టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులకు చైర్మన్ పదవులు !
జిల్లాలో ఆ నలుగురికి అవకాశం
జాబితా సిద్దం అయినట్లు సమాచారం
ఒకటి, రెండు రోజుల్లో విడుదల అయ్యే అవకాశం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
టిడిపి పార్టీలో తొలి నుంచి కాష్టపడుతున్న అధికార ప్రతినిధులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని సిఎం చంద్రబాబు నిర్ణయించినట్టు తెలిసింది. ఆమేరకు వారికి తగిన పదవులు ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తి అయినట్టు తెలిసింది. 2020 నుంచి ఉన్న వారికి ఎక్కువ అవకాశం ఉంటుందని తెలిసింది. ఎన్నికల ముందు పదవులు ఇచ్చిన వారికి కూడా అవకాశం కల్పించే విషయం పరిశీలనలో ఉందని సమాచారం. ఈ మేరకు చిత్తూరు జిల్లాలో నలుగురు అధికార ప్రతినిధులకు చైర్మన్ పోస్టులు లభించే అవకాశం ఉంది.
వైసిపికి అధికార ప్రతినిధులకు పెద్దపీట వేస్తున్నారు. గతంలో అధికార ప్రతినిధులుగా పనిచేసిన వారికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి పదవులు కట్ట బెట్టారు. ఇప్పుడు కూడా మాజీ మంత్రులకు అధికార ప్రతినిధులుగా నియమించారు. చిత్తూరు జిల్లా నుంచి మాజీ మంత్రి ఆర్ కె రోజా వైసిపి అధికార ప్రతినిధిగా ఉన్నారు. టిడిపిలో అలాంటి అవకాశం ఒకరికి కూడ దక్కలేదు. దీనితో కనీసం నామినేటెడ్ పోస్టులు అయినా ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన నలుగురు అధికార ప్రతినిధుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి, డాక్టర్ సప్తగిరి ప్రసాద్, గౌనివారి శ్రీనివాసులు, వెంకీటీల సురేంద్ర కుమార్ పేర్లు ఉన్నాయని విశ్వసనీయంగా తెలిసింది. పెనుమూరుకు చెందిన సైకాలజిస్టుగా పేరున్న సుధాకర్ రెడ్డిని 2020 లో చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించి అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు. గతంలో ఆయన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జిల్లా కన్వీనర్, యువ జనతా, యూత్ కాంగ్రెస్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1983లో పుత్తూరు జనతా అభ్యర్థిగా పోటీ చేశారు. 2011లో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోటీ చేసారు. అధికార ప్రతినిధిగా నిత్యం వైసిపి అధినేత జగన్, అప్పటి జిల్లా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కె నారాయణ స్వామి, ఆర్ కె రోజా పై విమర్శల అస్త్రాలు సంధిస్తున్నారు. గత ఎన్నికల్లో తనకు లేదా తన కుమారుడు ఎన్ బి హర్ష వర్ధన్ రెడ్డికి నగరి లేక చంద్రగిరి టికెట్టు ఆశించి విఫలం అయ్యారు. పుంగనూరు నియోజకవర్గ పార్టీ పరిశీలకుడిగా కొంత కాలం పనిచేశారు. కాబట్టి ఆయనకు రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి తప్పదని తెలిసింది. పూతలపట్టు నియోజక వర్గం ఎస్సీ వర్గానికి చెందిన సప్తగిరి ప్రసాద తొలి నుంచి టిడిపిలో ఉన్నారు. ఎస్వీ యూనివర్సిటీలో టిడిపి విద్యార్థి విభాగం నేతగా పార్టీకి సేవలు అందించారు. అలాగే పార్టీ సర్వే విభాగంలో పనిచేసారు. గతంలో పౌరసరఫరాల రాష్ట్ర స్థాయి డైరెక్టర్ పదవి నిర్వహించారు. గత ఎన్నికల్లో పూతలపట్టు టికెట్టు ఆశించారు. 2020 నుంచి రాష్ట్ర ప్రతినిధిగా ఉన్నారు. వైసిపి నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. జిల్లాస్థాయి సమస్యల మీద, రైతుల సమస్యల మీద నిత్యం అధికార యంత్రంగాన్ని కలుస్తున్నారు. సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మీద ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారు. ఈ సారి ఆయనకు తగిన రాష్ట్ర స్థాయి పదవి ఇస్తారని సమాచారం. కప్పంకు చెందిన బిసి అయిన శ్రీనివాసులు తొలి నుంచి చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్నారు. కుప్పంలో ఆయన సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్నారు. గతంలో ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి, టిటిడి బోర్డు సభ్యుడు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్, ఎమ్మెల్సీ పదవులను బాధ్యతతో నిర్వహించారు. 2020 నుంచి అధికార ప్రతినిధిగా ఉన్నారు. విశ్వసనీయత, రాజాకీయ అవసరం కోసం చంద్రబాబు ఆయనకు పదవి ఇస్తారని అంటున్నారు. చిత్తూరుకు చెందిన న్యాయవాది వెంకీటీల సురేంద్ర కుమార్ తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్నారుపనిచేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబుునాయుడుకు సమీప బంధువైన సురేంద్ర కుమార్ న్యాయవాద వృత్తి కంటే పార్టీ కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. జిల్లా పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా, జిల్లా కార్యాలయ కార్యదర్శిగా, చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధిగా, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేసి, ప్రస్తుతం రాష్ట్ర అధికార ప్రతినిధిగా పార్టీ మీద, ప్రభుత్వం మీద వస్తున్న విమర్శలను సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. ఎన్నికల సమయంలో సత్యవేడు తిరుపతి నియోజక వర్గాల పరిశీలకుడిగా పనిచేశారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న ఆయనకు తగిన పదవి రాలేదన్నది వాస్తవం. ఒకసారి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డైరెక్టర్ గా మాత్రమే ఆయన పని చేశారు. ఈ పర్యాయం రాష్ట్రస్థాయి చైర్మన్ పదవి సురేంద్ర కుమార్ ను వరించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన జాబితా ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో జాబితా విడుదల అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి విశ్వసనీయంగా తెలిసింది. ఏదైనా కారణాల చేత జాబితా ఆలస్యం అయితే సంక్రాంతి వరకు వేచి ఉండాలని అంటున్నారు.
పో రై 1 సుధాకర్ రెడ్డి
2. సప్తగిరి ప్రసాద్
3. శ్రీనివాసులు
4. సురేంద్ర కుమార్