జి.డి. నెల్లూరు టిడిపిలో ముదురుతున్న వర్గపోరు
చిట్టిబాబు వ్యవహారంతో ముదిరిన వర్గపోరు
థామస్ కు వ్యతిరేకంగా మారుతున్న వాతావరణం
ముప్పేట దాడికి YCP వ్యూహం
పార్టీకి నష్టం కలుగుతుందని నేతల ఆవేదన
గంగాధర నెల్లూరు నియోజక వర్గంలో టిడిపి వర్గపోరు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఇటీవల నియోజక వర్గం ఇంచార్జిగా డాక్టర్ థామస్ ను నియమించారు. దీంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. నియోజక వర్గం మాజీ సమన్వయ కర్త భీమినేని చిట్టిబాబు బాబు నాయుడుకు స్వంత మనుషులే దూరమయ్యారు. తన సామాజిక వర్గానికే చెందిన టిఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఇ లోకనాధ నాయుడు పెనుమూరు మండల కమిటీ అధ్యక్షుడు పి రుద్రయ్య నాయుడు, ఎస్ ఆర్ పురం మండల కమిటీ అధ్యక్షుడు జి జయశంకర్ నాయుడు ఇతర మండలాల అద్యక్షులు చిట్టిబాబుకు వ్యతిరేకులు అయ్యారు. ఆఖరికి చిట్టిబాబు స్వంత మందలమైన పాలసముద్రం అధ్యక్షుడు రాజేంద్ర పూర్తిగా దూరమయ్యారు.
దీంతో రెండు వర్గాల మధ్య వాట్సప్ వార్ ప్రారంభమయ్యింది. చిట్టిబాబు దయతో మండల కమిటీ అధ్యక్షుడు అయిన రాజేంద్ర సిగ్గంటే పదవికి రాజీనామా చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. రాజేంద్ర మండలంలో ఒక కార్యక్రమం కూడా జరపడం లేదని ఆరోపణలు సంధిస్తున్నారు. అయితే తాను చిట్టిబాబు కంటే ముందు నుంచి టిడిపిలో ఉన్నానని ఎంపిపి, జెడ్పీటిసిగా పనిచేశానని రాజేంద్ర తెలిపారు. తాను మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడుతో సన్నిహితంగా ఉంటూ మండల అభివృద్ధికి ఎంతో సేవచేసానని అంటున్నారు. తన అవసరం గుర్తించి పరిశీలకుల సమక్షంలో కార్యకర్తలు తనను ఏకగ్రీవంగా మండల కమిటీ అధ్యక్షుడుగా ఎన్నుకున్నారని స్పష్టం చేశారు. తాను దళితుడు అన్న కారణంగా చిట్టిబాబు చులకనగా చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉండగా వెదురుకుప్పం మండల కమిటీ అధ్యక్షుడు కె లోకనాధ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని కొందరు సంతకాల సేకరణ మొదలు పెట్టారు. దీనితో రెడ్డి సామాజిక వర్గం వారు ఏకం అవుతున్నారు. ఇదిలా ఉండగా మతం మారిన థామస్ ను ఎస్సీలకు కేటాయించిన నియోజక వర్గంలో పోటీ చేయించడం తగదని అంటున్నారు. ఈ నిర్ణయం ఒక విధంగా దళితులకు ద్రోహం చేయడమేనని కొందరు విమర్శిస్తున్నారు.
ఎక్కడో చెన్నైలో వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తికి టిక్కెట్టు ఇస్తే పని చేయకూడదని కొందరు స్తానిక దళిత నాయకులు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. కాగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి థామస్ నేర చరిత్ర బయట పెడతానని అతని బంధువులతో చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నియోజక వర్గంలో టిడిపి రోజు రోజుకు సమస్యల ఊబిలో కూరుకు పోతున్నదని అంటున్నారు. దీనిపై కొందరు చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారని అంటున్నారు. మాజీ సమన్వయ కర్త భీమినేని చిట్టిబాబు బాబు కారణంగానే నియోజకవర్గంలో అసమ్మతి పెరుగుతోందని అంటున్నారు. ఒక పరిచయ కార్యక్రమంలో థామస్ వేసుకున్న చొక్కా, ప్యాంటు, కట్టుకున్న గడియారం, వేసుకున్న బూట్ల ధరలను వివరించడంతో అది కాస్త వివాదానికి దారితీసింది. రోజురోజుకు నియోజకవర్గంలో అసమ్మతి, సవాళ్ళు, ప్రతిసవాళ్ళు పెరుగుతున్నాయి. అధిష్టానం ఈ విషయాన్ని గుర్తించి, వివాదాలకు పుల్ స్టాప్ పెట్టకుంటే, దాని ఫలితం రానున్న ఎన్నికల మీద ఉంటుందని పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


