కూటమి ప్రభుత్వం రాకతో హంద్రీనీవా సుజల స్రవంతికి మహర్దశ
రెండవ దశలో రూ. 1,453.21 కోట్లతో పరిపాలన ఆమోదం
మొదటి విడతగా 480.22 కోట్ల పనులకు మంత్రివర్గం ఆమోదం
పనులు ఆలస్యం కాకూడదని పాత గుత్తేదారులకే పనులు అప్పగింత
కాంక్రీట్ లైనింగు పనులకే ఎక్కువ నిధులు కేటాయింపు
కాల్వ ప్రవాహ సామర్థ్యం 145 నుంచి 282 క్యూసెక్కులకు పెంపు
మే నెలాఖరుకు పనులు మొత్తం పూర్తి కావాలని సిఎం ఆదేశాలు
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు మీద ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఈ ప్రాజెక్టును మరో ఆరు నెలల్లో పూర్తి చేసి చిత్తూరు జిల్లా రైతాంగానికి సాగునీటిని అందజేయాలని నిర్ణయించింది. అలాగే జిల్లా మొత్తానికి తాగునీటిని కూడా సరఫరా చేయాలని ప్రణాళికలను రూపొందిస్తుంది. ఇందులో భాగంగా రెండవ విడత 1,453.21 కోట్ల రూపాయలతో పరిపాలన ఆమోదం తెలిపింది. మొదటి విడతగా 480.22 కోట్ల పనులకు గురువారం జరిగిన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పనులు ఆలస్యం కాకూడదని పాత గుత్తేదారునికి, పాత ధరలతోనే కొనసాగుతున్న పనులను అప్పగించింది. కాల్వల నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఇక కాలువలలో నీరు ఇంకకుండా కాంక్రీట్ వేసి నీటిని సరఫరా చేయడమే తరువాయి. ఇందుకు భారీగా నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కాల్వ ప్రవాహ సామర్ధన్ని 145 క్యూసెక్కుల నుంచి 282 క్యూసెక్కులకు పెంచింది. అనుకున్న విధంగా ఈ ప్రాజెక్టు పూర్తి అయితే, మరో ఆరు నెలల్లో చిత్తూరు జిల్లా సస్యశ్యామలం కానుంది.
హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను సత్వరం పూర్తి చేయడానికి రెండవ దశలో 480.22 కోట్ల పనిని పాత గుత్తేదారులకు, పాత ఒప్పందం మేరకు ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పనులు ఇప్పుడు చేస్తున్న ఎన్సిసి కంపెనీకి ఇవ్వాలని నిర్ణయించారు. పాత పని పరిధి నవీకరించడం వల్ల ఈ అంశాన్నిగురువారం మంత్రి మండలిలో ఆమోదం తీసుకున్నారు. పుంగనూరు బ్రాంచ్ కాలవలో 74వ కిలోమీటర్ నుంచి 189 కిలోమీటర్ల వరకు కాల్వ ప్రవాహ సామర్ధ్యాన్ని ప్రస్తుతమున్న 145 క్యూసెక్కుల నుంచి 282 క్యూసెక్కులకు పెంచేలా సీసీ లైనింగ్ పనులు చేపట్టాలని నిర్ణయించారు. గతంలో హంద్రీనీవాలో 1920 కోట్ల చేపట్టిన పనులలో మిగిలిన నిధులను ఈ పనులకు ఉపయోగించుకుంటారు. ఈ పనులకు గతంలో టెండర్లు పిలిచారు. ఎన్సిసి కంపెనీ పనులు చేస్తుంది. పాత ఒప్పందం మేరకు పాత ధరలతోనే ఈ పనులు అప్పగించారు. పని పరిధి మారడంతో మంత్రిమండలి ముందు ఉంచి, ఆమోదం పొందారు. హంద్రీనీవా సుజల స్రవంతి రెండవ దశలో కాలువ ప్రవాహ సామర్థ్యం పెంచేలా లైనింగ్ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం విడివిడిగా పరిపాలన ఆమోదం తెలుపుతూ మూడు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 1,453.21 కోట్ల రూపాయలతో ఈ పనులు పట్టనున్నారు. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలలో రెండవ దశ కింద 216.300 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల వరకు సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ పనులతో పాటు ఇతర పెండింగ్ పనులకు 936.70 కోట్లతో పరిపాలన ఆమోదం ఇచ్చారు. హంద్రీనీవా రెండవ దశలో దశలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ అధినికికరణ పనులు చేపడానికి రెండు భాగాలు చేశారు. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 0 కిలోమీటర్ నుంచి 22వ కిలోమీటర్ల వరకు సిమెంట్ కంక్రిట్ లైనింగ్ తో పాటు ఇతర కట్టడాల పనులు చేపట్టేందుకు 112.40 కోట్లు, ఇదే కాలువలు 26.2 కిలోమీటర్ల నుంచి 75 కిలోమీటర్ల వరకు అవసరమైన సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ పనులకు 207.20 కోట్ల రూపాయలతో పాలనామోదం ఇచ్చారు. మరోవైపు కుప్పం బ్రాంచ్ కాలవల ఆధునికరణ పనులు చేపడుతున్నారు. పలమనేరు కుప్పం నియోజకవర్గంలో బ్రాంచ్ కెనాల్ సున్నా కిలో మీటర్ నుంచి 66.950 కిలోమీటర్ల వరకు సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ పనులకు 99.20 కోట్లు, అదే కాలువలు ఆ తర్వాత 131.20 కిలోమీటర్ల వరకు లైనింగ్ పనులకు 97.71తో పరిపాలన ఆమోదం ఇచ్చారు. తొందరలోనే టెండర్ల బ్రిసి పనులను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా మొదటి విడతగా పుంగనూరు, కుప్పం బ్రాంచి కాలువల కాంక్రీట్ లైనింగ్ పనుల కోసం కూటమి ప్రభుత్వం రూ.516 కోట్లను విడుదల చేస్తూ గతవారం ఉత్తర్వులు జారీ చేసింది. అడవిపల్లె రిజర్వాయర్ వద్ద పూర్తయ్యే ప్రధాన కాలువలోనూ కాంక్రీట్ లైనింగ్ పనుల కోసం రూ.500 కోట్లతో ప్రతిపాదనలు పంపి ఉండగా, మరో వారం పది రోజుల్లో ఆ నిధులు కూడా మంజూరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లోని తాగు, సాగునీటి అవసరాల కోసం రూపుదిద్దుకున్న హంద్రీనీవా సుజల స్రవంతి పథకంలో కుప్పం బ్రాంచి కెనాల్ పనులు 2019లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయడంపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు హంద్రీనీవా మీద ప్రత్యేక దృష్టి సారించారు. సీఎంగా తొలిసారి కుప్పానికి వచ్చిన ఆయన, వెంటనే హంద్రీనీవా కాలువను పరిశీలించారు. పూర్తి చేసేందుకు ప్రతిపాదనలు పంపమని ఆ శాఖ అధికారులకు సూచించారు. 2019లో మిగిలిపోయిన 10 శాతం పనుల్ని దాదాపు పూర్తి చేయించేశారు. ఇక ఒక శాతం పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా పుంగనూరు, కుప్పం బ్రాంచి కెనాల్స్‌కు కాంక్రీట్ లైనింగ్ పనుల కోసం పెద్దఎత్తున నిధుల్ని మంజూరు చేశారు. కుప్పం బ్రాంచి కెనాల్ (కేబీసీ)లో కాంక్రీట్ లైనింగ్ పనుల కోసం రూ.197 కోట్లను కేటాయించారు. ఈ పనుల్ని రెండు విడతల్లో పూర్తి చేయనున్నారు.66.95వ కిలోమీటరు వరకు రూ.99.2 కోట్లను కేటాయించగా.. అక్కడినుంచి 131.2వ కిలోమీటరు వరకు కుప్పం పట్టణం సమీపంలోని పరమసముద్రం చెరువు వరకు రూ.97.71 కోట్లను కేటాయించారు. కుప్పం బ్రాంచి కెనాల్.. పుంగనూరు బ్రాంచి కెనాల్‌కు చెందిన 207.9వ కిలోమీటరు వద్ద ప్రారంభమై 131 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. పుంగనూరు బ్రాంచి కెనాల్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రారంభమై, ఆ జిల్లాలో 75 కిలోమీటర్లు, మన ఉమ్మడి జిల్లాలో 145 కిలోమీటర్లు.. మొత్తంగా 220 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ప్రస్తుతానికి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రయాణించే 0-75 కిలోమీటర్ల కెనాల్ లైనింగ్ పనుల కోసం రూ.319 కోట్లను మంజూరు చేశారు. దీన్ని కూడా రెండు ప్రాజెక్టులుగా పనులు చేయనున్నారు. 0-22 కిలోమీటర్ల వరకు రూ.112.40 కోట్లతో, 22-75 కిలోమీటర్ల వరకు రూ.207.20 కోట్లతో పనులు చేపట్టనున్నారు. చిత్తూరు జిల్లా పరిధిలోని పుంగనూరు బ్రాంచి కెనాల్ 75-220 కిలోమీటర్లు కెపాసిటీని 380 క్యూసెక్కుల నుంచి 1180 వరకు పెంచేందుకు వైసీపీ హయాంలో రూ.1219.93 కోట్లతో టెండర్లు ఖరారయ్యాయి. ఇప్పుడు ఆ విస్తరణ పనుల్ని రద్దు చేసి కాంక్రీట్ లైనింగ్ చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ఈ క్రమంలోనే అప్పట్లో ఒప్పందం చేసుకున్న సంస్థతో లైనింగ్ పనులు చేయించేందుకు చర్చలు జరుగుతున్నాయి. హంద్రీనీవా ప్రధాన కాలువ విషయానికొస్తే.. ఇది 554.175 కిలోమీటర్లు ప్రయాణించి ఉమ్మడి చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలంలోని అడవిపల్లె రిజర్వాయర్ వద్ద ముగుస్తుంది. ప్రధాన కాలువలో 400 కిలోమీటర్ల వరకు లైనింగ్ పనులు చేసేందుకు ఇప్పటికే నిధులు మంజూరు కాగా పనులు జరుగుతున్నాయి. ఇక మిగిలిన 400-554.175 కిలోమీటర్లతో పాటు అడవిపల్లె నుంచి చిత్తూరుకు నీళ్లు ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్న నీవా బ్రాంచి కెనాల్‌కూ లైనింగ్ పనులు చేసేందుకు రూ.500 కోట్లతో ప్రతిపాదనలు గతంలోనే పంపించారు. ఈ నిధులు కూడా వారం పది రోజుల్లో మంజూరయ్యే అవకాశముంది. కాంక్రీట్ లైనింగ్ పనులు చేస్తే వంద శాతం నీళ్లు చివరి వరకు చేరుతాయి. లేకుంటే కనీసం 50 శాతం నీళ్లను భూమి పీల్చుకుంటుంది. వేగం కూడా తగ్గుతుంది. 10 రోజుల్లో ఇవ్వాల్సిన నీళ్లను 20 రోజుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు కోసం డిజైన్ చేసిన పంపుల కెపాసిటీ కూడా లైనింగ్‌కు అనుగుణంగా సిద్ధం చేశారు. పుంగనూరు, కుప్పం బ్రాంచి కాలువల్లో లైనింగ్ పనుల్ని పూర్తి చేయడానికి 18 నెలల పాటు అగ్రిమెంట్ పీరియడ్ ఉన్నప్పటికీ.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన పనుల్ని చేపట్టనున్నారు. మే 31లోగా పనులు పూర్తి చేసి, జూన్‌లోనే నీళ్లు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే అక్టోబరు కల్లా పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.