సాగునీటి సంఘాలకు ఎన్నికలు నేడే
అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం
గ్రామాలకు చేరుకున్న పోలింగ్ అధికారులు, సిబ్బంది
ఎన్నికలను ప్రతిస్టాత్మకంగా తీసుకున్న ఎం.ఎల్.ఏ.లు
ఏకగ్రీవంగా కూటమి అభ్యర్థుల ఎన్నికకు కసరత్తు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల సందడి నెలకొంది. వివిధ కారణాలతో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ ఎన్నికను శనివారం నాడు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి బుధవారం నోటిఫికేషన్ జారీ కాగా జిల్లా యంత్రాంగం ఆయా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలను తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జిల్లాలోని 220 సాగునీటి సంఘాల ఎన్నికలలో కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడానికి తమ ఛాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలావరకు సాగునీటి సంఘాలు ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శాసనసభ్యులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని కసరత్తును ముమ్మరం చేశారు. ధీటైనా అభ్యర్థులను రంగంలో దించారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి పలు రకాల ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తమ నియోజకవర్గంలో అన్ని సాగునీటి సంఘాలలో విజయం సాధించి, తమ సత్తా చాటుకోవాలని జిల్లాలోని శాసనసభ్యులు ఉవ్విల్లూరుతున్నారు.
నీటి సంఘాల ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ కావడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. చిత్తూరు జిల్లాలో 220 సాగునీటి సంఘాలకు శనివారం ఎన్నికల నిర్వహించనున్నారు. ఏకగ్రీవం కానీ చోట్ల మొట్టమొదటిసారిగా సాగునీటి సంఘాల ఎన్నికలను బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాటును పకడ్బందీగా జిల్లా అధికారులు చేపట్టారు. జిల్లాలోని 32 మండలాల్లో సాగునీటి సంఘాల వారిగా ఓట్లు జాబితాలో సిద్ధం చేసి, క్షేత్రస్థాయిలో ప్రదర్శించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది ఏర్పాటుకు అధికారులు కసరత్తు నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి, ఎన్నికల ఏర్పాట్లను పర్యవ క్షించారు. జిల్లావ్యాప్తంగా 220 సాగు నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించి గెలుపొందే వారితో సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సాగునీటి వినియోగదారుల సంఘాలకు అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. జిల్లాలో 215 సాగనేటి సంఘాల వినియోగదారులు వాటి పరిధిలో ఐదు మీడియం ప్రాజెక్టు డిస్ట్రిబ్యూషన్ కమిటీలు ఉన్నాయి. వాటితో కలిపి మొత్తం 220 సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ సంఘాల పరిధిలో 36,258 మంది పురుషులు, 12,772 మహిళల మొత్తం 49,030 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లావ్యాప్తంగా ఆయా మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ నిర్వహించనున్నారు. 1,357 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలకు 220 మంది ఎన్నికల అధికారులు, 152 అసిస్టెంట్ ఎన్నికల అధికారులు, 1357 మంది పిఓలు, మరో 1357 మందిఅసిస్టెంట్ పిఓలను ఎన్నికల విధులకు నియమించారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో ఇద్దరు పోలీసులు చొప్పునబందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం తగు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ మీద క్షేత్రస్థాయిలో సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. శుక్రవారం ఇరిగేషన్ కార్యాలయం నుంచి ఆయా మండలాలకు ఎన్నికల సామాగ్రిని ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ఎన్నికలలో సభ్యులందరినీ పాల్గొనే విధంగా చేయడానికి గ్రామాలలో ఎన్నికలకు సంబంధించి దండోరా వేయించారు. ఎప్పటికప్పుడు ఏర్పాట్లను ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. శనివారం జరిగే ఎన్నికల కోసం సిబ్బంది, ఎన్నికల అధికారులు ఇప్పటికే సంబంధిత పోలింగ్ స్టేషన్ కు చేరుకున్నారు.దీంతో గ్రామాలలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఎన్నికలో అన్నింటా విజయం సాధించి తమ పట్టు నిరూపించుకోవాలని కూటమి నాయకులు భావిస్తున్నారు. వాస్తవంగా జిల్లాలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. ఈ నేపథ్యంలో అత్యధిక స్థానాల్లో కూటమి నుంచి టీడీపీ మద్దతుదారులు బరిలో నిలిచే పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ, జనసేన నేతలకు కూడా కొన్ని స్థానాల్లో ప్రాతినిధ్యం కల్పించి వారి విజయానికి టీడీపీ నేతలు సహకరించనున్నారు. భవిష్యత్తులో చేపట్టనున్న సాగునీటి వనరుల అభివృద్ధి పనుల అంశాలను ఓటర్లకు చెప్పి.. ఎన్నికలో ఘన విజయం సాధించాలనే పట్టుదలతో అధికార పార్టీ నాయకులు ఉన్నారు. నీటి సంఘం చైర్మన్‌కు ముందు టీసీల ఎన్నిక ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన తర్వాత కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో సంఘాలు నిర్వీర్యమయ్యాయి. సాగునీటి సంఘాలకు కమిటీలు లేక చెరువులు, కాలువలు గాడితప్పాయి. వాటిలో వ్యర్థాలు, గుర్రపుడెక్క, పిచ్చిమొక్కలు పేరుకు పోయాయి. అనేక ప్రాజెక్టుల గేట్లుకు మరమ్మతులు చేయడం లేదు. సాగునీటి కాలువలకు గండ్లు ఏర్పడి నీరు వృథాగా పోవడంతో ఎగువ ప్రాంతాల్లోని పంటలకు నీరు అందని పరిస్థితి నెలకొంది. అనేక చోట్ల వ్యవసాయనికి నష్టం వాటిల్లింది. కాగా కూటమి అధికారం చేపట్టిన వెంటనే రైతు సంక్షేమంపై దృష్టి సారించింది. కీలకమైన సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. సాగునీటి సంఘాలు ఎన్నికైతే నీటి వనరులను బాగు చేసుకునేందుకు ఆస్కారం కలుగుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.