2, జులై 2024, మంగళవారం

పండుటాకులకు పండగొచ్చింది

 అవ్వా, తాతలకు రూ. 7 వేలు 

వికలాంగులకు రూ. 15 వేలు

జిల్లాలో రూ.181 కోట్లు పెన్షన్ పంపిణీ

 లబ్దిదారులలో హర్షాతిరేకాలు 



( ప్రభ న్యూస్ బ్యూరో )

 జిల్లాలోని పించను దారులకు పండుగ వచ్చింది. అవ్వా, తాతల ముఖాల్లో ఆనందం పెల్లుబికింది. వికలాంగులలో ఆత్మస్థైర్యం ద్విగుణికృతం అయ్యింది. పించన్ మొత్తాలను పెంచుతారా అన్న అనుమానం పటాపంచాలయ్యింది. మూడు నెలల పెంచిన మొత్తాలను కూడా కలిపి ఇవ్వడంతో పించనుదారుల ఆనందానికి అవధులు లేవు, నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెంచిన సామాజిక పించన్ల కారణంగా చిత్తూరు జిల్లాలో 2,61,544 మంది లబ్ధి పొందుతున్నారు. వీరికి జూలై నెల నుంచి పింఛన్ మొత్తలను పెంచారు. ఏప్రిల్ మొదటి తారీఖు నుండి పెంచడంతో మూడు నెలల బకాయిలు కలిపి ఏడు వేల రూపాయలను అందచేస్తున్నారు. ఇదివరకు ఉన్న సామాజిక పెన్షన్లను వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, డప్పు కార్మికులు, కళాకారులు, హెచ్ఐవి భాదితులు, హిజ్రాలు, చెప్పులు కుట్టే వారికి మూడు వేల రూపాయల నుంచి 4వేల రూపాయలుగా పెంచారు. ఈ మొత్తాన్ని ఏప్రిల్ నుంచి లెక్కగట్టి, ఒకేసారి ఏడువేల రూపాయలుగా అందజేస్తున్నారు. అలాగే దివ్యాంగులకు 3000 ఉన్న పెన్షన్ ను 4000 రూపాయలు చేశారు. కుష్టు వ్యాధితో వైకల్యం సంభవించిన వారికి పెన్షన్ కూడా 3వేల నుంచి 6 వేలకు పెరిగింది. కిడ్నీ, కాలేయం, గుండె అపరేషన్ చేసుకున్న వారికి, డయాలసిస్ చేసుకుంటున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలసరి పింఛన్ 5000 నుంచి 10000 రూపాయలకు పెంచారు. మంచానికే పరిమితమైన వారికి పింఛన్ 5000 నుండి 15 వేలకు పెరిగింది. ఈ మొత్తాలను మూడు నెలల బకాయిలతో కలిపి అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన సందర్భంగా ఎన్ టి ఆర్ భరోసా పేరుతో అందచేస్తున్నారు. జిల్లాలో 2,71,696 మందికి రూ.181 కోట్లు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ఇందుకు జిల్లా అధికారులు వారం ముందు నుండే కసరత్తును ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలో వివిధ రకాల పింఛన్లు కింద 2,72,864 మంది పించన్ అందుకుంటున్నారు. వీరిలో అభయ హస్తం అందుకుంటున్న 11,358 మందికి, సైనిక వెల్ఫేర్ పింఛన్లను అందుకుంటున్న 62 మందికి ఈ పించన్ల పెంపు వర్తించదు. మిగిలిన 2,61,554 మందికి పింఛన్ మొత్తాలు పెరగ ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో వృద్ధాప్య పెన్షన్ కింద 1,46, 023 మందికి అవ్వ తాతలకు పింఛన్లు అందజేస్తున్నారు. 2,575 మంది చేనేత కార్మికులకు, 59, 903 మంది వితంతువులకు, 35,927 మంది వికలాంగులకు, 562 మంది కల్లుగీత కార్మికులకు, 32 మంది హిజ్రాలకు, 5751 మంది ఒంటరి మహిళలకు, 248 మంది చేపలు పట్టేవారికి, 6,296 మంది డప్పు కళాకారులకు, 794 మంది చెప్పులు కుట్టే వారికి, 71 మంది కళాకారులకు పెన్షన్లు అందజేస్తున్నారు. అలాగే వివిధ వ్యాధిగ్రస్తులకు 2,764 మందికి, ప్రైవేట్ గా డయాలసిస్ చేసుకుంటున్న వారికి 303 మందికి, ప్రభుత్వపరంగా డయాలసిస్ చేసుకుంటున్నా 195 మందికి పెన్షన్లు  పెరిగాయి. పెన్షన్ మొత్తాలు భారీగా పెరగడం, వాటిని  పెంచిన  మూడు నెలల బకాయిలతో కలిపి ఇస్తుండటంతో జిల్లాలోని పింఛనుదారులలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. జరగదు అనుకున్నది జరిగినట్లు, అదృష్టం తమను వరించినట్లు పించనుదారులు సంబరపడుతున్నారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *