పాడెను మోస్తూ... పైలోకలకు ముగ్గురు
పాడెను మోస్తూ పైలోకలకు..
శ్మశానం వద్ద ముగ్గురు దుర్మరణం
చిత్తూరు జిల్లా కుప్పంలో పెను విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో జరిగిన అంత్యక్రియలకు వచ్చినవారిలో ముగ్గురు విద్యుదాఘాతంతో మృతి చెందారు.
కుప్పం పురపాలక సంఘం తంబిగానిపల్లె ఎస్సీ కాలనీకి చెందిన రాణెమ్మ (65) గురువారం అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె అంత్యక్రియలు శుక్రవారం పెట్టుకున్నారు. ఇనుముతో చేసిన పాడెపై ఆమె శవాన్ని మోసుకెళ్లే క్రమంలో.. శ్మశానం వద్ద బాగా కిందికి వేలాడుతున్న విద్యుత్తు తీగలు తగిలాయి.
దీంతో పాడెను మోస్తున్న మునెప్ప (45), తిరుపతిరావు (28), రవీంద్ర (30) విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో తిరుపతిరావు మాత్రం గుంటూరుకు చెందిన వ్యక్తి. మిగిలిన ఇద్దరూ స్థానికులే. ప్రకాశ్ అనే మరో వ్యక్తి గాయపడ్డారు.
దీంతో తంబిగానిపల్లె సోకసంద్రంగా మారిపోయింది. కుప్పం రెస్కో నిర్లక్ష్యంవల్లే ఇది జరిగిందని, గ్రామస్థులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, కిందికి వేలాడుతున్న విద్యుత్తు తీగలను సరిచేయాలని డిమాండ్ చేస్తున్నారు.