మామిడికి రూ.20 గిట్టుబాటు ధర ఇవ్వాలి
మామిడికి రూ.20 గిట్టుబాటు ధర ఇవ్వాలి
జిల్లా కలెక్టర్ కు భాజపా వినతి.
రెండు రోజుల్లో గిట్టుబాటు ధరకు హామీ
మామిడి రైతులకు కిలో రూ. 20 చొప్పున గిట్టుబాటు ధర కల్పించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ షన్మోహన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు మాట్లాడుతూ మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, తోతాపురి కిలోకు 20 రూపాయల ధర రైతులకు వచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. రైతులు, మామిడి పరిశ్రమల యాజమాన్యులు, దళారీ వ్యాపారులతో అత్యవసర సమావేశం నిర్వహించి రైతుల ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఇప్పటివరకు మామిడికాయలు నేలరాలి, పంట నష్టపోయిన రైతులకు తక్షణం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మామిడి రైతులకు న్యాయం చేసుకుంటే భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడి ఆందోళనలు చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యురాలు దుర్గ రామకృష్ణ మాట్లాడుతూ
మామిడికాయలు, కిలోకు 19 రూపాయలు ఇస్తామని చెప్పి , ఫ్యాక్టరీ యాజమాన్యాలు సిండికేట్ అయిపోయి పది రూపాయల నుంచి పన్నెండు రూపాయలు ఇస్తూ రైతులను మనోవేదనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతు సోదరులు కలెక్టర్ కు ఈ విషయమై గత వారం రోజులుగా ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.
రైతు నాయకుడు కొత్తూరు బాబు మాట్లాడుతూ ఒక్కొక్క రైతు 4- 5 సార్లు కొట్టడం జరిగిందన్నారు. మంగు, మచ్చలు కారణంగా ఫ్యాక్టరీలు ఆ కాయలను తీసుకోడం లేదన్నారు. ట్రాక్టర్ ఫ్యాక్టరీకి పోతే కాయం దించుకోవడానికి 2- 3 రోజులు పడుతుందని వివరించారు. ఫ్యాక్టరీలు ఇస్తున్న ధర కాయలు కోయడానికి, ట్రాక్టర్ కూలికి చాలడం లేదన్నారు. గిట్టుబాటు ధర ఇవ్వకపోతే ప్రభుత్వమైనా ధరల స్థిరీకరణ నిధి నుండి మిగిలిన పైకాన్ని రాయితీగా చెల్లించి, రైతులను ఆదుకోవాలని కిసాన్ మోర్చా నాయకులు కొత్తూరు బాబు హరిబాబు చౌదరి కోరారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణగిరి, శ్రీనివాసపురం కాయలు వల్లా జిల్లాకు చెందిన కాయలు ఎక్కువ తీసుకోవడం లేదన్నారు. రెండురోజుల్లో ఫ్యాక్టరీ యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి, రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, సీనియర్ నాయకులు దుర్గ రామకృష్ణ, కిసాన్ మోర్చా నాయకులు కొత్తూరు బాబు, హరిబాబు చౌదరి, బిజెపి నాయకులు జయ కుమార్, రామభద్ర, సురేష్ కుమార్, సోమనాథ్ గౌడ్, ఏలుమలై, కుమార్ బాబు, రవీంద్రారెడ్డి, పాండియన్ ఇతర రైతు నాయకులు పాల్గొన్నారు.