శ్రీకాళహస్తి తెదేపాలో భగ్గుమన్న విభేదాలు
శ్రీకాళహస్తి తెదేపాలో భగ్గుమన్న విభేదాలు
SCV నాయుడు పార్టీలో చేరిక వాయిదా
14న కుప్పంలో ఇద్దరితో చంద్రబాబు సమావేశం
శ్రీకాళహస్తి టిడిపిలో తలెత్తిన విభేదాలు పార్టీ కార్యకర్తలకు సమస్యగా తయారయ్యింది. ఎటు వెళ్ళాలో తెలియక కార్యకర్తలు తలలు పట్టుకొంటున్నారు. ఆదిలోనే హంసపాదు అన్నట్లు మాజీ ఎమ్మెల్యే ఎస్.సి.వి.నాయుడు టిడిపిలో చేరడాన్ని ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డి వ్యతిరేకించడం వివాదానికి దారి తీసింది. SCV నాయుడు పార్టీలో చేరకముందే వర్గాపోరుకు తెరతీసినట్లు అయ్యింది. SCV నాయుడు TDPలో చేరితే మూడు నియోజక వర్గాలలో పార్టీ బలోపేతం అవుతుందని కార్యకర్తలు, అధిష్టానం భావిస్తున్న నేపధ్యంలో బొజ్జల సూదీర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది. సుధీర్ రెడ్డి వైఖరి కారణంగా పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని పార్టీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల నాయుడు, చంద్రబాబును కలిసి తిరిగి పార్టీలో చేరడానికి ఆసక్తిగా ఉన్నానని తెలిపారు. బాబు సానుకూలంగా స్పందించడంతో ఆయన సూళ్లూరుపేట, సత్యవేడు నాయకులతో ఆత్మీయ సమావేశాలు జరిపారు. గురువారం అమరావతిలో చంద్రబాబు సమక్షంలో చేరడానికి ముహూర్తం కూడా నిర్ణయించారు.
అయితే ఎస్ సి వి చేరికను వ్యతిరేకిస్తున్న సుధీర్ రెడ్డి ఎవరూ అమరావతికి TDP కార్యకర్తలు ఎవ్వరూ వెళ్లొద్దంటూ పార్టీ గ్రూపుల్లో మెసేజ్‌లు చెప్పారు. ఎస్ ఎస్సీవి నాయుడు తనను సంప్రదించలేదని, పార్టీ ముఖ్యులు కూడా సమాచారం ఇవ్వలేదని అవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా అమరావతి వెళ్తే వ్యవహారం మరోలా ఉంటుందని హెచ్చరించారు. దీంతో SCV చేరిక వాయిదా పడింది. ఈ నెల14 వ తేదీన ఇద్దరు నేతలను కుప్పం రమ్మని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. తన స్వంత నియోజక వర్గం పర్యటనకు వస్తున్న చంద్రబాబు పనిలో పనిగా శ్రీకాళహస్తి నేతల మధ్య రాజీ చేస్తారని అంటున్నారు. గతంలో కాంగ్రెస్ టిక్కెట్టుపై ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్సీవీ నాయుడు తరువాత టిడిపిలో చేరారు. ఇక్కడ టిక్కెట్టు రాక పోవడంతో 2019 లో వైకాపాలో చేరారు. అక్కడ తాను ఆశించిన ఎమ్మెల్సీ పదవి రాదని తేలి పోవడంతో మళ్ళీ టిడిపిలో చేరడానికి నిర్ణయించుకున్నారు. పార్టీలో చేరి శ్రీకాళహస్తి నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలిసింది.
సుధీర్ కంటే అయనకు టిక్కెట్టు ఇవ్వడం వల్ల పార్టీకి ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఒక వర్గం వాదిస్తోంది.అయనకు శ్రీకాళహస్తి నియోజకవర్గంతో పాటు సూళ్లూరుపేట, సత్యవేడు నియోజకవర్గంలో పలుకుబడి ఉందని అంటున్నారు. కాగా ఎస్సివీ నాయుడును పార్టీలో చేర్చుకుని తిరుపతి పార్లమెంటు అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగిస్తే మంచిదని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఒకరు చెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తగిన పదవి ఇస్తారని అంటున్నారు. అయితే ఆయన చేరిక వల్ల తనకు ఇబ్బంది ఉంటుందని సుధీర్ అడ్డుపడుతున్నారని తెలిసింది. చంద్రబాబు ఇద్దరు నేతలతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని భావిస్తున్నారు. ఈ సారి ఎలాగైనా పార్టీని అధికారంలోకి తేవాలని చంద్రబాబు పట్టుదలగా ఉంటే, సుధీర్ లాంటి వారి కారణంగా పార్టీ బలహినపడుతుందని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.