మామిడి మద్దతు ధర రూ.15.50
మామిడి మద్దతు ధర రూ.15.50
జిల్లా కలెక్టర్
మామిడి పంట విషయంలో రైతులు కొనుగోలుదారులు ఇద్దరికీ మద్యస్థంగా ఉండేందుకు మామిడి కి మద్దతు ధరను ప్రకటించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ తెలిపారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ మామిడి రైతులతో మరియు ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులతో సంయుక్తంగా సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... చిత్తూరు జిల్లా మామిడి పంటకు ప్రసిద్ధిచెందినదనన్నారు.ఈ పంట పండించే రైతులకు ప్రభుత్వం మేలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో మామిడి కోత ప్రారంభమవుతున్నందున రైతులకు వారు పెట్టుబడికి తగిన ఫలితంకల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడు తున్నట్లు చెప్పారు.
వర్షాలు కురవడం వలన మామిడి పంటకు సంబంధించి రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందనన్నారు. మామిడికాయలపైన నల్లని మచ్చలు రావడంతో పాటు గాలి, వానతో పంట రాలిపోవడం జరుగుతున్నట్లు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చారు... దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగానికి న్యాయం చేయాలని మామిడి రైతులు కలెక్టర్ ను కోరారు.
జిల్లా యంత్రాంగం నిర్ణయించిన మద్దతు ధర మేరకే మామిడి పండ్లను కొనుగోలు చేశామని ప్రాసెసింగ్ యూనిట్ల యాజమాన్యం నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో మామిడి కోత ప్రారంభమవుతున్నదనన్నారు. ఈ నేపథ్యం లో ఇప్పటికే కర్ణాటక రాష్ట్రం శ్రీనివాస పురం, తమిళనాదు రాష్ట్రం క్రిష్ణగిరి నుండి మామిడి పండ్లు జిల్లాకు వస్తున్నాయన్నారు. రైతులు ఒకేసారి పంట కోసి ప్రాసెసింగ్ యూనిట్ల వద్దకు తీసుకొని రావడం కొంత ఇబ్బందికరంగా ఉందన్నారు. రైతులు దశలవారీగా పక్వానికి వచ్చిన పంటను మాత్రమే కోసి ప్రాసెసింగ్ యూనిట్ల యాజమాన్యానికి సహకరించాలని కోరారు. రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులతో చర్చలు జరిపిన అనంతరం జిల్లా కలెక్టర్ మద్దతు ధరను ప్రకటించారు.
నేటి నుండి జూన్ 11 వరకు మద్దతు ధర రూ.15.50 పైసలు....
నేటి నుండి జూన్ 11వ తేదీ వరకు జిల్లాలో మామిడి మద్దతు ధర రూ. 15.50 పైసలుగా ఉంటుందని కలెక్టర్ ఎస్. షన్మోహన్ వెల్లడించారు. ప్రస్తుతం ప్రకటించిన ఈ మద్దతు ధర ను అన్ని ఫ్యాక్టరీల్లో అమలు చేసేలా చర్యలు చేపట్టాలని ఉద్యానవన శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జూన్ 11 తరువాత తదుపరి సమావేశం నిర్వహించి మద్దతు ధరను మరోసారి ప్రకటిస్తామన్నారు. ఈ మద్దతు ధర ను రైతులు, కొనుగోలు దారుల సమక్షంలో నిర్ణయించినట్లు వెల్లడించారు.
వర్షాల వల్ల పంట రాలిపోతుందనే కారణం తో రైతులు తొందర పడి పంట మొత్తాన్ని కోయ రాదనన్నారు. పరిస్థితులను బట్టి పక్వానికి వచ్చిన పండ్ల ను మాత్రమే కోయాలని రైతులకు కలెక్టర్ సూచించారు. పంట మొత్తం ఒకేసారి ప్రాసెసింగ్ యూనిట్ల వద్దకు తీసుకొని వెళ్లరాదని కోరారు. పక్వానికి వచ్చిన పంటను మాత్రమే దశల వారీగా కోయాలన్నారు. ఈ విషయంలో రైతులుసంయమనం పాటించాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రామ చంద్రారెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి పండ్ల పరిశ్రమ సమాఖ్య నాయకులు గోవర్ధన్ బాబీ, శివకుమార్ రైతులు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.