జిల్లాలో 4 వేల ఎకరాల్లో పండ్ల, పూల తోటల పెంపకం
రైతుకు 5 ఎకరాల వరకు మూడేళ్ళు ఆర్థికసహాయం
2.51 మందికి 65 లక్షలపని దినాలను కల్పన
ఫారం పాండ్ల నిర్మాణానికి ఆర్థికసహాయం
రూ. 50 కోట్లతో 2,200 పశువుల షెడ్ల నిర్మాణం
ఆంధ్రప్రభ బ్యూరో తో ద్వామా పిడి రవికుమార్
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లాలో నాలుగు వేల ఎకరాల్లో ఉద్యానవన, పూల తోటలను పెంచనున్నట్లు జిల్లా నీటి నిర్వహణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ అవసాని రవికుమార్ వెల్లడించారు. బుధవారం చిత్తూరులో 'ఆంధ్రప్రభ బ్యూరో'తో మాట్లాడుతూ ఈ పంటలకు మూడు సంవత్సరాల వరకు ద్వామా నుంచి ఆర్థిక సహాయం ఉంటుందన్నారు. అలాగే ఫారం పాంట్స్ నిర్మాణానికి రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు .పశువులు, గొర్రెలు, కోళ్ల షెడ్ల నిర్మాణం నిమిత్తం జిల్లాలో 2200 క్యాటిల్ షెడ్లను మంజూరు చేసామన్నారు. వీటిని నిర్మాణం వేగంగా జరుగుతోందని, సంక్రాంతికి ప్రారంభిస్తామన్నారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 2.51 మందికి 65 లక్షలపని దినాలను కల్పించామని, వారికి 169 కోట్ల రూపాయలను వేతనాలుగా అందచేశామని వివరించారు.
వేతన జీవులకు ఉపాధి కల్పనే ధ్యేయంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జిల్లాలో అమలు జరుగుతోందని రవికుమార్ తెలిపారు. ఉపాధి లేని కూలీలకు ఉపాధి కల్పించడమే ఈ పథకం ద్యేయమన్నారు. ప్రతి కుటుంబానికి వంద రోజులు పని దినాలను కల్పించి, వలసలను నివారించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తాను నిత్యం జిల్లాలో పర్యటిస్తూ ఉపాధి హామీ పనులను, పశువుల షెడ్ల నిర్మాణాలను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ద్వామా యంత్రాంగం కష్టించి పనిచేస్తుందన్నారు .కార్యక్షేత్రంలో ఎక్కడా పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో 4 వేల ఎకరాలలో పండ్ల తోటలు, పూల తోటల పెంపకాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని జిల్లా ఉద్యానవన శాఖ అమలు చేస్తుందని, మూడు సంవత్సరాల వరకు ద్వామా వీరికి ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు. ప్రతి రైతుకు ఐదు ఎకరాల వరకు ఉద్యానవన పంటలు, పూలతోటలు వేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఇందుకు అయ్యే వ్యయాన్ని ద్వామా భరిస్తుందని, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈ పథకం కింద మామిడి, జామ, సపోటా, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, ఉసిరి, అల్లనేరేడు పంటలతో పాటు రోజా, మల్లెల తోటల పెంపకాలను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. రైతు పొలంలో నీటిని నిల్వ ఉంచి, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవడానికి ఫారం పాండ్ల నిర్మాణం జిల్లాలో జరుగుతుందన్నారు. రైతులు తమ పొలంలో ఫారం పాండు నిర్మించుకుంటే 70 వేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేస్తామని వివరించారు. జిల్లాలో 50 కోట్ల రూపాయలతో 2200 పశువుల షెడ్లను మంజూరు చేశామన్నారు. ఆవులు, గొర్రెలు, మేకలు, కోళ్ల షెడ్ల నిర్మాణానికి ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. ఈ మొత్తాన్ని కూడా లబ్ధిదారులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో పశువుల షెడ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని, ఈ నెలాఖరులో పూర్తిచేసి, సంక్రాంతికి ప్రారంభించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో 2.65 లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నార,ని ఇందులో 4. 75 లక్షల మంది ఉపాధి నిమిత్తం నమోదు అయ్యారని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.55 లక్షల మందికి 65 లక్షల పని దినాలను కల్పించి 169 కోట్ల రూపాయలను వేతనాలు గా అందజేసినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అకనుగుణంగా, జిల్లా కలెక్టర్ సూచనలు సలహాలను అనుసరిస్తూ జిల్లాలో పలు పథకాలను అమలు చేస్తున్నట్లు జిల్లా నీటి నిర్వహణ సంస్థ ప్రజెంట్ డైరెక్టర్ రవికుమార్ పేర్కొన్నారు. గత సంవత్సరంలో జరిగిన పనుల విషయమై సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఇందులో నిధుల దుర్వినియోగం జరిగితే, వారి పైన చర్యలు తీసుకొని, ఆ నిధులను రికవరీ చేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని ప్రజలు, రైతులు జిల్లా నీటి నిర్వహణ సంస్థ అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
పో రై గంగ 1 పిడి రవికుమార్
గంగ 2 పెద్దపంజాణి మండలంలో పశువుల షెడ్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్న పిడి