణాలో యంత్రాలను వినియోగించారు. ఇసుకను పక్క రాష్ట్రాలకు కూడా అమ్ముకున్నారు. జిల్లాలో యధేచ్చగా ఎర్రచందనం అక్రమ రవాణా జరిగింది. వైసీపీ పాలనలో ప్రకృతి వనరులు అన్నీ భారీ ఎత్తున దోపిడీకి గురయ్యాయి. సోమవారం అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రంలో ఈ విషయాలు వెల్లడించారు. ఈ మేరకైన చిత్తూరు జిల్లాలో జరిగిన పలు అంశాలను ప్రస్తావించారు. చిత్తూరు జిల్లాలో జరిగిన అవినీతి అక్రమాల మీద విచారణ జరుగుతోందని, నిందితులు ఎటువంటి వారైనా వదిలేదిలేదన్నారు.
వైసిపి పాలనలో చిత్తూరు జిల్లాలో ప్రకృతి వనరుల దోపిడీ తారాస్థాయిలో చేరింది. జిల్లాలో కలప, ఇసుక, మైనింగ్ అక్రమ రవాణా ఆకాశాన్ని అంటింది. నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అన్నింటిని తమ చేతుల్లోకి తీసుకున్నారు. నెలనెలా కప్పం కట్టించుకున్నారు. ఎన్నికల్లో అటువంటి వారికి వైసిపి టికెట్లను కూడా ఇచ్చింది. వైసీపీ పాలనలో ఇసుక త్రవ్వకాలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారు. యంత్రాల సహాయంతో ఇసుకను తీసి తవ్వి, ఇతర రాష్ట్రాలకు కూడా అమ్ముకున్నారు. వాగులు, వంకలలో ఎక్కడ ఇసుక కనిపిస్తే అక్కడ నుండి తరలించే కార్యక్రమం జరిగింది. అడ్డుపడిన వారి మీద భారీ ఎత్తున కేసులను బనాయించారు. ఇసుక రవాణాకు ప్రత్యేకంగా రోడ్డును కూడా నిర్మించారు. ఇందులో జిల్లాకు చెందిన పలువురికి కూడా వాటాలు అందాయి. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణా కూడా భారీ ఎత్తున జరిగింది. ఈ అక్రమ రవాణాలో ప్రమేయం ఉన్న వ్యక్తులు రాష్ట్రాన్ని శాసించే స్థాయికి వెళ్లారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటూ, అక్రమ రవాణాకు తెరతీశారు. అక్రమ రవాణా రవాణా కారణంగా వందల కోట్ల రూపాయలను ఆర్జించి, ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ ఎత్తున నిధులను వ్యయం చేశారు. జిల్లాలో అక్రమ రవాణాతో సంబంధం ఉన్న వ్యక్తులకు వైసీపీ పార్టీ టికెట్లను కూడా ఇవ్వడం జరిగింది. అక్రమాలలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా వైసిపి నాయకులు అందరూ పాలుపంచుకున్నారు. ఎవరికి అందినంత వాళ్లు దోచుకున్నారు. జిల్లాలో డికెటి భూములను గుర్తించి, తమ పేర్ల మీద పట్టాలు చేసుకున్నారు. జగనన్న కాలనీల్లో భారీ ఎత్తున అవినీతి, అవకతవకులు జరిగాయి. హౌసింగ్ కాలనీలు ఎక్కడ నిర్మించాలో వైసిపి నాయకులు నిర్ణయించారు. ముందుగా అక్కడ భూములను వైసిపి నాయకులు కొనుగోలు చేసి, వాటిని ప్రభుత్వానికి భారీ మొత్తాలకు అమ్ముకున్నారు. పలుచోట్ల జగనన్న కాలనీల్లో పట్టాలు ఇవ్వడానికి కూడా డబ్బుల వసూలు చేశారు. బినామీ పేర్లతో నాయకులే సగం ఇళ్ళను కాజేశారు. ఇల్లు కట్టకనే కట్టినట్లు రికార్డులలో చూపించారు. గ్రానైట్ క్వారిలను, ఫ్యాక్టరీలను బలవంతంగా వైసీపీ శాసనసభ్యులు, నాయకులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ పద్ధతుల్లో మైనింగ్ చేసి, ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు సరఫరా చేశారు. మెటల్ క్వారీలను కూడా బలవంతంగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని రకాల సహజ వనరులు వైసీపీ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. జిల్లాలో అనాధీనంలో ఉన్న భూములను గుర్తించి తమ పేరుతో పట్టాలు తీసుకున్నారు. అభ్యంతరం చెప్పిన తహసీల్దారులను భయపెట్టి, ప్రలోభ పెట్టి తమకు అనుకూలంగా మార్చుకున్నారు. చిత్తూరు సమీపంలో పశువుల బయిళ్ళను కూడా తమ పేరుతో పట్టాలు చేసుకున్నారు. కొండలను, గుట్టలను సైతం వదలలేదు. ఈ రకంగా చిత్తూరు జిల్లాలో భారీ ఎత్తున ప్రభుత్వ భూములను తమ పేరుతో పట్టాలుగా పట్టాలు చేసుకున్నారు. బలహీనమైన బలహీన వర్గాలకు చెందిన ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు. దేవాలయ భూములను కూడా వైసీపీ నేతలు వదలలేదు. వాటిని కూడా తమ పేరు మీద రాయించుకున్నారు. పలుచోట్ల దేవాలయ భూములలో జగనన్న కాలనీలను ఏర్పాటు చేశారు. పుంగనూరు మండలం లో 982 ఎకరాలను మాజీ మంత్రి పెద్ద రెడ్డి అనుచరులు పట్టాలుగా తీసుకున్నారు. ఈ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిని సాధించింది. వీటి మీద విచారణ ఆదేశించింది. వైసీపీ పాలనలో జరిగిన ప్రకృతి వనరుల దోపిడీ, భూకబ్జాల మీద ప్రభుత్వం జిల్లా స్థాయిలో విచారణలు జరిపిస్తోంది. విచారణ అనంతరం ఇందుకు బాధ్యుల మీద కేసులను నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోనున్నారు.