23న నూతన రాజకీయ పార్టీ: బోడె రామచంద్ర యాదవ్
23న నూతన రాజకీయ పార్టీ: బోడె రామచంద్ర యాదవ్
అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జూలై 23న నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా నిర్వహించే బహిరంగ సభలో పార్టీ ఆవిర్భావం జరుతుందని పుంగనూరుకు చెందిన బీసీ నేత బోడె రామచంద్ర యాదవ్ ప్రకటించారు. బోడె రామచంద్ర యాదవ్ జన్మదినం సందర్భంగా ఆదివారం విజయవాడలో నూతన పార్టీ సన్నాహక సమావేశం జరిగింది. వచ్చే నెల 23న నిర్వహించే ప్రజా సింహగర్జన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ.. దశాబ్దాల రాజకీయ గ్రహణాన్ని వదిలించి, నవ శకాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో విసిగిపోయిన వారందరూ కొత్త పార్టీ ఆవిర్భావానికి కలిసిరావాలని కోరారు. వైసీపీ, టీడీపీల నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగిస్తేనే అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు.
ఆయన మాట్లాడుతూ.... కొత్త చరిత్రకు నాంది పలుకుదాం.. వైసీపీ, టీడీపీలను భూస్థాపితం చేస్తాం. రాష్ట్రానికి రాజకీయ గ్రహణం ఎవరు అధికారంలో వున్నా ఏదో ఒక వర్గం వెనుకబాటుకు గురవుతూనే ఉంటుంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలో వున్నా అన్ని వర్గాలకూ అన్యాయమే జరిగింది. ఇందుకు ఏ పార్టీ, ఏ ప్రభుత్వం అతీతం కాదు.. గత దశాబ్ద కాలాన్ని పరిశీలిస్తే రాష్ట్రంలోని రైతుల పరిస్థితి దారుణంగా వుంది. వ్యవసాయాన్ని వదిలి వలసలు వెళ్లే పరిస్థితి నెలకొంది. వ్యవసాయం పేరు చెప్పి అధికారంలో ఉన్నవాళ్లు దోపిడీ చేస్తున్నారు. రైతులకు ఎవ్వరూ మేలు చేసిన దాఖాల్లేవు. నైపుణ్యం కలిగిన ఆంద్ర యువత ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభ చూపిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం ఉపాధి లేక అల్లాడే పరిస్థితి నెలకొంది.
ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. పారిశ్రామిక ప్రగతి కొరవడటం, పరిశ్రమలు మూతబడటంతో కార్మికులు రోడ్డున పడ్డారు. రాష్ట్రాభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించే ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటూ పూర్తిగా అణచివేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన ఇన్నేళ్ళలో ఏ ఒక్క వర్గం అభివృద్ధికి నోచుకోలేదు. దోపిడీదారులైన రాజకీయ నేతల సామజిక వర్గాల వారే అభివృద్ధి సాధించారనే వాదన ఉన్నప్పటికీ, అధికారంలో వున్న నేతల అనుయాయులే లబ్ధిపొందుతున్నారు.
అధికారంలో వున్న వాళ్లు, వాళ్ల కుటుంబసభ్యులు రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాన్ని ముక్కలు చేసి కనుమరుగైపోయింది. ఆత్మగౌరవం అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు.. కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే లాభపడ్డాయి. రాష్ట్ర చరిత్రలో రెండు దురదృష్టకర ఘటన.. వైసీపీ ఆవిర్భావం. ప్రతి పార్టీకి ఓ సిద్ధాంతం.. ఆశయం ఉంటుంది.. ఫ్యాక్షన్ రాజకీయాల కోసం ఉన్న ఏకైక పార్టీ వైసీపీ. ఫ్యాక్షన్ నాయకుడైన వైసీపీ అధినేతను రాష్ట్రంలో అధికారంలోకి తేవడం దురదృష్టకరం. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నారు. లక్షలాది ఎకరాల భూములు కొన్ని కుటుంబాల చేతిలో దోపీడీకి గురయ్యాయి. మైనింగ్, ఇసుక, ఇరిగేషన్ ప్రాజెక్టులు.. ఇలా ప్రతి రంగంలోనూ వేలాది కోట్లు దోచుకుంటున్నారు.
రాష్ట్రంలో పరిస్థితులు మారాలంటే, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే.. కావాల్సింది రాజకీయ మార్పు. నూటికి 70 శాతం మంది రాజకీయ మార్పును కోరుకుంటున్నారు. దోపిడీ పార్టీలను భూస్థాపితం చేసి, దోపిడీ నాయకులను ఇంటికి పంపిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర ప్రజలు ప్రజా రాజకీయాల వైవు నడవాల్సిన ఆవశ్యకత ఉంది. మెజారిటీ ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబిస్తూ కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తోంది. రైతుల సంక్షేమం కోసం, యువత అభ్యున్నతి కోసం, మహిళల సంపూర్ణ రక్షణ కోసం ఈ పార్టీ ఆవిర్భవిస్తోందని రామచంద్ర యాదవ్ వివరించారు.