చిత్తూరు కార్పోరేషన్ మీద టిడిపి జండా
పకడ్బందిగా వ్యూహరచన, అమలు
మ్యాజిక్ ఫిగర్ వచ్చే వరకు అంతా గోప్యత
అకస్మాతుగా టిడిపిలో చేరిన కార్పొరేటర్లు
టిడిపి వ్యూహాన్ని పసిగట్టలేకపోయిన వైసిపి
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ ను శుక్రవారం వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ మీద తెలుగుదేశం జెండాను ఎగురవేసింది. పగడ్బందీగా మ్యాజిక్ ఫిగర్ సాధించే వరకు చేరికల వివరాలను గోప్యంగా పెట్టింది. లక్ష్యం చేరగానే వైసిపి కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంది. భవిష్యత్తులో ఏ విధమైన ఇబ్బందే లేకుండా టిడిపి నాయకులు పగడ్బందీగా వ్యూహరచన చేశారు. టిడిపి నాయకుల వ్యూహాన్ని పసిగట్టడంలో వైసిపి నాయకులు విఫలమయ్యారు. తెలిసే సరికి జరగల్చిన నష్టం జరిగిపోయింది. మునిసిపల్ కార్పోరేషన్ చేజారింది. ఎంతో కష్టపడి సాధించుకున్న చిత్తూరు కార్పొరేషన్ లో వైసీపీ నాయకులు వదులుకోవాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో విజయం సాధించకనే కార్పొరేషన్ మీద తమ పార్టీ జెండాను ఎగురవేసింది.
చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. వైసీపీకి ఎదురొడ్డి నిలువలేక ఫలాయనం చిత్తగించే పరిస్థితి ఏర్పడింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలతో, పోలీస్ అధికారుల సహకారంతో వైసిపి నాయకులు చిత్తూరు కార్పొరేషన్ మీద పట్టు బిగించారు. టిడిపి నేతలను నామినేషన్ వేయడానికి కూడా అనుమతించలేదు. వేసిన నామినేషన్లను కూడా బలవంతంగా ఉపసంహరింపచేశారు. బెదిరించారు. భయపెట్టారు. వినకుంటే కిడ్నాప్ కూడా చేశారు. వైసిపి తరఫున అప్పటి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, మొదలియార్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బుల్లెట్ సురేష్, ఆర్టీసీ ఉపాధ్యక్షుడిగా ఉండిన విజయానంద రెడ్డి కలిసి పగడ్బందీగా చిత్తూరు మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. మున్సిపాలిటీలో 50 డివిజన్లు ఉండగా ఇందులో 46 డివిజన్లు వైసీపీ నేతలు విజయం సాధించారు. విజయం సాధించారు అనడంకంటే, ఏకగ్రీవం చేసుకున్నారు అనడం సబబు. అప్పుడు చిత్తూరు నియోజకవర్గానికి ఇన్చార్జి కూడా లేరు. అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోవడంతో ఏ ఎస్ మనోహర్ పార్టీ రాజకీయాలకు దూరమయ్యారు. సీకే బాబు తెలుగుదేశం పార్టీలో చేరినా, రాజకీయంగా క్రియాశీలకంగా కాలేదు. గురిజాల జగన్మోహన్ నాయుడు అప్పటికి రాజకీయాలలో అడుగుపెట్టలేదు. ఎమ్మెల్సీగా ఉండిన దొరబాబు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కాజూరి బాలాజీ, మాజీ మేయర్ హేమలత, టిడిపి నేతలు వసంత్ కుమార్, రాజేష్ లు వైసీపీ మీద పోరాడారు. వారి శక్తి చాలలేదు. మూడింటిలో మాత్రమే టిడిపి అభ్యర్థులను గెలిపించుకోగలిగారు. అసెంబ్లీ ఎన్నికలలో చిత్తూరు నియోజకవర్గంలో కూడా టిడిపి విజయం సాధించడంతో టిడిపి నాయకులు పకడ్బందీగా పావులు కదిపారు. వైసీపీ మేయర్, ఉప మేయర్, కార్పొరేటర్ల మీద దృష్టిని సారించారు. చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, మరో మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాజూరు బాలాజీ, మాజీ మేయర్ హేమలతలు పకడ్బందీగా పావులు కదిపారు. మొత్తం వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేవరకు అత్యంత రహస్యంగా ఉంచారు. మ్యాజిక్ ఫిగర్ సాధించామనుకున్న తర్వాత అకస్మాత్తుగా శుక్రవారం ఉదయం వైసిపి మేయర్, డిప్యూటీ మేయర్ 18 మంది కార్పొరేటర్లు టిడిపి కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. తాము స్వచ్చందంగా, బేషరతుగా తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వెల్లడించారు. చిత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం వైసీపీకి రాజీనామా చేసి, తెలుగుదేశం పార్టీ తీర్థం పుడుచుకున్నట్లు వెల్లడించారు. వారిని ఎమ్మెల్యే గురజాల, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ హేమలతలు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. శుక్రవారం మేయర్ డిప్యూటీ మేయర్ మరో 18 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరగా, ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ముగ్గురు కార్పొరేటర్లు ఉన్నారు. మొత్తం కలిపి టిడిపి బలం 23 కు పెరుగుతుంది. చిత్తూరు మున్సిపాలిటీలో కో ఆప్షన్ మెంబర్లుగా చిత్తూరు ఎంపీ, చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు ఉంటారు. మొత్తం కలిపి టీడీపీ బలం 26 చేరింది. దీంతో వైసిపి అవిశ్వాస తీర్మానం పెట్టినా డోకా లేదని లెక్కలు ఖారారైన తర్వాత ఈ విషయాన్ని బహిరంగపరిచారు. ప్రస్తుతానికి 20 మంది వైసీపీ కార్పొరేటర్లు చేరిన మరో 17 మంది తమకు అందుబాటులో ఉన్నారని అంటున్నారు. శుక్రవారం టిడిపిలో చేరాల్చిన ముగ్గురు కార్పొరేటర్లు చిత్తూరులో లేకపోవడంతో చేరలేదని చెబుతున్నారు. భవిష్యత్తులో మరికొందరు కార్పొరేటర్లు టిడిపి తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఏ రకంగా చూసిన తెలుగుదేశం పార్టీకి మెజారిటీకి ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి మున్సిపల్ మేయర్, డిప్యూటీ మేయర్ల పదవులలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవని తెలుస్తోంది. భవిష్యత్తు అవసరాలను బట్టి మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పకడ్బందీ వ్యూహంతో వైసిపి కంచుకోటను బద్దలు కొట్టి, ఆ కోట మీదే తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేయడం విశేషం.