లికేజి నేపధ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు
ప్రశ్నాపత్రాలను పోలీస్ స్టేషన్ లకు తరలింపు
కస్టోడిన్లుగా మండల విద్యాశాఖ అధికారులు
పేపర్ లీక్ అయితే వారిదే భాద్యత
గణితం ప్రశ్నాపత్రం రద్దు
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
సామాజిక మాధ్యమాలలో ఉన్నత పాఠశాల గణితం ప్రశ్న పత్రాలు లీక్ కావడంతో పాఠశాల విద్యాశాఖ దిద్దుబాటు చర్యలను చేపట్టింది. తదుపరి పరీక్ష పత్రాలు లీక్ కాకుండా గట్టి ఏర్పాట్లను చేసింది. ఇక మీదట ప్రశ్నాపత్రాలను పబ్లిక్ పరీక్షల ప్రశ్నాపత్రాల వల్లే పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలని విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. పోలీస్ స్టేషన్ నుంచి పరీక్షకు గంటకు ముందుగా మాత్రమే ప్రశ్నాపత్రాలను తీసుకొని వెళ్లాలని కోరింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రశ్నపత్రాల లీకేజీలు జరగకుండా నలుగురు నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. గణితం ప్రశ్న పత్రాలు లీకేజీ మీద విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసు అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.
గణితం ప్రశ్న పత్రాల లీక్ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులకు, మండల విద్యాశాఖ అధికారులకు పలు ఆదేశాలను విద్యాశాఖ ఉన్నతాధికారులు జారీ చేశారు. పరీక్షలకు సంబంధించి అధికారిక గ్రూపులలో వచ్చిన రహస్య సందేశాలను ఇతర గ్రూపులలో పంచుకోకూడదని ప్రభుత్వం నిర్దేశించింది. అలా ఏదైనా గ్రూపులో పరీక్షలకు సంబంధించిన రహస్య సమాచారం వెల్లడి అయితే, ఆ గ్రూపు అడ్మిన్లను బాధ్యులుగా చేస్తామని హెచ్చరించింది. శుక్రవారం జరిగిన గణిత శాస్త్రం ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా మిగిలిన ప్రశ్న పత్రాలన్నింటిని పోలీస్ స్టేషన్లో జమ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యియి. అలాగే వర్షం కారణంగా రద్దు అయిన హిందీ, ఇంగ్లీష్ ప్రశ్నపత్రాలను కూడా పోలీస్ స్టేషన్ లలో జమ చేయాలని కోరింది. సోమవారం జరిగిన గణిత శాస్త్రం ప్రశ్నాపత్రాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. దాని స్థానంలో కొత్తగా ప్రశ్నాపత్రాన్ని ముద్రించి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. రద్దు చేసిన గణితం పరీక్ష 6 నుండి 10వ తరగతి వరకు ఈ నెల 20వ తారీఖున జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రశ్నాపత్రాల కస్టోడిన్లుగా మండల విద్యాశాఖ అధికారులను నియమించారు. పేపర్ లీకేజీ సమస్య ఎక్కడైనా వెలుగులోకి వస్తే సంబంధిత మండల విద్యాశాఖ అధికారులను బాధ్యులుగా చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. కస్టోడియన్స్ గా వ్యవహరించే మండల విద్యాశాఖ అధికారులు పరీక్షకు గంట ముందుగా పేపర్లను పోలీస్ స్టేషన్ వద్ద ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేయాలని ఆదేశించింది. అలాగే మధ్యాహ్నం జరిగే పరీక్షలకు కూడా గంటకు ముందే పోలీస్ స్టేషన్ వద్ద అందజేయాలని కోరింది. గణితం పరీక్షను 20వ తేదీన నిర్వహిస్తారు. వర్షం వల్ల వాయిదా పడిన హిందీ పరీక్ష 21వ తేదీన, ఇంగ్లీష్ పరీక్ష 23వ తేదీన నిర్వహిస్తారు. మిగిలిన పరీక్షలను యధావిధిగా నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. గతంలో అర్థ సంవత్సర, సంవత్సర పరీక్షలను జిల్లాస్థాయిలో నిర్వహించేవారు. ఇందుకు అవసరమైన ప్రశ్న పత్రాలను జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ముద్రించి జిల్లా స్థాయిలో అన్ని పాఠశాలలకు సరఫరా చేసేది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్థ సంవత్సర, సంవత్సర పరీక్షలను సమ్మేటివ్ 1,2 గా మార్పు చేసింది. ప్రశ్నా పత్రాలను రాష్ట్రస్థాయిలోనే ముద్రించి అన్ని జిల్లాలకు సరఫరా చేయాలని నిర్ణయించింది. ప్రశ్నపత్రాలను పోలీస్ స్టేషన్లో కాకుండా మండల విద్యాశాఖ అధికారుల కార్యాలయంలో, స్కూల్ కాంప్లెక్స్ లో నిల్వ చేసింది. దీని ఫలితంగా గణితం పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షను వాయిదా వేయల్చి వచ్చింది. దీంతో మేల్కొన్న ప్రభుత్వం ప్రశ్నపత్రాలను పోలీస్ స్టేషన్ లకు తరలించడానికి ఏర్పాట్లు చేపట్టింది. పోలీస్ స్టేషన్లో నుండి గంటకు ముందుగా ప్రధాన ఉపాధ్యాయులకు ప్రశ్నపత్రాలు అందజేస్తుంది. ఈ మేరకు లీకేజీలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ చర్యలు ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయో వేచి చూడాలి.