18, డిసెంబర్ 2024, బుధవారం

బోగస్ పించన్ల ఏరివేతకు రంగం సిద్దం !

13 ప్రశ్నలను తయారు చేసిన అధికారులు 

లబ్దిదారుని వివరాలు ఆన్ లైన్ లో నమోదు

సొంత కారు, 10 ఎకరాల భూమి ఉన్నా పించన్ కట్ 

300 పైన విద్యుత్తు వాడినా, ఆదాయపన్ను చెల్లిస్తున్నా నిలుపుదల

సర్వేకు సిద్దం అవుతున్నా జిల్లా అధికారులు  

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

 పించన్ల జాబితా నుండి అనర్హులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా ఎన్ టి ఆర్ బరోసా కింద పించన్లను తీసుకుంటున్న లబ్దిదారులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలనీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి లబ్దిదారులను 13 ప్రశ్నలను అడిగి వాటికీ వచ్చిన సమాధానాలను నమోదు చేస్తారు. ఈ మేరకు గ్రామ సచివాలయం యూనిట్ గా  గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో సర్వే నిర్వహించనున్నారు. సర్వే సిబ్బందిని జంబ్లింగ్ పద్దతిలో నియమిస్తారు. ఒక మండలంలో పనిచేస్తున్న సిబ్బందిని ఇతర మండలాలకు కేటాయిస్తారు. అవసరం ఆయితే, ఒక రెవెన్యూ డివిజన్ లోని సిబ్బంది చేత మరో డివిజన్ లో సర్వే చేపిస్తారు. నెలకు గ్రామీణ ప్రాంతాల్లో 10 వేలు, పట్టణ ప్రాంతాల్లో 12 వేల రూపాయల ఆదాయం ఉంటే, పించన్ కట్ అవుతుంది. పది ఎకరాల భూమి ఉన్నా, సొంతంగా నాలుగు చక్రాల వాహనం ఉన్నా, ఇంటిలో ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్‌ ఉన్నా, నెలకు 300 ఉనిట్ల కంటే ఎక్కువ విత్యుత్తు వాడుతున్నా, మున్సిపల్‌ ప్రాంతాల్లో కుటుంబానికి 1000 చదరపు అడుగులు కంటే ఎక్కువ ఇంటి స్తలం ఉన్న, ఆదాయపన్ను చెల్లింపు దారులు ఉన్నా, ఆ కుటుంబానికి ఇస్తున్న పించన్ నిలుపుదల చేసే అవకాశం ఉంది.


అర్హులకు మాత్రమే పెన్షన్లు అందాలనే ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో భాగంగా ఈ నెల 9,10 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో పెద్ద సంఖ్యలో అనర్హులను గుర్తించారు. దాదాపు 11వేల పెన్షన్లను తనిఖీ చేస్తే అందులో 563మంది అర్హత లేకున్నా పెన్షన్లు అందుకుంటున్నట్టు తనిఖీ బృందాలు గుర్తించాయి. చిత్తూరు జిల్లాలో చిత్తూరు రూరల్ మండలం ముత్తుకూరు పంచాయితీలో పించన్లను తనిఖీ చేశారు. పంచాయితీలోని 434 పించన్లను 11 బృందాలు తనిఖీలు చేశాయి. ప్రశ్నలను అడిగి ఆన్ లైన్ లో నమోదుచేశారు. పింఛనుదారుని స్టేటస్‌ను అంటే నివాసం ఉంటున్నారా? మరణించారా?  అనే కాలమ్‌ పూర్తిచేశారు.కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లోనైతే రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లోనైతే రూ.12 వేలు ఆపైన ఉందా? లబ్ధిదారుని కుటుంబానికి మూడెకరాలు కంటే ఎక్కువ మాగాణి, పదెకరాల కంటే ఎక్కువ మెట్ట లేదా రెండూ కలిపి పదెకరాల కంటే ఎక్కువ భూమి ఉందా? అని అరా తీశారు. కుటుంబంలో ఎవరైనా నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నారా? (ట్యాక్సీ, ట్రాక్టర్లు, ఆటో మినహాయింపు), అదే విధంగా కుటుంబంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి లేదా పెన్షనర్‌ ఎవరైనా ఉన్నారా? వివరాలను నమోదుచేశారు. కుటుంబ సరాసరి విద్యుత్‌ వినియోగం 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉందా? మున్సిపల్‌ ప్రాంతాల్లో కుటుంబానికి 1000 చదరపు అడుగులు కంటే ఎక్కువ నిర్మాణ ప్రాంతం ఉందా? కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా? అన్న వివరాలు తీసుకున్నారు. కుటుంబంలో ఎవరైనా ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నారా? పింఛన్‌దారు వికలాంగత్వం కలిగి ఉన్నారా? పింఛన్‌దారుని రీ అసెస్‌మెంట్‌కు (వైద్య పరీక్షలకు) సిఫార్సు చేస్తున్నారా? ఆయా ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాలి. అనంతరం పింఛను కొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారా లేదా అనే వివరాలు తనిఖీ చేసే ఉద్యోగి యాప్‌లో నమోదు చేశారు. అనంతరం పింఛన్‌దారుని ఫొటోను తీసి అప్లోడ్ చేశారు. ఈ వివరాల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 6లక్షల మంది అనర్హులు పెన్షన్లు అందుకుంటున్నట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు పెన్షన్లను జారీ చేస్తున్నట్టు, అర్హులకు మాత్రమే వాటిని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో అనర్హులుగా గుర్తించిన వారి పెన్షన్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్లను పొందడానికి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించి, అనర్హులను తొలగించాలని భావిస్తోంది. ఇటేవల నిర్వహించిన సర్వే ప్రకారం అనర్హుల జాబితాలను ఎంపిడిఓ, మునిసిపల్ కమిషనర్ల లాగిన్‌లలో అందుబాటులో ఉంచి, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా అనర్హులకు నోటీసులు జారీ చేయాలని, నిర్దిష్ట గడువులోగా వారి నుంచి సమాధానాలు తీసుకోవాలని నిర్ణయించింది. నోటీసులు అందుకోని వారి పెన్షన్లను చెల్లించకుండా నిలిపివేయాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అనర్హులకు పెన్షన్ల చెల్లింపు వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్లను గుర్తించడంపై రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పైలట్ సర్వేలో నకిలీ పెన్షన్లను గుర్తించారని, రాష్ట్ర వ్యాప్తంగా 6లక్షల మంది అనర్హులకు పెన్షన్లు చెల్లిస్తుండొచ్చని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ముఖ్యమంత్రికి వివరించారు. పెన్షన్ల జారీ చేసే సమయంలో ఉద్దేశపూర్వకంగా అనర్హులను చేర్చేశారని వివరించారు. దీంతో ముఖ్యమంత్రి మూడునెలల్లో అనర్హులను గుర్తించే ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. పెన్షన్ల తనికీ పూర్తైన తర్వాత తాను మరోసారి కనీసం 5శాతం పెన్షన్లను ర్యాండమ్‌ తనిఖీ చేయిస్తానని హెచ్చరించారు. అందులో కూడా అనర్హులు బయటపడితే కలెక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని, మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేవించారు. రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల కేటగిరీలో పెద్ద సంఖ్యలో అనర్హులు పింఛన్లు పొందుతున్నట్టు సెర్ప్‌ అధికారులు భావిస్తున్నారు. వికలాంగులకు రూ.15వేల వరకు పెన్షన్ చెల్లిస్తున్నారు. వితంతువుల విభాగంలో కూడా బోగస్ పెన్షన్లు ఉన్నట్టు పేదరిక నిర్మూలన సంస్థ సిబ్బంది క్షేత్ర స్థాయి తనిఖీల్లో గుర్తించారు. ప్రతి సచివాలయం పరిధిలోనూ దివ్యాంగుల కోటాలో అనర్హులు పింఛన్లు పొందుతున్నట్టు గుర్తించారు. బధిరులు సర్టిఫికెట్లతో వికలాంగుల పెన్షన్లు పొందుతున్నారు. లబ్దిదారుల కుటుంబంలో ఎవరికైనా కారు ఉన్నా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం నిర్దేశించిన దాని కంటే పొలం ఎక్కువగా ఉండటం వంటి అంశాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మూడునెలల్లో అనర్హులను గుర్తించాలని, విచారణ జరిపి వాటిని రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు ఒకటి, రెండు రోజుల్లో ఆదేశాలు అందే అవకాశాలు ఉన్నాయి. కావున ఇప్పటికే జిల్లా అధికారులు ఈ విషయమై కసరత్తును ప్రారంభించారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *