12, జూన్ 2023, సోమవారం

జిల్లా నుండి మరో సినీతార రాజకీయరంగ ప్రవేశం

మరో సినీతార రాజకీయరంగ ప్రవేశం
మారనున్న పూతలపట్టు రాజకీయం
MLA లేక MPగా పోటీకి సిద్ధం


          సినీ రంగం నుండి మరో నటుడు రాజకీయరంగ ప్రవేశం చేయనున్నారు. ఐరాలలో పుట్టి, బంగారుపాళ్యంలో చుదువుకున్న దళిత సామాజిక వర్గానికి చెందిన సినీ నటుడు సప్తగిరి రాజకీయరంగ ప్రవేశానికి రంగం సిద్ధం అయ్యయింది. సప్తగిరి పూతలపట్టు అసెంబ్లీ లేక చిత్తూరు పార్లమెంట్ కు పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారు. సోమవారం తిరుపతికి వచ్చిన సప్తగిరి ఈ మేరకు తన మనసులోని మాటను పాత్రికేయులతో పంచుకున్నారు. పూతలపట్టుకు ఇప్పటికే జర్నలిస్ట్ కలికిరి మురళిని ఇన్ ఛార్జ్ గా ప్రకటించారు. మురళి స్థానంలో సప్తగిరికి అసెంబ్లీ బరిలో దించుతారా లేక పార్లమెంట్ కు అవకాశం ఇస్తారా అన్న విషయం తేలడానికి కొంత సమయం పడుతుంది.


         చిత్తూరు జిల్లా నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లి.. ఇటు రాజకీయాల్లో రాణిస్తున్నవారు లేకపోలేదు. రోజా టీడీపీలో చేరి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.. ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలతో వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకుని.. నగరి నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఇప్పుడు ఏకంగా జగన్‌ కేబినెట్‌లో పర్యాటకశాఖ మంత్రి కూడా అయ్యారు. అంతేకాదు దివంగత నటుడు, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్‌ కూడా సినిమాల్లో నటించారు.. చంద్రబాబుతో ఉన్న స్నేహంతో టీడీపీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. చిత్తూరు నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఇప్పుడు సప్తగిరి కూడా అదేబాటలో నడుస్తున్నారు. టీడీపీలో చేరి పొలిటికల్‌ ఎంట్రీకి సిద్ధమయ్యారు. సప్తగిరి కూడా రోజా, శివప్రసాద్‌లా టీడీపీలో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.. మరి ఆయన ఏ మేరకు సక్సెస్‌ అవుతారో చూడాలి.


               వచ్చే ఎన్నికల్లో తాను తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తానని సినీ నటుడు సప్తగిరి ప్రకటించారు. తిరుపతిలో ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి సోమవారం సప్తగిరి హాజరయ్యారు. తాను క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు.  తెలుగుదేశం పార్టీ నుండి తనకు  ఆఫర్‌ వచ్చిన మాట నిజమేనని, త్వరలోనే శుభవార్త చెబుతానన్నారు.

           టీడీపీలో తన పాత్ర ఏంటి అనేది పెద్దలు నిర్ణయిస్తారని, తనకు ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉందని తన మనసులో మాట చెప్పారు. టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తనవంతుగా పనిచేస్తానని ప్రకటించారు. తిరుపతిలో జరిగిన ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన పొలిటికల్‌ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. తనది చిత్తూరు జిల్లానే అని.. పేదల కష్టాలు తెలుసని.. పేదలకు సేవ చేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా తన వంతు కృషి చేస్తాను అన్నారు. టీడీపీ నుంచి ఆఫర్‌ ఉన్నమాట వాస్తవమని.. కాకపోతే ముందే చెప్పడం సరికాదన్నారు. మరో 10, 15 రోజుల్లో శుభవార్త చెబుతానన్నారు. 

             చంద్రబాబు అభివృద్ధిని   అందరూ చూశారని.. తాను ఎన్నికల్లో పోటీచేయడంపై పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇప్పటికే నారా లోకేష్‌ను పాదయాత్రలో కలిశానని చెప్పుకొచ్చారు. తాను నిజాయితీతో సినిమారంగంలో మంచి అవకాశాలను దక్కించుకోగలిగానని.. అలాగే రాజకీయాల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటాను అంటున్నారు. తనకు సినిమా వల్లే రాజకీయంగా అవకాశాలు వచ్చాయని.. సినిమాలను వదిలేసేది లేదన్నారు. చిత్తూరు జిల్లాతో తనకు అనుబంధం ఉందన్నారు సప్తగిరి. తాను ఐరాలలో పుట్టాననని.. బంగారుపాళ్యం, పుంగనూరులో చదివాను అన్నారు.

               తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం వస్తే చిత్తూరు జిల్లాలోని పార్లమెంటు కానీ, అసెంబ్లీకి కానీ పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. చంద్రబాబు, లోకేష్‌లు ఏం ఆదేశిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. టీడీపీ అధికారంలో తెచ్చేందుకు తన సేవలు అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడానికి సిద్ధమన్నారు.

          

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *