జిల్లాలో నేడే పింఛన్ల పండుగ
ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ
2.67 లక్షల మందికి రూ.113.48 కోట్ల పంపిణీ
పాల్గొననున్న ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు
ఉదయం 6 గంటలకే ప్రారంభం
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
జిల్లాలోని వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఒకరోజు ముందుగానే పింఛన్ల పండగ వచ్చింది. జనవరి 1వ తారీఖున సెలవు రోజు కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు చిత్తూరు జిల్లాలో అన్ని ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పూర్తి చేశారు. మంగళవారం పూర్తిస్థాయిలో పింఛన్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. మంగళవారం ఎవరైనా అందుబాటులో లేకపోతే వారికి గురువారం నాడు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జరగనున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
ఎన్టీఆర్ భరోసా కింద చిత్తూరు జిల్లాలోని 2,67,240 మందికి 113.49 కోట్ల రూపాయలను వివిధ రకాల పింఛన్లు కింద అందజేయనున్నారు. సామాజిక పింఛన్ల కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఎన్నికల నియమావళి సమయంలో వృద్దులు, వికలాంగులు పింఛన్లు తీసుకోవడానికి నానా కష్టాలు పడ్డారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద గంటల తరబడి ఎదురుచూశారు. అప్పుడు విపరీతమైన ఎండలు కావడంతో పలువురు అనారోగ్యానికి గురయ్యారు. బ్యాంకు ఖాతాలలో జమ చేయడంతో అక్కడ కూడా ఇబ్బంది పడ్డారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి పింఛన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం వాలంటీర్ల వ్యవస్థ లేకపోయినా, సచివాలయ ఉద్యోగులను గ్రామ రెవెన్యూ అధికారులను వినియోగిస్తోంది. వారి చేత ఒక రోజుల్లోనే మొత్తం పింఛన్లను పంపిణీ చేస్తుంది. రాష్ట్రస్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఏదో ఒక జిల్లాలో పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా జిల్లా మంత్రులు వారి జిల్లాల్లో పింఛన్లు పంపిణీలో పాల్గొంటున్నారు. నియోజకవర్గస్థాయిలో ఆయా శాసనసభ్యులు పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య పింఛన్లను 3000 నుంచి 4 వేల రూపాయలకు పెంచింది. అలాగే వికలాంగుల పింఛన్లను ఆరువేల రూపాయలకు పెంచింది. మంచానికి పరిమితమైన నిస్సహాయులకు 15 వేల రూపాయలను అందజేస్తుంది. పెంచిన పింఛన్లను సక్రమంగా అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు జాగ్రత్తలను తీసుకుంటుంది. గ్రామ, వార్డు స్థాయిలో పింఛన్ల పంపిణీని కూటమి నేతలు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా అవినీతి, అవకతవకలకు చోటు లేకుండా పింఛన్లు పంపిణీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పింఛనుదారుల వేలిముద్రలను తీసుకొని నిజమైన లబ్ధిదారులకే పింఛన్లు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఏ నెలకు ఆ నెల మాత్రమే పింఛన్లను అందజేసేవారు. ఏదైనా కారణం చేత ఒక నెలలో పింఛన్ తీసుకోకుంటే, మరుసటి నెలలో ఆ పింఛన్ ఇచ్చేవారు కాదు. ప్రస్తుతం అలా కాకుండా రెండు నెలల పాటు పింఛన్ తీసుకోకున్నా, మూడు నెలలకు కలిపి ఒకసారిగా పింఛను ఇచ్చే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. ఒకటవ తారీఖున సెలవు అయితే ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ జరుగుతోంది. పింఛన్ల పంపిణీపై ఉదయం నుండి సాయంకాలం వరకు నిరంతరం నిఘా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎన్ని పింఛన్లను పంపిణీ చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని ఉంటుంది. వృద్ధాప్య పెంచండి కింద 140,703 మందికి 56.68 కోట్ల రూపాయలను, 59,807 మంది వితంతువులకు 24.09 కోట్ల రూపాయలను, 2,437 మంది చేనేత కార్మికులకు 98 లక్షల రూపాయలు, 35,277 మంది వికలాంగులకు 21.31 కోట్ల రూపాయలను అందజేయనున్నారు. అలాగే అభయహస్తం పింఛన్ల కింద 549 మందికి 22 లక్షలు, 549 మంది కల్లు గీత కార్మికులకు 22 లక్షల రూపాయలు, 5714 మంది ఒంటరి మహిళలకు 2.30 కోట్లు, 243 మంది మత్స్యకారులకు 10 రూపాయలు, 6201 మంది డప్పు కళాకారులకు 2.49 కళాకారులకు 68 మందికి మూడు లక్షలు, డప్పు కళాకారులు 6201 మందికి 2.48 కోట్లు, చర్మకారులు 785 మందికి 32 లక్షలు, కళాకారులకు 68 మందికి మూడు లక్షలు, సైనిక వెల్ఫేర్ పింఛన్లు 51 మందికి 3 లక్షలు, ప్రైవేటుగా కిడ్నీ డయాలసిస్ చేసుకుంటున్నా వారికి 354 మందికి 36, లక్షలు ప్రభుత్వ వైద్యశాలల్లో కిడ్నీ డయాలసిస్ చేసుకుంటున్నా 215 మందికి 22 లక్షలు, వృత్తి కళాకారులకు 794 మందికి 32 లక్షల రూపాయలను పింఛన్లుగా అందచేస్తారు. అలాగే ప్రమాదవశాత్తున మూడు చక్రాల బండ్లకు, మంచానికి పరిమితమైన 1015 మందికి 1.3 కోట్ల రూపాయలు, ప్రమాదవశాత్తున అంగవైకల్యం సంభవించిన వారికి 921 మందికి 1.39 కోట్ల రూపాయలు, తలసేమియా వ్యాధిగ్రస్తులు 38 మందికి 4 లక్షలు, కిడ్నీ, కాలేయము, గుండె ఆపరేషన్ చేసుకున్న 124 మందికి 12 లక్షలు, కుష్టు వ్యాధిగ్రస్తులకు 414 మందికి 25 లక్షలు రూపాయలను మంగళవారం పంపిణీ చేయనున్నారు. ఉదయం ఆరు గంటలకే పించన్ల పంపిణి ప్రారంభం అవుతుంది. ఇందుకు అవసరమైన నగదు సోమవారమే బ్యాంకులకు జమ అయ్యింది. వార్డు కార్యదర్శులు మంగళవారం మొత్తాలను బ్యాంకుల నుండి డ్రా చేసి, పంపిణికి సిద్దం చేశారు.