సున్నా వడ్డీ పథకం నిధుల కోసం డ్వాక్రా మహిళల ఎదురుచూపులు
ఏడాదిన్నరగా డ్వాక్రా మహిళలకు అందని సున్నా వడ్డీ నిధులు
డ్వాక్రా మహిళలకు సంవత్సరం సున్నా వడ్డీని ఎగ్గొట్టిన జగన్ సర్కార్
సున్నా వడ్డీ పథకాన్ని 10 లక్షల రూపాయలకు పెంచుతామని చంద్రబాబు హామీ
కూటమి ప్రభుత్వం సత్వరం స్పందించాలని డ్వాక్రా మహిళల వేడుకోలు
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
తాము తీసుకున్న బ్యాంకు లింకేజీ రుణాలకు చెల్లించిన వడ్డీ తిరిగి సున్న వడ్డీ పేరుతో తమకు అందుతుందని గత ఏడాదిన్నరగా డ్వాక్రా మహిళలు ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో పాలక ప్రభుత్వాలు మాత్రం దృష్టిని సారచడం లేదు. ప్రభుత్వాలు సున్న వడ్డీ పేరుతో తమను మోసం చేస్తున్నాయని డ్వాక్రా సంఘాల సభ్యులు ఆవేదన చెందుతున్నారు. జగన్ ప్రభుత్వం ఐదు లక్షలు రూపాయలు ఉన్న సున్న వడ్డీ పథకాన్ని మూడు లక్షల రూపాయలకు కుదించారు. ఈ మొత్తాన్ని కూడా సక్రమంగా అందజేయకుండా, మహిళలను మోసం చేశారు. గత ప్రభుత్వం సంవత్సరం రోజులుగా సున్నా వడ్డీ పథకం కింద డ్వాక్రా మహిళలు చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలవుతున్న, ఇంతవరకు ఈ పథకం గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. గత తెలుగుదేశం పాలనలో ఐదు లక్షల రూపాయలు ఉన్న సున్న వడ్డీ పథకమును జగన్మోహన్ రెడ్డి 3 లక్షల రూపాయలకు తగ్గించారు. తాము అధికారానికి వస్తే సున్నా వడ్డీ పథకంను 10 లక్షల రూపాయల వరకు వర్తింపచేస్తామని ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారు. ఈ విషయం గురించి ఇప్పటివరకు ముఖ్యమంత్రి ప్రస్తావించలేదు. తెలుగుదేశం ప్రభుత్వం బకాయి పడ్డ ఉన్న సున్నా వడ్డీని జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. అలాగే ప్రస్తుతం కూడా జగన్ ప్రభుత్వ హయాంలో ఇవ్వాల్సిన సున్న వడ్డి పథకం నిధులు తమకు అందుతాయో, లేదో అని డ్వాక్రా మహిళలు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో 2004-09 మధ్య కాలంలో డ్వాక్రా సంఘాల్లోని సభ్యుల రుణాలకు తెలుగుదేశం ప్రభుత్వం పావలా వడ్డీ పథకం అమలు చేసింది. డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలు 10 శాతం వడ్డీని బ్యాంకులకు చెల్లించేవారు. సకాలంలో రుణాలు చెల్లించిన డ్వాక్రా సంఘాలకు ఆ సంఘాలు చెల్లించిన మొత్తాలను తిరిగి ప్రభుత్వం చెల్లించేది. దీంతో బ్యాంకులు డ్వాక్రా సంఘాలు చెల్లించిన వడ్డీని తిరిగి వారి ఖాతాలోనే జమ చేసేవారు. ఈ పథకాన్ని వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా కొనసాగించారు. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పావలా వడ్డీ పథకాన్ని సున్నావడ్డీగా మార్చారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక డ్వాక్రా మహిళలకు 5 లక్షల రూపాయల వరకు సున్నావడ్డీని వర్తింపజేశారు. ఐదేళ్లలో నిధుల లభ్యతకు అనుగుణంగా డోక్రా మహిళలకు ఈ పథకాన్ని అమలు చేశారు. కొంత బకాయిలుండగానే తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది. తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఆ బకాయిల్ని చెల్లించకుండా ఎగవేశారు. పైగా తెలుగుదేశం ప్రభుత్వమే ఈ పథకాన్ని రద్దుచేసినట్లు ప్రచారం చేశారు. గత ప్రభుత్వం మహిళలకు చెల్లించాల్సిన బకాయిలను మాత్రం పక్కన పెట్టేసింది. గత ప్రభుత్వాలు డ్వాక్రా మహిళలకు ఏ నెలకు ఆనెల సున్న వడ్డీ పథకం కింద వాళ్ల అకౌంట్లో నిధులను జమ చేసేవాళ్లు. వీరికి గతంలో అమలు చేసిన సాయాన్ని మరింత పెంచడానికి బదులు వైసీపీ ప్రభుత్వం కోత విధించింది. ఏ నెలకు ఆ నెల సున్నా వడ్డీ చెల్లింపు విధానంలో మార్పులు తీసుకుని వచ్చారు. ఈ పథకానికి కూడా బటన్ నొక్కడం ప్రారంభించారు. దీంతో మూడు నాలుగు నెలలకు ఒకసారి సున్న వడ్డీ పథకం కింద నిధులు డ్వాక్రా మహిళలకు అందేది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాల రుణ పరిమితి 10 లక్షల రూపాయలు ఉండేది. జాతీయ జీవనోపాధుల కార్యక్రమం కింద 2021లో ఈ పరిమితిని 20 లక్షల రూపాయలకు పెంచింది. రుణపరిమితి పెరిగితే సభ్యులపై వడ్డీ భారం అధికంగా ఉంటుంది. జగన్ సర్కారు రాయితీ రుణపరిమితిని 5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలకు కుదించింది. డ్వాక్రా సంఘాలు ఎన్ని లక్షల రూపాయలను రుణాలుగా తీసుకున్న, ప్రభుత్వం మాత్రం మూడు లక్షల రూపాయల వరకు మాత్రమే సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసింది. మూడు లక్షల పైబడిన మొత్తాలకు ఈ పథకం వర్తించదు. ఆ మొత్తాలకు డ్వాక్రా సంఘాలు పూర్తి వడ్డీని బ్యాంకులకు చెల్లించాల్సి వచ్చింది. ఫలితంగా 3 లక్షల రూపాయలకుపైగా రుణం తీసుకున్న ప్రతి సంఘంపైనా గత ప్రభుత్వంలో అధిక వడ్డీ భారం భారీగా పడింది. ఎన్నికలకు ఏడాది ఉండగా అప్పటినుంచి డ్వాక్రా మహిళలకు సున్న వడ్డీ పథకం కింద నిధులను విడుదల చేయడం నిలుపుదల చేసింది. జగన్ ప్రభుత్వం 2019 20 ఆర్థిక సంవత్సరానికి 30,117 సంఘాలకు 74.13 కోట్ల రూపాయలను సున్నా వడ్డీ పథకం కింద విడుదల చేసింది. అలాగే 220 21 ఆర్థిక సంవత్సరంలో 32,739 సంఘాలకు 59.70 కోట్ల రూపాయలను విడుదల చేసింది. 2021 22 ఆర్థిక సంవత్సరానికి కాను 33,138 సంఘాలకు 63.16 కోట్ల రూపాయలను విడుదల చేసింది. 2002 23 ఆర్థిక సంవత్సరానికి 28,685 సంఘాలకు 40.05 కోట్ల రూపాయలను మాత్రం విడుదల చేసింది. క్రమంగా ప్రభుత్వానికి సున్న వడ్డీ భారం తగ్గింది. డ్వాక్రా మహిళలకు వడ్డీ భారం పెరిగింది. ప్రస్తుతం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 36,369 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. అలాగే చిత్తూరు మున్సిపాలిటీలో 3300 సంఘాలు నడుస్తున్నాయి. ఈ సంఘాలకు గత ప్రభుత్వం బకాయిలుగా ఉన్న ఏడాది సున్నా వడ్డీ పథకం కింద నిధులను చెల్లించాల్సి ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని మూడు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు పెంచి, వడ్డీ మొత్తాలను చెల్లించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఆరు నెలలు అవుతున్న, ఈ విషయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థకు ఎలాంటి ఆదేశాలు అందలేదు. దీంతో జిల్లాలోని డోక్రా మహిళలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. గత ప్రభుత్వ బకాయిలు తమకు తిరిగి వస్తాయో రావో అన్న ఆందోళన వారిలో వ్యక్తం అవుతుంది. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సున్నా వడ్డీ పథకంను 10 లక్షల రూపాయలకు పెంచి, సత్వరం ఇప్పటివరకు చెల్లించాల్సిన వడ్డీలను తమకు చెల్లించాలని కోరుతున్నారు.

