వితంతు మహిళలను కూడా కరుణించని ప్రభుత్వం
12 నెలలుగా పింఛన్ల కోసం ఎదురుచూపులు
పూట గడవక అల్లాడిపోతున్న వితంతువులు
ప్రకటనలుకే పరిమితమైన కొత్త పింఛన్ల మంజూరు
మానవతా దృక్పథంతో ఆదుకోవాలని విజ్ఞప్తి
చిత్తూరు బ్యూరో,ఆంధ్రప్రభ.
భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖముతో ఉన్న వితంతు మహిళల పింఛన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనికరము చూపడం లేదు. తనను పోషించే జీవిత భాగస్వామి దూరమైనా, ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవడం లేదు. సమాజంలోని కట్టుబాట్ల కారణంగా కూలి పనులకు కూడా పోలేక వితంతు మహిళలు దుర్భర జీవితం గడుపుతున్నారు. సంపాదించి పోషించే భర్తను కోల్పోయి, కూలీ నాలి పనులను చేసుకోలేక, ఆదాయం లేకుండా, పూట గడవక వితంతువులు అల్లాడిపోపుతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. గత 12 నెలలుగా పింఛన్ల కోసం గ్రామ సచివాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్న, రాష్ట్ర ప్రభుత్వం కరుణించడం లేదు. ఇదిగో అదిగో అంటూ పింఛన్ల విషయంలో ఊరిస్తున్న ప్రభుత్వం, ఈ విషయమై జిల్లాలకు ఎటువంటి ఆదేశాలను జారీ చేయలేదు. పింఛన్ల కోసం వితంతువులు జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ కూడా తిరుగుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోకపోవడంతో జిల్లా కలెక్టర్ సైతం ఏమి చేయలేక నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ప్రభుత్వాలు ఆరు నెలలకు ఒకసారి కొత్తగా పింఛన్దారులకు పింఛన్లు మంజూరు చేసేవారు. అయితే మానవతా దృక్పథంతో వితంతువులకు మాత్రం ప్రతినెల పింఛన్ల మంజూరు చేయడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ నియమ నిబంధనలకు కూటమి ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చింది. గత 12 నెలలుగా కొత్తగా ఎటువంటి పింఛన్లను మంజూరు చేయడం లేదు. గతంలో ఇస్తున్న పించన్ దారులకు మాత్రం మొత్తాలను పెంచి ప్రతినెల టెన్షన్ గా పింఛన్లను అందజేస్తున్నారు. ప్రస్తుతం వార్డు, గ్రామ వాలంటీర్లు లేకున్నా, గ్రామ సచివాలయాల ద్వారా సకాలంలో పింఛన్ల పంపిణీ జరుగుతుంది. ఒకటవ తేదీ ఆదివారం అయితే, ఒకరోజు ముందుగానే పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ఏడాది కిందట గత డిసెంబర్ నెలలో జగన్ ప్రభుత్వం కొత్తగా పింఛన్లను మంజూరు చేసి, అందజేసింది. తర్వాత ఎన్నికలు ప్రారంభం కావడంతో కొత్త పింఛన్లకు బ్రేక్ పడింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ ల గురించి ఆలోచించలేదు. ఉన్న పెన్షన్ దారులకు మొత్తాలను సర్దుబాటు చేసి సకాలంలో చెల్లించడానికి మల్లాగుల్లాలు పడుతుంది. చిత్తూరు జిల్లాలో 2,72,223 మందికి వివిధ రకాల పింఛన్లను అందజేస్తున్నారు. ఇందులో వృద్ధులు 42,000, వితంతు పింఛన్లు 60,000, చేనేత పింఛన్లు 2,500, దివ్యాంగుల పింఛన్లు 3,500, అభయహస్తం పింఛన్లు 11,500, కళ్ళు గీత కార్మికులకు 600, హిజ్రాలకు 32, ఒంటరి మహిళలకు 6,000, మత్స్యకారులకు 300, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు 600 మందికి, డప్పు కళాకారులకు 6,300 మందికి, చర్మకారులకు 800 మందికి, వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 2,700 మందికి కళాకారులకు 70 మందికి, సైనిక సంక్షేమ పింఛన్ల కింద 60, వృత్తి కళాకారులకు 800 మందికి పింఛన్లు అందజేస్తున్నారు. గత సంవత్సరం వరకు భర్త పింఛను తీసుకుంటూ మరణిస్తే, మరుసటి నెల నుంచి ఆ పింఛను భార్యకు అందజేసేవాళ్ళు. ఇలా పింఛన్లు మంజూరు చేయడం సాంప్రదాయంగా వస్తోంది. భర్తను కోల్పోయిన మహిళలని ఆర్థిక ఆదుకోవడానికి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుంది. అయితే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. వితంతువులకు కూడా కూడా గత సంవత్సరం రోజులుగా పింఛన్లు మంజూరు చేయడం లేదు. అయితే నవంబర్ నెలలో భర్త పింఛను తీసుకుంటూ మరణిస్తే, ఆ భార్యకు పింఛను ప్రతిపాదనలు పంపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే డిసెంబర్ నెలలో ఎటువంటి కొత్త పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేయలేదు. నవంబర్ నెలలో పింఛన్ తీసుకుంటూ మరణించిన వారి భార్యలకు మాత్రమే పింఛన్ మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం రోజులుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వితంతువుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే మంత్రులు మాత్రం వితంతువులకు ప్రతినెల పింఛన్లను మంజూరు చేస్తామని ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. 15వ తేదీ లోపు పింఛను తీసుకుంటూ మరణించిన వారి భార్యలకు మరుసటి నెలలో పింఛను అందజేస్తామని, 15 తర్వాత మరణిస్తే, నెల తర్వాత పింఛన్ అందజేస్తామని చెబుతున్నారు. అయితే ఇవి వాస్తవ రూపం దాల్చడం లేదు. తమకు పింఛను ఎప్పుడు వస్తుందా అని వితంతువులు ఆశగా ఎదురు చూస్తున్నారు. భర్తను కోల్పోయి, కుటుంబ సభ్యుల నిరాదరణకు గురై, సమాజం చిన్నచూపుకు గురవుతున్న వితంతువులు భర్త చనిపోయిన ఆరు నెలల వరకు ఇంటిని వదిలి కూలి పనులకు వెళ్ళకూడదు. వారిని కూలి పనులకు గాని ఇతర పనులకు కానీ పిలవరు. దీంతో ఒంటరిగా ఉన్న వితంతు మహిళలకు పూట గడవడమే కష్టం అవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వితంతు మహిళలకు పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు.