18, డిసెంబర్ 2024, బుధవారం

జిల్లాలో నత్తనడకన జల్ జీవన్ మిషన్‌ పనులు

రాష్ట్ర ప్రభుత్వ వాటా  విడుదల చేయక తాగునీటి కష్టాలు 

అయిదు సంవత్సరాలలో సగం పనులు కూడా  పూర్తి కాలేదు

20 శాతం నిధులు కూడా వ్యయానికి నోచుకోలేదు 

పధకం రుపురేఖలు మార్చుతున్న కూటమి ప్రభుత్వం

కండలేరు, గండికోట నుండి జిల్లా మొత్తానికి తాగునీరు   


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్‌కు వైఎస్సార్సీపీ సర్కార్ రాష్ట్ర వాటా నిధులను సరిగా ఇవ్వకుండా భ్రష్టు పట్టించింది. గత ఐదు సంవత్సరాల్లో చేపట్టిన పనుల్లో ప్రణాళిక కొరవడటంతో ఎందుకూ కొరగాకుండా పోయాయి. గత ప్రభుత్వం  రాష్ట్ర వాటా నిధులు సరిగ్గా ఇవ్వకపోవడంతో, జల్​జీవన్‌ మిషన్‌ అమలునత్త నడకన సాగుతోంది. 2019 ఆగస్టులో ప్రారంభమైన జేజేఎం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం నిధులను సమకూర్చాలన్న ఒప్పందానికి జగన్‌ సర్కార్ తూట్లుపొడిచింది. కేంద్ర ప్రభుత్వ వాటా కింద నిధులను విడుదల చేశారు. రాష్ట్ర వాటా కింద అరకొరగా నిధులను ఇచ్చింది. పనులు చేసిన గుత్తేదారు సంస్థలకు బిల్లులు పెండింగ్‌లో పెట్టారు.  దీంతో  కుళాయి కనెక్షన్ల ద్వారా ఇంటింటికీ రక్షిత నీటి సరఫరా చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ధ్యేయం జిల్లాలో సఫలం కాలేదు.  గ్రామాల్లో చాలా ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చినా, సగానికిపైగా కనెక్షన్ల నుంచి నీళ్లే రావడం లేదు. అత్యధిక చోట్ల కుళాయిలు అలంకారప్రాయంగా మిగిలాయి.  వైఎస్సార్సీపీ సర్కార్ రివర్స్‌ పాలనలో తగిన జలవనరుల లభ్యత లేకపోయినా, గ్రామాల్లో పెద్దఎత్తున కుళాయి కనెక్షన్లు ఇచ్చేశారు. ఆ తర్వాత చేతులెత్తేశారు. 


జలజీవన్‌ మిషన్‌ కింద చిత్తూరు జిల్లాలో గత ఐదు సంవత్సరాల కిందట 5041 పనులను ప్రతిపాదించగా, ఇప్పటివరకు 2,432 పనులు మాత్రమే పూర్తయ్యాయి. అంచనా వ్యయం 431.45 కోట్ల రూపాయలు కాగా, ఇందులో 101.21 కోట్ల రూపాయలను మాత్రమే వ్యయం చేశారు. ఇందులో 286 పనులు గత ఐదు సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. 1,921 పనులను అధికారులు రద్దు చేశారు. చిత్తూరు జిల్లాలోని గ్రామాలలో 3,17,818 కుటుంబాలు ఉన్నట్లు ఇరిగేషన్ శాఖ లెక్కలు కట్టారు. ఇందులో 2, 67,272 కుటుంబాలకు నీటి కొళాయి కనెక్షన్లు ఇచ్చారు. 50,456 కుటుంబాలకు ఇంకా నీటి కుళాయిల కనెక్షన్ ను ఇవ్వాల్సి ఉంది. నియోజకవర్గాల వారీగా చిత్తూరు నియోజకవర్గంలో 222 పనులను మంజూరు చేసి, 102 మాత్రమే పూర్తి చేశారు. 15.27 కోట్ల రూపాయలను  కేటాయించి,  3.58 కోట్ల రూపాయలు మాత్రమే వ్యయం చేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి 685 పనులను  మంజూరు చేసి, 498 పనులను పూర్తి చేశారు. ఈ నియోజకవర్గానికి 49.41 కోట్ల రూపాయలను ప్రతిపాదించి, 16.70 కోట్ల రూపాయలను వ్యయం చేశారు. కుప్పం నియోజకవర్గానికి 697 పనులను మంజూరు చేసి, కేవలం 92 పనులను మాత్రమే పూర్తి చేశారు. ఈ నియోజకవర్గానికి 70.27 కోట్ల రూపాయలను కేటాయించి, 7. 54 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు చేశారు. నగిరి నియోజకవర్గానికి 285 పనులను ప్రతిపాదించి, 92 పనులను పూర్తి చేశారు ఈ నియోజకవర్గానికి 25.74 కోట్ల రూపాయలను కేటాయించి, 78.56 లక్షల రూపాయలను మాత్రమే వ్యయం చేశారు. పలమనేరు నియోజకవర్గానికి 711 మంజూరు చేసి, 226 పనులను పూర్తి చేశారు. ఈ నియోజకవర్గానికి 68.32 కోట్ల రూపాయలను కేటాయించి, 12.96 కోట్ల రూపాయలను వ్యయం చేశారు. పుంగనూరు నియోజకవర్గానికి అత్యధికంగా 1,832 పనులను మంజూరు చేసి, 1,100 పనులను పూర్తి చేశారు. ఈ నియోజకవర్గానికి 150.95 కోట్ల రూపాయలను మంజూరు చేసి, 46.87 కోట్ల రూపాయలను వ్యయం చేశారు. పూతలపట్టు నియోజకవర్గానికి 606 పనులను మంజూరు చేసి, ఇందులో 322 పనులను పూర్తి చేశారు. ఈ నియోజకవర్గానికి 51.49 కోట్ల రూపాయలను కేటాయించగా, ఇప్పటివరకు 12.78 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. ఏటా ఎండాకాలం ప్రారంభం నుంచే భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో బోర్లలో నీటి లభ్యత తగ్గుతోంది. వేసవి నాలుగు నెలలూ దాదాపు ఇదే పరిస్థితి. బోర్లపై ఆధారపడే తాగునీటి పథకాల ద్వారా వేసవిలో నీరు అందించేందుకు వీల్లేక అత్యధిక జిల్లాల్లో ట్యాంకర్లతో సరఫరా చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ వైఎస్సార్సీపీ సర్కార్ జలజీవన్‌ మిషన్‌లో బోర్ల ద్వారా కుళాయిలకు నీరు సరఫరా చేసేలా  పనులను ప్రతిపాదించింది. ఇందులో కొత్తగా తవ్విన బోర్లు కూడా ఉన్నాయి. వీటిలో చాలా బోర్లు గత రెండు సంవత్సరాల్లో వేసవిలో అడుగంటాయి. దీంతో ప్రజలు తాగునీటికి అల్లాడారు. దీంతో జలజీవన్‌ మిషన్‌ పనుల్లో కూటమి ప్రభుత్వం సమూల మార్పులు చేస్తోంది. గ్రామాల్లోని గృహాలకు ఇచ్చిన కుళాయి కనెక్షన్ల ద్వారా 365 రోజులూ తాగునీరు సరఫరా అయ్యేలా ప్రణాళికలు చేపడుతోంది. సమీప జలాశయాలు, నదుల నుంచి పైపులైన్ల ద్వారా నీటిని తరలించి, వేసవిలోనూ ప్రజలకు సరఫరా చేసేలా డిజైన్లను మార్చనున్నారు. బోర్లు తవ్వి, వాటి నుంచి నీటిని సరఫరా చేయాలని గత వైఎస్సార్సీపీ సర్కార్ ప్రతిపాదించిన వాటిని రద్దు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలపై గ్రామాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు వ్యయం అదనంగా పెరుగుతుంది. అయినా సర్కార్ అదనపు వ్యయాన్ని భరించడానికి సుముఖంగా ఉంది. రాష్ట్రస్థాయి అంచనాల కమిటీ ఆమోదంతో వాటిని త్వరలో కేంద్రానికి పంపనున్నారు.  జలాశయాలు, నదుల నుంచి నీటిని పైపులైన్లు, కాలువల ద్వారా సేకరించి సరఫరా చేయడం ద్వారా గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఏపీ సర్కార్ భావిస్తోంది. గ్రామాల్లో ఇప్పటికే 2.67  లక్షల కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. దీంతో పాటు అదనంగా మరో 50,546 కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియను పూర్తి చేయడంతోపాటు ఖర్చు ఎక్కువైనా గ్రామాలకు సమీపంలోని జలాశయాల నుంచి సంవత్సరం పొడవునా నీరు ఇచ్చేలా పనులు చేపట్టాలని గ్రామీణ తాగునీటి సరఫరా విభాగాన్ని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇందుకోసం కండలేరు, గండికోట జలాశయాల నుంచి గ్రామాలకు నీటి సరఫరా కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రూపొందిస్తున్నారు. కండలేరు నుండి 16 మండలాలకు, గండికోట నుండి 15 మండలాలకు తాగునీటిని సరఫరా చేయడానికి ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి. పైపులైన్ల ద్వారా తెచ్చే నీటిని శుద్ధి చేశాక గ్రామాల్లోని ఓవర్‌ హెడ్‌ సర్వీస్‌ రిజర్వాయర్, బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్, సంపులకు అనుసంధానించి ప్రజలకు కుళాయిల ద్వారా సరఫరా చేస్తారు. దీనిపై కేంద్రాన్ని ఒప్పించి ఆమోదం తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కొద్దిరోజుల క్రితం వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాగునీటి ప్రాజెక్టులకు సహకారం అందించేందుకు వారు సుముఖత వ్యక్తం చేశారు. జల్​జీవన్‌ మిషన్‌లో ఇప్పటివరకు చేసిన పనులు, మిగిలిన పనులు సహా పలు విషయాలపై చర్చించారు. మరోవైపు డ్యాంల భద్రతకు కేంద్రం అమలు చేస్తున్న పథకంలో ప్రపంచ బ్యాంకు సాయం ఉంది. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం 70 శాతం నిధులు భరిస్తే, రాష్ట్రం 30 శాతం వాటా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 30 శాతం భరించేందుకు ఇన్నాళ్లూ జగన్‌ సర్కార్ ముందుకు రాలేదు. దీంతో ప్రాజెక్టుల భద్రతకు కేంద్రం ఇచ్చే నిధులను సరిగా ఉపయోగించుకోలేదు. ఈ పరిస్థితుల్లో ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంకు రుణంతో మొదట జల్​జీవన్‌ మిషన్‌ పనులు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజినీర్లు పెండింగ్‌ పనుల పూర్తికి కావాల్సిన నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు.









 

















 



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *