గ్రామ పంచయతిలకు నిధుల వెల్లువ
మొదటి విడతగా రూ. 34 కోట్లు విడుదల
అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
హర్షం వ్యక్తం చేస్తున్న సర్పంచులు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
కూటమి ప్రభుత్వం జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ఊపిరి పోస్తోంది. గత ఐదు సంవత్సరాలుగా నిధుల లేమితో అల్లాడిన గ్రామపంచాయతీలకు నేడు వరుసగా నిధులు విడుదలవుతున్నాయి. ఇటీవల గ్రామ పంచాయతీలకు మొదటి విడతగా 34 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వాలు విడుదల చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులతో గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను, పారిశుద్ధ్య కర్యక్రమాలను చేపట్టడానికి సర్పంచులు సమాయత్తం అవుతున్నారు. గతంలో పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ కార్మికులకు కూడా జీతాలు చెల్లించలేక చాలా ఇబ్బంది పడ్డారు. సర్పంచులకు గౌరవ వేతనం కూడా అందలేదు. విద్యుత్ బిల్లులు కూడా కట్టుకోలేక సతమతమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీలకు వరుసగా నిధులు విడుదలవుతున్నాయి.
చిత్తూరు జిల్లాలో 697 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో మేజర్ గ్రామపంచాయతీలు 11 గాక, 686 మైనర్ పంచాయతీలు. జిల్లాలో మొత్తం ఆవాసాల సంఖ్య 5287. ఈ గ్రామాలలో 3.68 లక్షల గృహాలు ఉన్నాయి. వీటిల్లో 14. 64 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో 684 మంది సర్పంచులు, 6,541 మంది వార్డు మెంబర్లు ఎన్నికయ్యారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీల విషయంలో చాలా దారుణంగా వ్యవహరించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరాలకు మళ్ళించింది. గ్రామపంచాయతీలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. పంచాయతీలలో పనిచేసే కార్మికులకు జీతాలు సైతం ఇవ్వలేక సర్పంచులు నానా అవస్థలు పడ్డారు. వీటిని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు జిల్లాలోని గ్రామపంచాయతీలకు 34 కోట్ల రూపాయలు నిధులను విడుదల చేసింది. జిల్లాకు తలసరి గ్రాంట కింద 52 లక్షలు, సీనరేజీ గ్రాంట్ కింద 61లక్షలు, వృత్తి పన్ను కింద 29 లక్షలు, సర్పంచ్ గౌరవ వేతనం కింద 2.33 కోట్ల రూపాయలు, 15వ ఆర్థిక సంఘం నిధుల కింద 30.33 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది.గ్రామ పంచాయతీలకు అందిన 15వ ఆర్థిక సంఘం నిధులను పారిశుద్ధ్యం, రక్షిత నీటి సరఫరా పథకాలు, వీధి దీపాల నిర్వహణతో పాటు, సిబ్బంది జీతాలు, పంచాయతీల సుస్థిరాభివృద్ధికి ఖర్చు చేయవచ్చు. గత ఐదేళ్లలో సర్పంచులు గ్రామాల్లో ఉత్సవ విగ్రహల్లా మారారు. కనీస గౌరవం లేదు. ఏ పని చేయాలన్నా పంచాయతీల్లో పైసా లేని దుస్థితి. ప్రస్తుత ప్రభుత్వ హయంలో ఆ బాధలు తప్పాయని సర్పంచులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలకు భారీగా నిధులు విడుదల కావడంతో పారిశుద్ధ్యం, రక్షిత తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ పనులు వేగవంతం అవుతున్నాయి. గత రాష్ట్ర ప్రభుత్వం పల్లెల బాగు కోసం ప్రత్యేక నిధులు విడుదల చేయకపోగా, కేంద్రం ఇచ్చిన వాటినీ ఇతర అవసరాలకు వాడుకోవటంపై అప్పట్లో పంచాయతీల సర్పంచ్లు గళమెత్తారు. పెద్ద ఎత్తున ఆందోళనలు సైతం చేపట్టారు. కానీ పంచాయతీలకు ఒనగూరిన ప్రయోజనం శూన్యం. ప్రస్తుత కూటమి ప్రభుత్వం, గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించటంతో పాటుగా కేంద్రం విడుదల చేసిన నిధులను నేరుగా పంచాయతీల ఖాతాలకు జమ చేయటంపై సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2014-19 కాలం తరహాలో చిన్న పంచాయతీల విద్యుత్తు బిల్లలును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని వారు కోరుతున్నారు. పంచాయతీ రాజ్ శాఖ పరిధిలోని రోడ్లు గుంతలు పడి అధ్వానంగా ఉన్నాయి. ఎంతోకాలంగా కొత్తవి నిర్మించడంతో పాటు పాతవి పునర్నిర్మించడానికి నిధుల కోసం ఎన్నోసార్లు ప్రతిపాదనలు పంపినా రాలేదు. దాంతో ఏటా వర్షాలు, వరదలకు రోడ్లన్నీ గుంతలు పడి ప్రయాణానికి నరకంగా మారాయి. ఇప్పుడు వీటికి మోక్షం కలగనుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.