కుప్పంలో చంద్రబాబును YCP ఓడిస్తుందా ?
* కుప్పంలో లక్ష మెజారిటీ సాధిస్తామంటున్న చంద్రబాబు
* చంద్రబాబును ఓడిస్తామంటున్న జగన్, పెద్దిరెడ్డి
* వ్యూహాలు, ప్రతివ్యుహాలతో ఇరుపక్షాలు సిద్దం
* వేడెక్కుతున్న కుప్పం రాజకీయం
జిల్లాలో వాతావరణం చల్లగా ఉన్నా, కుప్పం రాజకీయాలు మాత్రం వేడెక్కుతున్నాయి. Why not Kuppam అంటూ ఈ సారి ఎలాగైనా చంద్రబాబును ఓడిస్తామని జగన్మోహన్ రెడ్డి శపదం చేశారు. చంద్రబాబు మాత్రం ఈ సారి లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. జూన్ 19 న మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 15న కుప్పంలో జరిగిన సభలో ఆ మేరకు ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కూడా అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. ఇందుకు అనుగుణంగా నియోజకవర్గ బాధ్యతను MLC కలిచెర్ల శ్రీకాంత్ కు అప్పగించారు. అయన కుప్పం మునిసిపలిటీలో కో ఆప్షన్ సభ్యులుగా నమోదు అయ్యారు. మాజీ ఎమ్మెల్యే BR దొరస్వామి నాయుడు కుమారుడు, జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు సురేష్ ను పార్టీలోకి తీసుకువచ్చారు. కుప్పంలో చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణం ప్రారంభించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రను కుప్పం నుండి భారీ ఎత్తున ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభానికి TDP అధిరధ మహారాధులే కాకుండా, నందమూరి కుటుంబ సభ్యులు అందరు హాజరయ్యారు. చంద్రబాబునాయుడు కూడా తరచుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
YCP కూడా కుప్పం మీద ప్రత్యేక దృష్టిని సారించింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి కుప్పం సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపికి 175 కు 175 స్థానాలు వస్తాయని చెప్పారు. why not Kuppam అన్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడును ఓడిస్తామని సవాలు విసిరారు. కుప్పం మునిసిపల్ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో సంపూర్ణ విజయం సాధించిన తమకు చంద్రబాబును ఓడించడం ఒక లెక్క కాదని చెప్పారు. దీని కోసం కుప్పంలో అనేక వ్యూహాలు అమలు పరుస్తున్నారు. టిడిపి ఓటు బ్యాంకు అయిన బీసీల్లో ఒక వర్గమైన వన్నెకుల క్షత్రియుల ఓట్లు చీల్చడానికి పావులు కదుపుతున్నారు. ఆ వర్గానికి చెందిన నియోజక వర్గం పార్టీ ఇంచార్జి భరత్ కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. రానున్న ఎన్నికలలో భరత్ ను MLA అభ్యర్థిగా రంగంలోకి దించనున్నట్లు సమాచారం. అలాగే అదే వర్గానికి చెందిన టిడిపి రాష్ట్ర నేత డాక్టర్ సిపాయి సుబ్రమణ్యంను ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. కుప్పంలో ఆ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 35 వేల మంది ఉన్నారని అంచనా వేస్తున్నారు. కాబట్టి ఆ ఓట్లు పూర్తిగా కొల్ల గొడితే చంద్రబాబును ఓడించ వచ్చని భావిస్తున్నారు.
లక్ష ఓట్ల మెజారిటీ సాధ్యమే :
తెలుగు రాష్ట్రాలలో తిరుగు లేని రికార్డులు సాధించిన చంద్రబాబు దృష్టి పెడితే లక్ష మెజారిటీ సాధిస్తారనడంలో సందేహం లేదంటున్నారు. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్య మంత్రిగా ఉన్నారు, ప్రతి పక్షనాయుకునిగా 15 యేళ్ల అనుభవం ఉంది. కుప్పం నుంచి వరుసగా ఏడు సార్లు, అంతకు ముందు చంద్రగిరి నుంచి ఒక సారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నేపథ్యంలో పలు అంశాలు విశ్లేషిస్తే లక్ష మెజారిటీ లక్ష్యం నెరవేరుతుందని పరిశీలకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 1999 నుంచి ఆయన నామినేషన్ వేసి నియోజక వర్గంలో ప్రచారం చేయనప్పటికి వరుసగా భారీ మెజారిటీ సాధిస్తున్నారు. అత్యధికంగా 1999 ఎన్నికల్లో 65,687 ఓట్ల మెజారిటీ సాధించారు. ఆయన ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసి, కట్టు దిట్టంగా పోల్ మేనేజ్ మెంట్ చేస్తే లక్ష మెజారిటీ సాధన కష్టమేమీ కాదని అంటున్నారు. దీని కోసం తూర్పు రాయలసీమ పట్టభద్రులు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నియోజక వర్గంలో కృషి చేస్తున్నారు. ఆయన కుప్పం మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో సభ్యునిగా కొనసాగు తున్నారు. అక్కడి నాయకులు, కార్యకర్తలను కలుపుకుని పార్టీ ఓట్లు తొలగించకుండా జాగ్రత్త పడటంతో పాటు, అర్హులైన ప్రతి వ్యక్తిని ఓటరుగా నమోదు చేయించడానికి కృషి చేస్తున్నారు. జగన్ అవినీతి, అరాచక పాలనపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. నియోజక వర్గ అభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషిని వివరిస్తున్నారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు అవసరం గూర్చి అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తారని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైకాపా ఎన్ని కుయుక్తులు పన్నినా కుల, వర్గాలకు అతీతంగా ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టడానికి సిద్దంగా ఉన్నారు.దీనితో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న మొత్తం 14 స్థానంలో గెలవడానికి చంద్రబాబు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.1983, 1994 ఎన్నికల్లో అప్పుడు ఉన్న 15 నియోజక వర్గాలలో 14 స్థానాలలో టిడిపి అభ్యర్ధులు విజయం సాధించారు. ఇప్పుడు 14కు 14 స్థానాలు సాధించడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేస్తున్నారని NB సుధాకర్ రెడ్డి వివరించారు.