ఇంటింటికి పించన్ పంపిణి చేయాలన్న ఆదేశాలు బేఖాతర్
గ్రామ సచివాలయలలోనే చాలా చోట్ల పించన్ పంపిణి
ప్రభుత్వం మరీనా, తీరు మార్చుకోని సచివాలయ సిబ్బంది
వేలి ముద్రలు పడక పండుటాకులు ఎదురుచూపులు
సర్వర్ మొరాయించడంతో అవస్థలు పడ్డ లభ్దిదారులు
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేయగా, చిత్తూరు జిల్లాలో మాత్రం చాలా గ్రామాల్లో ఇంటింటికి పించన్ పంపిణి జరగలేదు. లబ్ధిదారులందరినీ గ్రామ సచివాలయానికి రమ్మని అక్కడే పింఛన్లను పంపిణీ చేశారు. వృద్ధులు,వికలాంగులు ఐదారు గంటల పాటు వేచి ఉండి, పెంచిన పించన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేనికి తోడు వేలిముద్రలు పడకపోవడంతో చాలా కాలం పాటు గ్రామ సచివాలయాల దగ్గర పింఛన్దారులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యలో ఒకటిన్నర గంటల పాటు సర్వర్ కూడా డౌన్ అయింది. గ్రామ సచివాలయం వద్ద వృద్ధులు కూర్చోవడానికి సరైన సౌకర్యాలు లేకపోవడంతో పింఛన్ కోసం వారు పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఫోటోలను తీయడానికి లబ్ధిదారులను గ్రామ సచివాలయం వద్దకు రప్పించుకున్నారు. మరొకరు ఏకంగా సభను ఏర్పాటు చేసి బహిరంగ సభలో పింఛన్లను పంపిణీ చేశారు. జిల్లాలో ఇంటింటికి పింఛన్ పంపిణీ చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయం చాలావరకు నెరవేరలేదు.
సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తో పూతలపట్టు మండలం పెతమిట్టలో ఇంటింటికి పింఛన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి పింఛన్లను అందజేశారు. అలాగే పుంగనూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పలమనేరు మున్సిపాలిటీ బొమ్మదొడ్డిలోలో ఇంటింటికి వెళ్లి పించన్లు పంపిణీ చేశారు. నగిరి నియోజకవర్గం వడమాల పేట మండలం చింత కాలువ గ్రామంలో ఉదయం 6 గంటలకే నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలో గాంధీనగర్ లో ఇంటి వద్దకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మున్సిపల్ కమిషనర్ అరుణ పంపిణీ చేశారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురం వరదరాయుల స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కల్చర్ల శ్రీకాంత్ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఇంటింటికి వెళ్లి పెంచిన పింఛన్ మొత్తాలను అందజేశారు. గంగాధర నెల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే థామస్ పించన్లు పంపిణి చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ఉదయం 6 గంటలకి ప్రారంభమయింది. ముఖ్యమంత్రితో సహా మంత్రులు, శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్లు ఇతర జిల్లా అధికారులు ఇంటింటికి వెళ్లి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలో మాత్రం చాలా పంచాయతీలలో ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరగలేదు. ఉన్నబ్ధిదారులందరినీ గ్రామ సచివాలయానికి రమ్మని అక్కడే పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు వేలిముద్రలు పడకపోవడం తో గంటలు తరబడి సచివాలయాలలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గంటల తరబడి వేచి ఉండి, పించన్ మొత్తాలు తీసుకొని లబ్ధిదారులు ఇంటి ముఖం పట్టారు. ఐరాల మండలం పుత్రమద్ది గ్రామపంచాయతీలో పెంచిన పించన్ కోసం వృద్ధులు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే బంగారుపాలెం మండలం చికూరుపల్లెలో గ్రామచావిటి వద్దకు లబ్ధిదారులను రమ్మని అక్కడే పింఛన్లను పంపిణీ చేశారు. గంగాధర నెల్లూరు మండలంలో స్థానిక ఎమ్మెల్యే సమావేశాన్ని ఏర్పాటు చేసి, అక్కడే పింఛన్లను పంపిణీ చేశారు. ఇలా ఇంటింటికి పింఛన్ పంపిణీ చేయాలన్న ముఖ్యమంత్రి ఆశయానికి చిత్తూరు జిల్లాలో చాలావరకు గండి పడింది. నాయకులు లబ్ధిదారులతో కలిసి ఫోటోలు చేయించుకోవడానికి వారిని గ్రామ సచివాలయాలకు రమ్మని, అక్కడే పింఛన్లు పంపిణీ చేశారు.
పాలాభిషేకాలు
జిల్లాలో పలుచోట్ల లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. ఒకేసారి పెంచిన మొత్తాలను, మూడు నెలల బకాయిలను కలిపి అందజేయడంతో లబ్ధిదారులు ఉబ్బితబిబ్బులయ్యారు. దీనితో పింఛన్ మతాలను పెంచినందుకు, మూడు నెలల బకాయిలను అందజేసినందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లకు పాలాభిషేకం చేసి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలో అన్ని మండలాల్లో నాయకులకు క్షీరాభిషేకములు జరిగాయి.