పదోన్నతులు లేక ఉపాధి హామీ, డ్వామా ఉద్యోగుల ఆవేదన
అయిదు సంవత్సరాలుగా వీరిని పట్టించుకోని జగన్ ప్రభుత్వం
పదోన్నతులు లేక జీతాలు పెరుగక ఆవేదనలో సిబ్బంది
నిధులు ఉన్న, సంక్షేమ కార్యక్రమాల ఉసే లేదు.
కూటమి ప్రభుత్వం మీదనే గంపెడు ఆశలు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
పదోన్నతులు కరువై, రాజకీయ ఒత్తిళ్లు అధికమై, సంక్షేమానికి దూరమై పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ పరిధిలోని ఉపాధి హామీ, డ్వామా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి మాతృ శాఖలో 19 నుంచి 23 ఏళ్ల గా ఉపాధి హామీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. గ్రామీణ అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు గత ప్రభుత్వం పి ఆర్ సి ప్రకారం 23 శాతం జీతాలు పెంచకపోగా, పదోన్నతులు కూడా కల్పించలేదు. దీంతో ఉద్యోగులు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురైన గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులు కూటమి ప్రభుత్వం పై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 - 2019 మధ్యకాలంలో అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి ఏపీడీల దాకా పదోన్నతులు కల్పించారు. ఏపీడీలకు అడిషనల్ పీడీలగా పదోన్నతులు కల్పించిన ఘనత అప్పటి మంత్రి నారా లోకేష్ కు దక్కింది. 20 శాతం వేతనాలు పెంచారు. అప్పటి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్, ప్రస్తుత ఎమ్మెల్యే జి. రామాంజనేయులు ఉద్యోగులలో ఆత్మవిశ్వాసం నింపారు. ప్రోత్సహిస్తే ఉపాధి హామీ ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించారు.
జిల్లాలో 500 మంది వరకు ఉపాధి హామీ, డ్వామా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి గత వైయస్సార్సీపి ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో మొండి చెయ్యి చూపింది. దీంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు గా ఉన్నారు. అయన మీద గ్రామీణాభివృద్ధి మాతృ శాఖ ఉద్యోగులైనటువంటి ఉపాధి హామీ, డ్వామా ఉద్యోగులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న పి.ఆర్.సి ప్రకారం 23 శాతం జీతాలు పెంచడంతోపాటు ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి ఏపీడీ, అడిషనల్ పీడీ ల వరకు పదోన్నతులు కల్పించాల్సి ఉంది. అలాగే అన్ని క్యాడర్ల ఉద్యోగులకు గ్రేడ్ ఫిక్సేషన్ చేయాల్సి ఉంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి మాతృ శాఖలో పనిచేస్తున్న ఉపాధి హామీ డ్వామా ఉద్యోగులకు టైం స్కేల్ అమలుకు శ్రీకారం చుట్టి చరిత్ర సృష్టించింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సెలక్షన్ కమిటీ (డి.ఎస్.సి ) ఆధ్వర్యంలో ఉన్నత విద్యార్హతలు కలిగి, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్, పత్రికా ప్రకటన, నోటిఫికేషన్ ద్వారా రాత పరీక్ష, మౌఖిక పరీక్షలు నిర్వహించి ఎంపికై డిప్యూటీ తహసిల్దార్, ఈ వో ఆర్ డి కేడర్లో(జీ. వో. ఆర్. టి. నెంబర్ 312, తేదీ. 6.3.2006) నియమితులైన ఏపీవోలు, అలాగే ఈసీలు, కోర్స్ డైరెక్టర్లు, హెచ్ ఆర్ మేనేజర్లు, ప్లాంటేషన్ మేనేజర్లు, సహాయ పథక సంచాలకులు (ఏ పీ డీ)గా పదోన్నతులు పొందారు. ఏపీడీ లు అడిషనల్ పీడీలగా పదోన్నతులు పొందారు. ఉపాధి హామీ పథకం అమలులో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత పరిజ్ఞానాన్ని ఆకలింపు చేసుకుని, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయిలో అవగాహన కల్పించడం, అమలు పరచడం, పర్యవేక్షణ చేయడం, పరిపాలనాపర అంశాలలో సుదీర్ఘ అనుభవం గడించిన ఉపాధి హామీ ఉద్యోగులు అన్ని క్యాడర్లలోను పదోన్నతులను ఆశిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ గ్రావెల్, బిటి, సిమెంట్ రోడ్లు, సచివాలయ భవనాలు, అంగన్వాడి కేంద్ర భవనాలు, స్త్రీ శక్తి భవనాలు, రైతు సేవ కేంద్రాల భవనాలు, ఆరోగ్య కేంద్రాల భవనాలు, పాఠశాలల కు ప్రహరీ గోడల నిర్మాణం తదితర మౌళిక వసతులు కల్పించడంలో ఉపాధి హామీ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా లక్ష కుటుంబాలకు జాబ్ కార్డులు జారీ చేసి, సుమారు 75 వేల కోట్లు వేతన రూపంలో వేతన దారులకు నేరుగా అందించడంలో ఉపాధి హామీ ఉద్యోగులు ముఖ్యపాత్ర పోషించారు. అలాగే అటవీ, వ్యవసాయ, పంచాయతీరాజ్, విద్య, వైద్య,రైల్వే, జలవనురులు, ఉద్యానవన, పట్టు పరిశ్రమ మొదలైన ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని కన్వర్జెన్సీ కింద పలు రైతు సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. నిరుపేద కుటుంబాల నుండి వచ్చిన గ్రామీణాభివృద్ధి మాతృ శాఖ ఎఫ్ టి ఈ ఉద్యోగులకు గ్రామీణాభివృద్ధి శాఖలో 70 శాతం పదోన్నతులు కల్పించాలని కోరుతున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఎస్.ఆర్.డి. ఎస్ కింద పనిచేస్తున్న ఎఫ్.టి.ఈ ల నియామకం తేదీ తదితర పొరబాట్లను సరి దిద్దాల్సినవసరం ఉందంటున్నారు. ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని, ఔట్సోర్సింగ్ కింద పని చేస్తున్న ఉద్యోగులను ఎఫ్.టి.ఇ లగా గుర్తించాలని కోరుతున్నారు. కొంత మంది అధికారులకు వారి స్వార్థ ప్రయోజనాలు తప్ప ఉద్యోగుల సంక్షేమం పట్టడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఉపాధి హామీ ఉద్యోగులకు విధి నిర్వహణలో ఏకకాలంలో వివిధ పనులను నెత్తిన పెట్టి తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని బాధపడుతున్నారు. అనారోగ్య సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నా,విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన, ప్రమాదాల గురైన కుటుంబాలను ఆదుకోవడం లేదని ఆవేదనకు గురవుతున్నారు. ఎఫ్ టి ఈ ఉద్యోగుల సంక్షేమ నిధి వెల్ఫేర్ ఫండ్ కోట్లాది రూపాయలు మూలుగుతున్నా ఉద్యోగుల సంక్షేమానికి గాని, భీమా అమలుకు గాని ఇంతవరకు చర్యలు తీసుకాలేదని చెపుతున్నారు. ఎఫ్ టి ఇ ఉద్యోగులు ఏడాదికి రెండుసార్లు చెల్లించిన డబ్బే వెల్ఫేర్ ఫండ్. ఈ నిధులు గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని వెల్ఫేర్ ఫండ్ ఖాతాలో మూలుగుతున్నాయి. ఈ నిధులతో ఉద్యోగులకూ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని మనవి చేస్తున్నారు. ఉన్నత విద్యార్హతలు, సుదీర్ఘ అనుభవము, అంకిత భావము, కష్టపడే తత్వము కలిగిన ఉపాధి హామీ ఉద్యోగులు పథకాన్ని అమలు చేయడంలో ఎన్నో విజయాలను సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన వారికీ తగిన ప్రోత్సాహం ఇవ్వాలని అంటున్నారు.