13, డిసెంబర్ 2024, శుక్రవారం

మారేడు గడ్డల సాగుతో గిరిజన బతుకుల్లో వెలుగులు

సేకరణ వదిలి రైతులుగా మారిన గిరిజనులు 

పొలంలోనే మరేడును  పండిస్తున్న గిరిజనులు

మారిపోయిన గిరిజనుల బతుకులు 

ఔదార్యంతో వారికీ సహకరిస్తున్న కలెక్టర్ 

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. 

ఆ గిరిజనులు ఒకనాడు అడవి మొత్తం తిరిగి  మారేడు గడ్డలను సేకరించేవారు. అదృష్టం బాగుండి శ్రమకు  తగిన ఫలితం లభిస్తే సంతోషపడే వాళ్ళ. లేకుంటే ఈసురోమంటూ బాధతో ఇంటికి చేరుకునేవారు. కుటుంబం మొత్తం కష్టపడి మారేడు గడ్డలను సేకరించినా, వాటిని ఇంటికి చేర్చడానికి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనేవారు. మధ్యలో అటవీశాఖ అధికారుల వేధింపులు. సేకరణ కోసం తిండి తిప్పలు లేకుండా అడవి మొత్తం  తిరగాల్సి వచ్చేది. ఇద్దరు గిరిజన సోదరులకు వచ్చిన ఆలోచన వారికి బ్రతుకులలో వెలుగులను నింపాయి. వారి ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. ఆ గిరిజనులు రైతుల అవతారం ఎత్తారు. తమ పొలంలోనే మారేడు గడ్డలను పండించడం ప్రారంభించారు. పంట బాగా వచ్చింది. మార్కెటింగ్ సౌకర్యం కూడా కుదిరింది. ఈ విషయం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్  తెలియడంతో వారిని పెద్ద మనసుతో ఆదుకున్నారు. వారికి డ్రిప్ ఇరిగేషన్ మంజూరు చేశారు. భూమిలేని గిరిజనులకు భూములు అందజేశారు. వారు ఆర్థికంగా మరింత బలోపేతం కావడానికి తన వంతు  సహాయ సహకారాలు అందించారు. ప్రస్తుతం ఆ గిరిజనులు ఇతర గిరిజనులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

అక్షర జ్ఞానం లేని అమాయక గిరిజన రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తే తాము కూడా ఇతర రైతుతోనైన సమానంగా పంటలు పండించి, సమాజంలో సగౌరవంగా బతకగలమని  నిరూపిస్తున్నారు. పెనుమూరు మండలం లెక్కలపూడి వాండ్ల వూరు, ఎస్టీ కాలనీకి చెందిన గిరిజన రైతులు అడవిలో పండే మారేడు (గడ్డ) ను సాధారణ పంటగా మార్చి తమ పొలాలలో  పండిస్తున్నారు.  యానాది కులానికి చెందిన తులసి, రమేష్, వెంకటేష్, గిరిజనులకు వచ్చిన ఒక ఆలోచన మొత్తం వారి జీవన విధానాన్నే మర్చి వేసింది. రైతులుగా మారి, మారేడు (గడ్డ) పండించి లక్షల ఆదాయం ఆర్జిస్తున్నారు. మారేడు గడ్డలు అటవీ ప్రాంతంలో పండుతాయి. ఆ గడ్డలను కుటుంబంతో సహా తీసుకొచ్చి సంతలో అమ్మేవారు. మారేడు గడ్డలను బెంగుళూరు, హైదరాబాద్ నుంచి వచ్చిన పెద్ద ఆసాములు మంచి ధర ఇచ్చి కొనుగోలు చేసేవారు. వేసవి కాలంలో మనం తాగే షరబత్, తయారీకి ఉపయోగించేవారు. వేసవి కాలం పెరిగింది. షరబత్ తాగి  వేసవి తాపం తగ్గించుకుందాం అనే ప్రజల సంఖ్య కూడా పెరిగింది. అందులోను ఉబ్బసం వంటి వ్యాధుల నిరోధానికి వాడె ఆయుర్వేదిక్ మందుల తయారీ కూడా దీంతో మార్కెట్ లో మారేడు గడ్డకు విపరీత డిమాండ్ ఏర్పడింది. అడవి నుంచి మారేడు తెచ్చే సమయంలో అటవీ శాఖ అధికారులు అడ్డగించి ఎర్రచందనం కలప తీసుకొస్తున్నారా అంటూ అమాయక గిరిజనులను ఇబ్బంది పెట్టేవారు. ఇలాంటి సంఘటనలు అమాయక గిరిజన రైతులకు సాధారణమయ్యాయి. అయినా ఉదయమే ఫారెస్టు నుంచి గడ్డలు తేవడం ఆసాములకు కొద్దిపాటి సరుకే అయ్యింది. రమేష్, తులసిలకు ఒక ఆలోచన తట్టింది. మారేడు గడ్డ పంట మేమే మా పొలాల్లో వేస్తే అనే ఆలోచన కలిగింది. అటవీ ఇబ్బందులు కూడా వుండవు కదా అనుకొన్నారు. కుటుంబం అంత అడవి వెళ్ళడం ఎక్కడెక్కడో పండిన గడ్డలు ఒక చోటికి చేర్చడం ఇబ్బంది అనిపించింది. విత్తనాల కోసం  కర్ణాటక రాష్ట్రానికి బెంగుళూరుకు వెళ్లారు. మారేడు విత్తనాలు కిలో రూ. 1500 కొని తీసుకొచ్చి తమకు ప్రభుత్వం భూపంపిణి పథకం క్రింద ప్రభుత్వం ఇచ్చిన పొలంలో నాటారు. భూమిలో పెరిగే ఈ గడ్డలు ప్రకృతి సిద్దమైన అటవీ వాతావరణంలోనే చక్కగా పెరిగాయి. వీటికి ఎలాంటి ఎరువులు వాడకుండా కేవలం 15 రోజుల కోసారి నీరిస్తే పంట చక్కగా వస్తుంది. సుమారు రెండేళ్ళు కాలానికి పంట చేతికొచ్చింది. కర్ణాటక, హైదరాబాదు నుంచి ట్రేడర్లు వచ్చి సరుకంతా తీసుకెళ్ళారు. మారేడు గడ్డల విక్రయంలో గిరిజనులైన రమేష్, తులసిలకు ఎకరాకు 7.5 లక్షల రూపాయల ఆదాయం సంపాదించారు. తిరిగి విత్తనాలు తీసుకొచ్చారు. మారేడు పంటను పండించారు. 8 ఏళ్లుగా సాగుతున్న పంట గిరిజన రైతుల దశ, దిశను మార్చేసింది. పూరి గుడిసెలో నివసిస్తున్న రమేష్, తులసి కుటుంబం పక్కా గృహం గృహనిర్మాణ సంస్థ ఆర్థిక సహాయంతో ఇల్లు కూడా నిర్మించుకొంది. ఆదర్శంగా నిలిచి రమేష్, తులసిలను చూసి సుమారు పది గిరిజన కుటుంబాలు మారేడు గడ్డలు పండిస్తున్నారు. వారికి  కూడా మంచి ఆదాయం వస్తోంది. పంట ఎక్కువ కావడంతో  కిలో 500 రూపాయలు కొనే ట్రేడర్లు 250 కి తగ్గించారు. అయిన పంట పండించడంలో ఎలాంటి ఖర్చు లేదు. పురుగుల మందులు అవసరం లేదు. ఒకసారి విత్తనం నాటేస్తే మధ్యలో నీరుకట్టి తిరిగి రెండు సంవత్సరాలకు పంట తీసుకోవడమే. వేసవి కాలానికి అవసరమైన సరుకు అయినందున సుమారు 50 ఎకరాలలో ఆ గ్రామ గిరిజన రైతులు పండిస్తున్నారు. గ్రామంలో సుమారు 10 గిరిజన కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నారు.

 జిల్లా కలెక్టర్  ఔదార్యం 

మారేడు గడ్డ పంటతో లెక్కలపూడి గ్రామ గిరిజన రైతులు మంచి ఆదాయం పొందుతున్న తీరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ దృష్టికి వచ్చింది. గిరిజన రైతులకు బిందు సేద్యం పరికరాలు అందించారు. మరి కొంత మంది డ్రిప్ సౌకర్యం అందించేందుకు రైతుల నుంచి ధరఖాస్తులు తీసుకొన్నారు. వెంటనే వారికీ కూడా డ్రిప్ పరికరాలు, ఇరిగేషన్ అందజేయాలని  ఉద్యాన శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం డ్రిప్ తో పాటు, పొలాలు లేని రైతులకు భూ పంపిణీ కార్యక్రమంలో  భూములు ఇచ్చేందుకు సిద్దంగా వున్నారు.  ఆధార్ కార్డు లేని యానాది కుటుంబాలకు కార్డులు ఇవ్వమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు, సామాజికంగా ముందుకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.

పో రై గంగ 1 పొలంలో మారేడు గడ్డాల సాగు 

గంగ 2 పండించి, అమ్మకానికి సిద్దం చేసిన పంట 

గంగ 3 జిల్లా కలెక్టర్ 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *