22, డిసెంబర్ 2024, ఆదివారం

హంద్రీనీవా ప్రాజెక్టు పై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి

ప్రాజెక్టు పూర్తి అయితే ఉమ్మడి జిల్లాలో 1,55,350 ఎకరాలకు సాగునీరు 

మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో  37 వేల ఎకరాలకు లబ్ధి

పుంగనూరు కుప్పం బ్రాంచి కెనాల్ పూర్తి అయితే  43 వేల ఎకరాలకు నీళ్లు

110 చెరువులకు సాగు నీరు, 40 లక్షల మందికి తాగునీరు


(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  సొంత జిల్లా చిత్తూరుకు జీవనాడి అయిన హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు మీద ప్రత్యేక దృష్టిని సారించారు. ఈ ప్రాజెక్టు మీద ఇప్పటికే ప్రభుత్వాలు 11 వేల కోట్ల రూపాయలను వ్యయం చేశాయి. పనులు దాదాపుగా పూర్తి అయినట్లు కనిపించినా, కుప్పం, పుంగనూరు బ్రాంచ్ కాలువలకు సాగు నీరు రావడం లేదు. ఉప కాలువల నిర్మాణాలు పూర్తయితే ఉమ్మడి జిల్లాలో 1,55,350 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులు పనులు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టు పనులు పూర్తి అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో మాత్రం దాదాపు 37 వేల ఎకరాలకు ఆయకట్టు నీరు అందుతుందని అధికారులు అంటున్నారు. అలాగే 110 చెరువులకు సాగు నీరు అందుతుంది. పుంగనూరు కుప్పం బ్రాంచ్ కాలవ పనులు పూర్తి అయితే కృష్ణా జలాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు వస్తాయి. సుమారు 43 వేల ఎకరాలకు సాగునీరు, 40 లక్షల మందికి తాగునీరు అందుబాటులోకి వస్తుంది. 


కూటమి ప్రభుత్వం ఆరు సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వగా అందులో హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కూడా ఉంది. కృష్ణాజిల్లాలను తీసుకుని వచ్చి రాయలసీమ జిల్లాల్లోని బీడు భూములను సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో హంద్రీనీవా సుజల స్రవంతి కాలువను నిర్మించారు. గత ప్రభుత్వం ప్రత్యేకించి పుంగనూరు ఉప కాల్వపైనే దృష్టి సారించి, మిగిలిన ఉప కాల్వలపై శీతకన్ను వేసింది.  తొమ్మిది ఉప కాల్వల నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అలాగే గత వైసిపి ప్రభుత్వం గాలేరు నగరిని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు రావడంతో సాగు, తాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ వస్తుందని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. శ్రీశైలం నుంచి రాయలసీమ జిల్లాలకు కృష్ణా జలాలను తీసుకురావడానికి హంద్రీ నీవా ప్రధాన కాలువతో పాటు మరో 10 ఉప కాలువలు నిర్మించారు. ప్రధాన కాలువ అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం మడుగువారి పల్లి వద్ద ప్రారంభమై కేవీ పల్లి మండలం అడవిపల్లె వద్ద ముగిస్తుంది. అడవి పల్లి రిజర్వాయర్ నుంచి చిత్తూరు మున్సిపాలిటీకి తాగు నీటిని రెండు సరఫరా చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం ఒక ప్రభుత్వ పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రధాన కాల్వకు అనుసంధానంగా పుంగనూరు, నీవా, కుప్పం, వాల్మీకిపురం, తంబళ్లపల్లె, చింతపర్థి, ఎల్లుట్ల, గుడిసె బండ కాలువలను తవ్వించారు. ఇందులో పుంగునూరు, కుప్పం ఉప కాల్వకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి, మిగిలిన వాటిపై దృష్టిని సారించలేదు. దీంతో మిగిలిన ఉప కాల్వల పనులు ముందుకు సాగలేదు. పుంగనూరు ఉపకాల్వ 220.35 కిలోమీటర్ల పొడవు ఉండగా 96 శాతం పూర్తయింది. నీవా ఉపకాల్వ 122.5 కిలోమీటర్లు ఉంది. ఇది 78 శాతం పూర్తయింది. కుప్పం ఉపకాల్వ 123.64 కిలోమీటర్లు ఉంది. ఇది 94 శాతం పూర్తయింది. వాల్మీకిపురం ఉపకాల్వ 23.5 కిలోమీటర్లు ఉంది. ఇది 73 శాతం పూర్తయింది. తంబళ్లపల్లి ఉపకాల్వ 29.43 కిలోమీటర్లు ఉంది. ఇది 87 శాతం పూర్తయింది. చింతపర్తి ఉపకాల్వ 42.3 కిలోమీటర్లు ఉంది. ఇది 75 శాతం పూర్తి అయింది. ఎల్లుట్ల ఉపకాల్వ 25 కిలోమీటర్లు ఉంది. దీనిని 68 శాతం పూర్తి చేశారు. గుడిసిబండ ఉపకాల్వ 9.45 కిలోమీటర్లు ఉంది. 13 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. సదం ఉపకాల్వ 39 కిలోమీటర్లు ఉంది. ఈ పని 84 శాతం పూర్తికావచ్చాయి. మిగిలిన 100 శాతం పనులు పూర్తి కావాలంటే 429 కోట్ల రూపాయలు అవసరమని హంద్రీ నీవా అధికారుల అంచనా వేశారు. వీటన్నింటిని పూర్తి చేస్తేనే నిర్దేశించుకున్న బీడు భూమికి సాగునీరు అందించే అవకాశం ఉంటుంది. కాగా ఉప కాలువల్లో నీటిని ఎత్తిపోసేందుకు పదేళ్ల ముందు కోట్లాది రూపాయలు పెట్టీ కొనుగోలు చేసిన 29 ఖరీదైన మోటర్లు, సామాన్లు తప్పబట్టి పోతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టింది. జిల్లాలో మెట్ట భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు పోతుంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గానికి చెందిన కుప్పం బ్రాంచ్ కాలువ పనులు పూర్తి చెయ్యడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. కుప్పం, గుడిపల్లె, శాంతిపురం మండలాల్లో పనులు పెండింగ్ లో ఉన్నాయని అధికారులు అంటున్నారు. కుప్పంలో కాలువ పనులకు భూములు ఇచ్చిన రైతులకు రూ. 17 కోట్లు బకాయిలు చెల్లించాలి. హంద్రీ నీవా కాలువ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు సుమారు రూ. 29 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ మేరకు అధికారులు కూటమి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ప్రకారం ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేసి విడుదల చేసింది. రెండవ విడత మొత్తం పనులకు 1,453.21 కోట్ల రూపాయలతో పరిపాలన ఆమోదం తెలిపింది. మొదటి విడతగా 480.22 కోట్ల పనులకు గురువారం జరిగిన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నాలుగైదు నెలల్లో హంద్రీనీవా సుజల స్రవంతి సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లాకు సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *