ఉత్తమ ఉపాధ్యాయుడిని బలికొన్న ప్రశ్నాపత్రాలు
ప్రశ్నాపత్రాలు తీసుకెళ్ళుతుండగా ప్రమాదం
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
భగ్గుమన్న ఉపాధ్యాయ సంఘాలు
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
ఉన్నత పాఠశాల సమ్మేటివ్ పరీక్షలు ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిని బలికొన్నాయి. రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్న ఆ ఉపాధ్యాయుడు పదవీవిరమణ చేయకనే పరలోకానికి ప్రయాణమయ్యారు. పాటశాల విద్యార్థులలో, ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపిన ఈ సంఘటన యావత్తు ఉపాధ్యాయ లోకాన్ని కలచివేస్తోంది. ప్రభుత్వం తమ విధానాన్ని మార్చుకొని, ప్రశ్నాపత్రాలను పాఠశాలల వద్దకే సరఫరా చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తమ పరీక్షలను బహిష్కరిస్తామంటూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం ఉన్నత పాఠశాలలో సమ్మేటివ్ వన్ అనే అర్థ సంవత్సర పరీక్షలు జరుగుతున్నాయి. గతంలో ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలను జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ముద్రించి పాఠశాలలకు సరఫరా చేసేది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానంలో మార్పులు తీసుకొని వచ్చింది. ఈ ప్రశ్న పత్రాలను రాష్ట్రస్థాయిలో ముద్రించి అన్ని పాఠశాలలకు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షలు ప్రారంభం అయ్యాయి. అయితే, గత శనివారం జరగాల్చిన 6, 8, 10 తరగతుల గణితం ప్రశ్నపత్రాలు సామాజిక మాధ్యమాలలో ముందుగానే లీక్ అయింది. ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నాపత్రాల నిల్వ విషయంలో మార్పులు తీసుకొని వచ్చింది. ఇదివరకు ప్రశ్నపత్రాలను మండల విద్యాశాఖ కార్యాలయంలో లేక స్కూల్ కాంప్లెక్స్ లో నిల్వ చేసి, అక్కడి నుండి సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు తీసుకొని వెళ్లేవారు. దీనివల్ల ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయని భావించిన ప్రభుత్వం మిగిలిన పరీక్షల ప్రశ్నాపత్రాలను పోలీస్ స్టేషన్లకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. మండల విద్యాశాఖ అధికారులను ఈ ప్రశ్న పత్రాలకు కస్టోడియన్లుగా నియమించి, పరీక్షలకు గంటకు ముందు మాత్రమే సంబంధిత ఉపాధ్యాయులకు అందచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం సోషల్ ప్రశ్న పత్రాలను పూతలపట్టు పోలీస్ స్టేషన్ నుంచి తలపులపల్లికి తీసుకుని వెళుతుండగా ఉపాధ్యాయుడు సిద్దయ్య శెట్టికి తేనెపల్లి వద్ద ప్రమాదం జరిగింది. ఉపాధ్యాయుడు వెళుతున్న స్కూటర్ ను, వెనుకవైపు నుండి వస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులు ఢీకొన్నారు. దీంతో టీచర్ తలకు బలమైన గాయమైంది. గాయపడిన సిద్దయ్య శెట్టిని తొలుత చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్ గా ఉండడంతో శీలాపల్లి సిఎంసికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సిద్ధయ్య శెట్టి మరణించారు. ఐరాల మండలం పత్తిపాటి వారి పల్లికి చెందిన పెద్దయ్య శెట్టి తలపలపల్లి ఉన్నత పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. ఆయన ఈ సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు తీసుకున్నారు. మరో రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. పూతలపట్టు పోలీస్ స్టేషన్ నుంచి ప్రశ్నాపత్రాలను తీసుకుని వచ్చే బాధ్యత గురువారం సిద్దయ్య శెట్టి మీద పడింది. ఆయన ప్రశ్నాపత్రాలను తీసుకుని వస్తూ మార్గమధ్యంలో ప్రమాదానికి గురై, అసువులు బాశారు. దీంతో జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వ వైఖరి మీద తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి. మూడు నెలల, ఆరు నెలల పరీక్షలకు ప్రభుత్వం అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రాధాన్యత ఇవ్వాలనుకున్న ప్రభుత్వం పబ్లిక్ పరీక్షల వలే మండలానికి ఒక వాహనాన్ని సమకూర్చి ఆ వాహనం ద్వారా పాఠశాలలకు ప్రశ్నాపత్రాలను సరఫరా చేయాలని కోరుతున్నారు. ఉపాధ్యాయులకు ఇలా ప్రశ్నాపత్రాలను తీసుకెళ్లే విధులు అప్పగించడం సరైన పద్ధతి కాదంటున్నారు. రోజుకు రెండు సార్లు ఉపాధ్యాయులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ప్రశ్నాపత్రాలను తీసుకొని రావాల్సి ఉంటుందని, ఈ క్రమంలో సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వేగంగా ప్రయాణం చేయాల్సి ఉంటుందంటున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ఉపాధ్యాయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, రేపటి నుంచి జరిగే పరీక్షలకు ప్రభుత్వమే ప్రశ్నాపత్రాలను ఉన్నత పాఠశాలలకు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే, పరీక్షలను బహిష్కరించే విషయం ఆలోచిస్తామని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులకు ప్రశ్నపత్రాలను తీసుకెళ్లే డ్యూటీలను అప్పగించకుండా, ప్రభుత్వమే ప్రశ్నాపత్రాలను పాఠశాలల వద్ద అందజేస్తున్న అవసరం ఎంతైనా ఉంది.
పో రై గంగ 1 మృతిచెందిన టిచర్ సిద్దయ్య శెట్టి
*అనాలోచిత నిర్ణయం*
రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం కారణంగా తలపలపల్లికి చెందిన ఉపాధ్యాయుడు సిద్దయ్య శెట్టి మృతి చెందారు. ఉపాధ్యాయుని మృతి నేపథ్యంలో ప్రభుత్వ అధికారుల అనుచిత నిర్ణయాలను పునః సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు స్వేచ్ఛగా చదువులు చెప్పే వాతావరణంలో కల్పించాలి. ఇతర విధులను ఉపాధ్యాయులకు అప్పగించకూడదు. మృతి చెందిన సిద్దయ్య శెట్టి కుటుంబానికి కోటి రూపాయలను నష్టపరిహారంగా చెల్లించాలి.
గంగ 2 జీవీ రమణ, రాష్ట్ర కార్యదర్శి, యుటిఎఫ్
*ప్రభుత్వమే ప్రశ్నపత్రాలను సరఫరా చేయాలి*
పోలీస్ స్టేషన్ లో ప్రశ్నాపత్రాలు నుంచి ఉపాధ్యాయులను తీసుకొని వెళ్లమనడం సరైన నిర్ణయం కాదు. ఉపాధ్యాయులు ఇందుకోసం రెండు పర్యాయాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. సమయం తక్కువ ఉండడంతో వేగంగా వెళ్లాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోని సిద్దయ్య శెట్టి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ప్రభుత్వం అర్థ సంవత్సర పరీక్షలకు ఇంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రశ్నాపత్రాలను ప్రభుత్వమే పాఠశాలల వద్దకు సరఫరా చేయాలి. లేకుంటే పరీక్షలను బహిష్కరించే విషయం పరిశీలిస్తాం.
గంగ 3 వి రెడ్డి శేఖర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి, వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్.
*అసంబద్ధ నిర్ణయం*
సమ్మేటివ్ ప్రశ్న పత్రాలను పోలీస్స్టేషన్ లో భద్రపరచడం రోజుకు రెండుసార్లు దూర ప్రాంతాల నుండి వచ్చి తీసుకెళ్లడం అసంబద్ధమైన నిర్ణయం. ఇందు వల్ల మహిళా ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీటి ఫలితంగానే ఈరోజు సిద్దయ్య శెట్టి మరణించారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని,పరిక్షల నిర్వహణలో మార్పులు తీసుకొని రావాలి. మృతుడు సిద్దయ్య సెట్టి కుటుంబానికి 50 లక్షలు నష్టపరిహారం అందజేయాలి.
గంగ 4 గంటా మోహన్, ఎస్.టి.యు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు.