రైతులను నిరాశ పరచిన మామిడి బీమా పథకం
ప్రీమియం ఎక్కువ - గడువు తక్కువ
మామిడి దిగుబడి తగ్గితే బీమా లేదు
మామిడికి గిట్టుబాటు ధర ప్రస్తావన లేదు
మామిడి బోర్డును మరచిన ప్రభుత్వం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకుని వచ్చిన మామిడి పంటల బీమా పథకం జిల్లాలోని మామిడి రైతులను నిరాశకు గురిచేసింది. రైతులకు మేలు చేసే విధంగా ఈ పథకం రూపకల్పన జరగలేదని మామిడి రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగతా పంటలతో పోల్చుకుంటే బీమా ప్రీమియం కూడా ఎక్కువ. ఈ పథకాన్ని కొత్తగా ప్రవేశపెట్టినా, గడువు మాత్రం చాలా తక్కువ. డిసెంబర్ 15వ తేదీతో ఈ పథకం ముగుస్తుంది. పంట నష్టాన్ని మండలం యూనిట్ గా తీసుకుంటారా లేక జిల్లా యూనిటీగా తీసుకుంటారా అనే విషయంలో స్పష్టత లేదు. బీమాకు, మామిడి దిగుబడికి సంబంధం లేదు. వాతావరణ పరిస్థితులను మాత్రమే పరిగణనకు తీసుకొని బీమాను చెల్లిస్తారు. మామిడి దిగుబడి తగ్గిన ఈ బీమాకు సంబంధం లేదు. మామిడికి గిట్టుబాటు ధర లేకుండా ఈ బీమా వర్తించదు. రైతులను ఆడుకోవడానికి మ్యాంగో బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా, బడ్జెట్లో కానీ పంటల బీమా పథకంలో కానీ ఎలాంటి ప్రకటన లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మామిడి పంటల బీమా పథకం మామిడి రైతులను ఆకర్షించడం లేదు. రైతులు కోరుకున్న విధంగా పంటల బీమా పథకాన్ని రూపకల్పన చేయకపోవడంతో బీమా ప్రీమియం కట్టడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు.
చిత్తూరు జిల్లాలో భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, జీవ నదులు లేవు. రైతులు వ్యవసాయానికి బోరు బావుల మీదనే ఆధారపడాల్సి వస్తుంది. జిల్లాలో వర్షాలు తగ్గి తరచుగా కరువు కాటకాలు ఏర్పడుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. దీంతో రైతులు మామిడి పంటల పంటపైన ఆసక్తిని చూపుతున్నారు. జిల్లాలో క్రమంగా మామిడి పంటల విస్తీర్ణం పెరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో లక్ష 50 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. 70 వేల మంది రైతులు మామిడి మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం మామిడి రైతులకు కష్టనష్టాలు తప్పడం లేదు. గిట్టుబాటు ధర రావడం లేదు. అకాల వర్షాలు, చీడ పీడల కారణంగా పంట నష్టం భారీగా జరుగుతుంది. కాయ పక్వానికి వచ్చిన దశలో సకాలంలో కాయలు కోయడానికి కూడా జిల్లాలోని మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు సహకరించడం లేదు. జ్యూస్ ఫ్యాక్టరీలు ధరలను తమ ఇష్టానుసారం నిర్ణయిస్తున్నాయి. రోజుకో ధరను నిర్ణయిస్తూ రైతులను అయోమయానికి గురిచేస్తున్నాయి. రైతులకు ఏ సంవత్సరం కూడా గిట్టుబాటు ధర లభించడం లేదు. మామిడి పంట కూడా సైకిల్లాగా ఒక సంవత్సరం పంట అధికంగా వస్తుంది. మరో సంవత్సరం తగ్గుతుంది. దీనిని నియంత్రించడానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పంట భారీగా వచ్చినా, తక్కువగా వచ్చిన రైతులకు గిట్టుబాటు ధర మాత్రం లభించడం లేదు. ఇందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తరపున ఎలాంటి చర్యలు ఉండడం లేదు. జిల్లాలోని జ్యూస్ ఫ్యాక్టరీలు తమ ఇష్టానుసారం ధరలను నియంత్రించి, మామిడి రైతులను నష్టాలు పాలు చేస్తున్నాయి. వీటిని అధిగమించడానికి రైతులకు గిట్టుబాటు ధర లభించే విధంగా మామిడికి భీమ సౌకర్యం ఉంటుందని రైతులు భావించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వచ్చిన మామిడి పంటల బీమా పథకంలో అలాంటి ఏర్పాట్లు ఏమీ లేవు. మామిడి బోర్డును ఏర్పాటు చేస్తే మామిడి ధరల నిర్ణయంలో ఈ బోర్డు ప్రమేయం ఉంటుందని మామిడి రైతులు ఆశపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాంగో బోర్డు గురించి ఇప్పటివరకు ప్రస్తావించలేదు. పైగా మామిడి పంటకు బీమా ప్రీమియం కూడా చాలా ఎక్కువ. వరి పంటకు ఎకరాకు 82 రూపాయల చెల్లిస్తే, 40 వేల రూపాయల బీమా ఉంటుంది. మండలాన్ని యూనిట్ గా తీసుకొని నష్టపరిహారాన్ని చెల్లిస్తారు. అలాగే వేరుశనగ పంటకు 60 రూపాయలను బీమా ప్రీమియంగా చెల్లిస్తే 30 వేల రూపాయలు నష్టపరిహారంగా చెల్లిస్తారు. జిల్లాను యూనిట్ గా తీసుకొని వేరుసెనగకు నష్టపరిహారం అందుతుంది. అయితే మామిడి కి మాత్రం బీమా ప్రీమియం కింద ఎకరాకు 1,750 రూపాయలు చెల్లించాలి. ఇంత మొత్తం చెల్లించిన బీమా 35వేల రూపాయలే. ఈ బీమాను మండలం యూనిట్గా అమలు చేస్తారా జిల్లా యూనిటీ చేస్తారా అనేది స్పష్టత లేదు. వాతావరణ పరిస్థితుల్లో ఆధారంగా మాత్రమే బీమాను అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో రైతులకు స్పష్టత రావడం లేదు. వాతావరణం లోని మార్పులను ఎలా గుర్తిస్తారో, ఎవరు నమోదు చేస్తారో తెలియని పరిస్థితి. చిత్తూరు జిల్లాలో వరి, వేరుశనగ, టమాటో పంటలకు పంటల బీమా పథకం వర్తిస్తుంది. కొత్తగా మామిడిని కూడా ఈ జాబితాలో చేర్చారు. అయితే వ, వేరుశనగ, టమాటో పంటలకు బీమా ప్రీమియం చెల్లించడానికి ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. మామిడికి బీమా పథకాన్ని ప్రకటించి వారం రోజులు కూడా కావడం లేదు. మరో రెండు రోజుల్లో బీమా ప్రీమియం గడువు చెల్లింపు ముగుస్తుంది. దీంతో రైతులకు సరైన అవగాహన లేక ఈ పథకాన్ని వినియోగించుకునే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. రైతులు బీమా ప్రీమియంను బ్యాంకు ద్వారా లేదా కామన్ సర్వీస్ సెంటర్ లేదా భీమా కంపెనీ ద్వారా లేదా ఇన్సూరెన్స్ ఏజెంట్ ద్వారా బీమా ప్రీమియం చెల్లించవచ్చు. నేరుగా కేంద్ర ప్రభుత్వ బీమా పోర్టర్ ద్వారా కూడా బీమా ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది. ఇందుకు బ్యాంక్ అకౌంట్ బుక్, ఆధార్ కార్డు, భూమి పాసుబుక్, పంట వేసినట్టు ధ్రువపత్రం సమర్పించాల్సి ఉంటుంది. భీమా చేసిన తర్వాత డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి నెలాఖరు లోపు అకాల వర్షం, అధిక వర్షపాతం సంభవిస్తే ఈ పథకం వర్తిస్తుంది. అలాగే చీడపీడలు, వాతావరణం ముసురు, తేమ ఉన్నా వర్తిస్తుంది. జనవరి 1 నుంచి మార్చి 15వ తారీకు లోపు ఉష్ణోగ్రతలో వ్యత్యాసం కారణంగా పంట దెబ్బతింటే బీమా వస్తుంది. మార్చి 1వ తారీఖు నుంచి మే 31 వ తారీఖు వరకు అధిక గాలి కారణంగా పంట దెబ్బతిన్నా నష్టపరిహారానికి అర్హులే. డిసెంబర్ 15వ తారీఖు నుంచి మార్చి నెలాఖరు వరకు అధిక వర్షపాతం, గాలిలో తేమ శాతం, వాతావరణ వ్యత్యాసం అధిక గాలి వేగం సంబంధించిన పరిణామాలకు మండల స్థాయిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వాతావరణ పరికరాల సహాయంలో లెక్కించి ఈ పథకంలో ముందుగా నిర్దేశించిన పరిణామాలతో సరిపోల్చి, వచ్చిన తేడా ఆధారంగా నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని ప్రభుత్వం తెలియజేసింది. ఈ నియమ నిబంధనలు అయోమయంగా ఉన్నాయి. సామాన్య రైతులకు అర్థమయ్యే పరిస్థితి లేదు. వీటిని రైతులకు వివరించడానికి ఉద్యానవన అధికారులు కూడా సరైన శిక్షణ, అవగాహన లేదు. ఈ నియమ నిబంధనలు చాలామంది ఉద్యానవన శాఖ అధికారులకు అర్థం కావడం లేదు. వారు ఇక రైతులకు ఎంత మాత్రం వివరిస్తారో, రైతులు ఎంతవరకు అర్థం చేసుకుని సద్వినియోగం చేసుకుంటారో వేచి చూడాలి.
*బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలి*
ఇతర పంటలతో పోల్చుకుంటే మామిడికి బీమా ప్రీమియం చాలా ఎక్కువ. ఈ మొత్తాన్ని భరించే పరిస్థితులు జిల్లాలో రైతులు లేరు. ప్రతి సంవత్సరమూ మామిడి రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఏదో రకంగా నష్టపోతూనే ఉన్నారు. బీమా ప్రీమియం రైతులకు అదనపు భారమవుతుంది. ప్రతి సంవత్సరం రైతులు ఎకరా మామిడి తోట 50వేల రూపాయల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇంత పెట్టుబడి పెట్టిన రైతులకు గిట్టుబాటు ధర వస్తుందన్న నమ్మకం లేదు. కావున ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వమే రైతుల తరఫున బీమా ప్రీమియం చెల్లించాలి.
పో రై గంగ 2 ఉప్పలపాటి. భాస్కర్ నాయుడు, కస్తూరినాయని పల్లి.
*బీమా ప్రీమియం గడువు పెంచాలి*
రాష్ట్ర ప్రభుత్వం మామిడి పంటకు బీమాను ప్రకటించి వారం రోజులు కూడా కాలేదు. మరో రెండు రోజుల్లో భీమా చెల్లించడానికి గడువు ముగుస్తుంది. బీమా ప్రీమియం కూడా ఇతర పంటలతో పోల్చుకుంటే చాలా ఎక్కువ. మామిడి బీమా పథకం మీద తొలుత ఉద్యానవన శాఖ అధికారులు మామిడి రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇందుకు మండలాల వారీగా మామిడి రైతుల సదస్సులను నిర్వహించాలి. పంట నష్టం ఎలా లెక్కిస్తారో, ఎంత నష్టపరిహారం చెల్లిస్తారో అనే దానిపైన స్పష్టత ఇవ్వాలి. అప్పుడే రైతులు బీమా కట్టడానికి ముందుకు వస్తారు. ఈ పథకం లక్ష్యం నెరవేరుతుంది.
గంగ 3 తేనెపల్లి. చంద్రారెడ్డి, జంగాలపల్లి
*దిగుబడి తగ్గితే నష్టపరిహారం ఇవ్వాలి*
దిగుబడి ఆధారంగా మామిడి పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి. రైతులకు తెలియని, అర్థం కాని వాతావరణ పరిస్థితిలో ఆధారంగా మామిడి పంటల బీమాను అమలు చేయడం అర్థరహితం. గ్రామం లేక మండలం యూనిట్ గా మామిడి పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి. మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఎత్తు తగ్గులు లేకుండా స్థిరమైన ధరను ఏర్పాటు చేయాలి. అదరకు తక్కువగా మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు చెల్లిస్తే ఆ మొత్తాన్ని ప్రభుత్వం రైతులకు తిరిగి చెల్లించాలి. ఈ మొత్తాన్ని పర్యవేక్షించడానికి చిత్తూరు జిల్లాలో మామిడి బోర్డును ఏర్పాటు చేయాలి.
గంగ 4 ఈదల. చంద్రశేఖర్, పెండ్లిగుండ్ల పల్లి.
.
.