రైతుల నెత్తిన బీమా పిడుగు
ఉచిత బీమా పథకం రద్దు
రైతులే బీమాను చెల్లించాలి
సప్తగిరి గ్రామీణ బ్యాంక్ రూటే సపరేట్
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు)
గాయాలతో మూలిగే నక్క పైన తాటికాయ పడ్డట్టు కూటమి ప్రభుత్వం రైతులకు ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసింది. ఎవరైనా రైతులు బీమా కావాలంటే వారు బీమా ప్రీమియంను స్వయంగా చెల్లించాలి. జగన్ ప్రభుత్వం రైతులకు ఉచిత భీమా సౌకర్యాన్ని కలుగజేసింది. రైతుల తరఫున బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించేది. కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత ఉచిత బీమా పథకాన్ని రద్దుచేసి, రైతులపైనే భారం మోపింది. దీంతో రైతులు బీమా ప్రీమియం చెల్లించడానికి ముందుకు రావడం లేదు. కూటమి ప్రభుత్వ నిర్ణయం రైతాంగానికి భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో అన్ని రకాల బ్రాంచి బ్యాంకు బ్రాంచీలు 274 ఉన్నాయి. ఇందులో ప్రవేట్ సెక్టార్ బ్యాంకులు 49 ,కమర్షియల్ బ్యాంకులు 175, కోపరేటివ్ బ్యాంకులు 21, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ 67, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ 10 ఉన్నాయి. ఈ బ్యాంకులు రూరల్ లో 138, అర్బన్ లో 70, సెమీ అర్బన్ లో 66 బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఈ బ్యాంకులు ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు పంట రుణాల కింద 7237 కోట్ల రూపాయలను, టర్మ్ రుణాలు కింద 3429 కోట్ల రూపాయలను అందజేశాయి. మొత్తం వ్యవసాయ రంగానికి 11153 కోట్ల రూపాయలను చెల్లించాయి. గతంలో జగన్ ప్రభుత్వం రైతులందరికీ ఉచిత బీమా సౌకర్యాన్ని కలుగజేసింది. ఏదైనా కారణం చేత రైతులకు నష్టం జరిగితే నష్టపరిహారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లించేవి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటల బీమా పథకాన్ని రద్దు చేశారు. రైతులకు భీమ కావాలంటే వారే బీమా ప్రీమియం చెల్లించుకోవాలి. ప్రధానమంత్రి ఫజల్ బీమా యోజన పథకం కింద చిత్తూరు జిల్లాలో వరి, వేరుశనగ, మామిడి, టమాటా పంటలకు మాత్రమే బీమా సౌకర్యం ఉంది. వరి పంటకు ఎకరాకు 82 రూపాయలు చెల్లిస్తే 40 వేల రూపాయలు బీమా సౌకర్యం ఉంటుంది. వేరుశనగ పంటకు ఎకరాకు 60 రూపాయలు చెల్లిస్తే 30 వేల రూపాయలు, మామిడి పంటకు ఎకరాకు 1750 రూపాయలు చెల్లిస్తే 35,000, టమేటాకు 1250 చెల్లిస్తే 25,000 రూపాయలు బీమా కంపెనీలు నష్టపరిహారంగా చెల్లిస్తాయి. రైతులకు పంటల బీమా పథకం పైన పెద్దగా అవగాహన లేకపోవడంతో రైతులు బీమా ప్రీమియం చెల్లించడానికి ముందుకు రావడం లేదు. వరి వేరుశనగ పంటలకు బీమా తక్కువగా ఉంది. అయితే మామిడి, టమాటా పంటలకు బీమా ప్రీమియం చాలా ఎక్కువ. కావున భీమా ప్రీమియం చెల్లించడానికి రైతులు ముందుకు రావడం లేదు. పంటల బీమా పథకాన్ని వరి, టమేటా పంటలకు మండలం యూనిట్ గా, వేరుశనగ పంటకు జిల్లా యూనిట్ గా అమలు చేస్తున్నారు. వరి, వేరుశనగ దిగుబడి ఆధారంగా నష్ట పరిహారం లెక్కిస్తారు. టమాటో, మామిడి పంటలకు వాతావరణం హెచ్చుతగ్గులను పరిగణలోకి తీసుకొని బీమాను లెక్కిస్తారు. ఈ బీమా పథకాలు అమలు, ప్రీమియం అంతా గందరగోళంగా ఉంది. సాధారణ రైతులకు అర్థమయ్యే పరిస్థితి లేదు. కావున జిల్లాలోని రైతాంగానికి మునుపటి వలె బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించాలని రైతులు కోరుకుంటున్నారు.
సప్తగిరి గ్రామీణ బ్యాంక్ రూట్ సపరేట్
జిల్లాలో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అత్యధికంగా 67 బ్రాంచ్ లను కలిగి ఉంది. రైతులకు అత్యధిక శాతం రుణాలను గ్రామీణ బ్యాంక్ అందజేస్తుంది. పంటల బీమా పథకాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలలో ఎకరాలను యూనిట్ గా తీసుకుంటారు. ఈ మేరకు బీమా ప్రీమియంను చెల్లిస్తారు. అయితే సప్తగిరి గ్రామీణ బ్యాంక్ లో మాత్రం రైతులు తీసుకున్న రుణ మొత్తాన్ని మీద బీమా ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది. రబీ పంటలకు రుణ మొత్తంలో 1.5 శాతం, ఖరీఫ్ సీజన్లో 2.5 శాతం పంటల బీమాగా చెల్లించాలి. ఖరీఫ్, రబీ రెండు పంటలకు కలిపి రుణం మొత్తం పైన 5 శాతాన్ని బీమా ప్రీమియంగా చెల్లించాలి. అంటే ఒక రైతు లక్ష రూపాయలను రుణముగా తీసుకుంటే బీమా ప్రీమియం కింద ఐదు వేల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ బీమా ప్రీమియం అన్ని రకాల ఆహార ధాన్యాలకు, అన్ని రకాల నూనె గింజల పంటలకు వర్తిస్తాయి. ఇది భారత ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉంది. అలాగే లోన్ ప్రాసెసింగ్ చార్జీలు ఇతర బ్యాంకులలో 300 రూపాయలను మాత్రమే వసూలు చేస్తుండగా, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ లలో 580 రూపాయలను వసూలు చేస్తున్నారు. ఈ విషయంలో కూడా సప్తగిరి గ్రామీణ బ్యాంక్ రైతుల మీద అధిక భారాన్ని మోపుతుంది. ఈ విషయమై లీడ్ బ్యాంకు మేనేజర్ హరీష్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో నాలుగు పంటలకు మాత్రమే బీమా సౌకర్యం ఉందన్నారు. వరి పంటకు ఎకరాకు 82 రూపాయలు, వేరుశనగ పంటకు 60 రూపాయలు, మామిడికి 1750 రూపాయలు, టమేటాకు 1250 రూపాయలు మాత్రమే బీమా ప్రీమియంగా బ్యాంకులు వసూలు చేయాలన్నారు. అంతకుమించి ఏ బ్యాంకు గాని ప్రీమియం వసూలు చేయడానికి వీలు లేదని స్పష్టం చేశారు.