15, జూన్ 2023, గురువారం

పుంగనూరు TDP అభ్యర్థిగా అమరనాధ రెడ్డి ?

పుంగనూరు TDP అభ్యర్థిగా అమరనాధ రెడ్డి ?

* రామచంద్రా రెడ్డికి చెక్ పెట్టడానికి TDP వ్యూహం

* ప్రతిపాదనను తిరస్కరించని అమరనాధ రెడ్డి 

* ఓడినా, గెలిచినా మంత్రి పదవి హామీ

* కుటుంబ సభ్యులకు పలమనేరు టిక్కెట్టు

* 18న రామచంద్ర యాదవ్ కొత్త పార్టీ ప్రకటన    

   



                        ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎదురు లేని నాయకునిగా చక్రం తిప్పుతున్న మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి ఎలాగైనా చెక్ పెట్టాలని తెలుగు దేశం పార్టీ వ్యూహరచనలో ఉంది. రామచంద్రా రెడ్డిని ఈ సారి నియోజక వర్గానికే పరిమితం చేసి, పుంగనూరు కోట మీద TDP జండా ఎగురవేయాలని  కృతనిశ్చయంతో తెదేపా ఉంది. ఇందుకు దీటైన అభ్యర్థి అన్వేషణలో, పలమనేరు MLA నూతనకాల్వ అమరనాథరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ ప్రతిపాదనను అమరనాధ రెడ్డి సైతం వ్యతిరేకించడం లేదని తెలుస్తోంది. పార్టీ నిర్ణయమే తన నిర్ణయమని సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోంది. అయితే పలమనేరు సీటును తమ కుటుంబ సభ్యులలో ఒకరికి ఇవ్వాలని కోరినట్లు సమాచారం. పుంగనురులో ఓడినా, గెలిచినా మంత్రి పదవి ఇవ్వాలని షరతు పెట్టినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదివరకు TDPలో ఉండి, వేరే పార్టీలోకి వెళ్ళిన వారిని కూడా తిరిగి TDP గూటికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో వైపు పుంగనూరు కేంద్రంగా ఈ నెల 18న BC ల కోసం కొత్త రాజకీయ పార్టీ బోడె రామచంద్రా యాదవ్ ఆధ్యర్యంలో అవిర్భావించనుంది. కొత్త రాజకీయ సమీకరణలతో  పుంగనూరు రాజకీయం ఆశక్తికరంగా మారింది. 

                                   సారి మాజీ సిఎం నారా చంద్రబాబు నాయుడును కుప్పంలో ఓడిస్తానని మంత్రి రామచంద్రా రెడ్డి సవాలు విసురుతున్నారు. 2019 ఎన్నికల్లో కుప్పం మినహా మిగిలిన 13 స్థానాలలో వైసిపి అభ్యర్ధులు గెలవడంలో పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించారు. గత స్తానిక  సంస్థల ఎన్నికలు,  ఎంపిపి, జెడ్పీటీసీలతో పాటు  కుప్పం మునిసిపాలిటీని వైసిపి ఖాతాలో వేసుకున్నారు. చంద్రబాబును దెబ్బతీయడానికి అనువుగా వన్నె రెడ్డి వర్గానికి చెందిన భరత్ కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అలాగే ఇటీవల అదే వర్గానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి  డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యంను వైసీపీలోకి తీసుకుని ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. జిల్లాలో చక్రం తిప్పుతున్న రామచంద్ర రెడ్డికి చెక్ పెట్టాలని టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రామచంద్రా రెడ్డికి దీటైన అభ్యర్థి ఎంపిక కోసం పలు సర్వేలను నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం తీసుకున్నారు. పార్టీ పరిశీలకులు, రాబిన్ శర్మ కూడా మొదటి ఆప్షన్ కింద అమర్నాథ రెడ్డి పేరును చూచించినట్లు తెలిసింది. 


                   పెద్దపంజాణి  మండలం కెలవాతి గ్రామానికి చెందిన అమర్నాథరెడ్డి డబుల్ హ్యాట్రిక్ వీరుడు, ఓటమి ఎరుగని ధీరుడు నూతన కాలువ రామకృష్ణారెడ్డి (Nuthanakalva Ramakrishna Reddy) తనయుడు. నూతన కాలువ రామకృష్ణారెడ్డి 1985 నుంచి వరుసగా మూడు పర్యాయాలు పుంగనూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996 లో రామకృష్ణారెడ్డి చిత్తూరు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావడంతో అమర్నాథ్ రెడ్డి ఎన్నికల్లో పుంగనూరు నుండి టిడిపి అభ్యర్థిగా  గెలుపొందారు. ఇలా అమర్నాథ్ రెడ్డి ఉహించని విధంగా ఉప ఎన్నికతో MLAగా ఎన్నికయ్యారు. ఆనాటి నుండి ఈ నాటి వరకు జిల్లా రాష్ట్ర స్తాయిలో తిరుగులేని ప్రజా నాయకుడిగా రాణిస్తున్నారు. రెండు సంవత్సరాలు పార్టీని వీడినా తిరిగి పార్టీలో చేరి మంత్రి స్తాయికి ఎదిగారు. 


          అమర్నాథ్ రెడ్డి 1985 నుండి  తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతున్నారు. 1985లో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం రెండు పర్యాయాలు మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1986లో అమర్నాథరెడ్డి గ్రామ సర్పంచిగా ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు సర్పంచ్ గా పనిచేసిన మర్నాథరెడ్డి మరో రెండు పర్యాయాలు పెద్దపంజాణి మండల తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. 1995లో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. 1996 లో జరిగిన పుంగనూరు ఉప ఎన్నికలలో టిడిపి తరఫున శాసనసభ్యుడిగా గెలుపొందారు. 1999లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి చేతిలో  ఓటమిపాలైనా,  2004లో తిరిగి పుంగనూరు నియోజకవర్గం నుండి TDP MLAగా విజయం సాధించారు.

                  2000 నుండి 2007 వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. 2007 నుంచి 2012 వరకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తరువాత 2009లో పలమనేరు నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా సాధించారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా రెడ్డప్ప రెడ్డి పోటీ చేసి పరాజితులయ్యారు. 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అమర్నాథరెడ్డి 2014 ఎన్నికలలో పలమనేరు నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుభాష్ చంద్రబోస్ మీద విజయం సాధించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినా, ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీలో ఇమడలేక తిరిగి 2016లో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా చంద్రబాబు మంత్రివర్గంలో కొనసాగారు. 2019 ఎన్నికలలో వీచిన YCP గాలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటే గౌడ చేతిలో అమర్నాథ్ రెడ్డి ఓడిపోయారు. ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, రాయలసీమ జోనల్ ఇన్ ఛార్జ్ గా, నారా లోకేష్ యువగళం సమన్వయ కర్తగా పార్టీలో కీలక భూమికను పోషిస్తున్నారు. 


             

                   తొలుత   రొంపిచర్లకు చెందిన చల్లా  రామచంద్రా రెడ్డిని TDP అభ్యర్థిగా రంగంలోకి దించాలని భావించారు. ఆయనను నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా నియమించారు. చల్లా  రామచంద్రా రెడ్డి 1989 లో పీలేరులో TDP అభ్యర్థిగా పోటి చేసి, పెద్దిరెడ్డి చేతిలో ఓడిపోయారు. అయన తండ్రి  1985 చల్లా ప్రభాకర్ రెడ్డి పీలేరు నుండి TDP అభ్యర్థిగా పోటీ చేసి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని ఓడించారు. తాత CK నారాయణ రెడ్డి కూడా పీలేరు MLAగా పనిచేశారు. మరో తాత TTD పేష్కర్  గా పనిచేశారు. చల్లా  రామచంద్రా రెడ్డి కూడా TTD పాలకమండలి సభ్యుడిగా పనిచేశారు. కుటుంబ సభ్యులు, ఆయన  రొంపిచెర్ల MPP, Z P T C గా పనిశారు. రాజకీయ నేపధ్యం ఉన్న చల్లా  రామచంద్రా రెడ్డిని ఈ పర్యాయం TDP  పుంగనూరులో పోటికి దించాలని భావించినా, పెద్ది రెడ్డి ముందు గెలవడం కష్టమని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 


         పుంగనూరుకు చెందిన బొడే రామచంద్ర యాదవ్ పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. 2019  ఎన్నికల్లో జనసేన అభ్యర్ధిగా పోటి చేసిన బొడే రామచంద్ర యాదవ్ కు 16,452 ఓట్లు వచ్చాయి. తర్వాత BJPకి దగ్గర అయ్యారు. రామచంద్రా రెడ్డికి చెందిన శివశక్తి డైయిరీలో అవకతవకలు జరుతున్నాయని, రైతులను సమీకరించి అందోళనకు సిద్దం అవుతుండగా యాదవ్ మీద, ఇంటి మీద పెద్దిరెడ్డి అనుచరులు దాడి  చేశారు. దీంతో యాదవ్ డిల్లీ వెళ్లి కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ను కలిచారు. ప్రభుత్వం యాదవ్ కు Y+ కేటగిరీ రక్షణ కల్పించింది. ఈ నేపథ్యంలో బోడే రామచంద్ర యాదవ్ కు టిడిపి టిక్కెట్టు ఇస్తే మంచిదనే ప్రచారం ఊపందుకుంది. అయితే అయన ఈ నెల 18న BC ల కోసం ప్రత్యేక పార్టీ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. 



              అయితే పెద్దిరెడ్డి చరిత్ర, నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను విశ్లేషిస్తే  పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని ఎదుర్కోవడం అంత సులభం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నియోజక వర్గాల పునర్విభజన తరువాత జరిగిన మూడు ఎన్నికల్లో పెద్దిరెడ్డి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఆయన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టిడిపి అభ్యర్థి ఎం వెంకట్రామ రాజు పై 31,737 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో పీఆర్పీ అభర్థి ఖాదర్ బాషాకు 25,891 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో కూడా పెద్దిరెడ్డి వైసిపి అభ్యర్ధిగా పోటీ చేసి వెంకట్రామరాజుపై 31,731 ఓట్ల మెజారిటీ సాధించారు. 2019 ఎన్నికల్లో పెద్దిరెడ్డి వైసిపి టిక్కెట్ పై పోటీ చేసి టిడిపి అభ్యర్ధి ఎన్ అనీషా రెడ్డిపై 42,710 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో జనసేన అభ్యర్ధి బొడే రామచంద్ర యాదవ్ కు 16,452 ఓట్లు వచ్చాయి. పెద్దిరెడ్డి గతంలో మూడు సార్లు పీలేరు ఎమ్మెల్యేగా ఉన్నారు. వై ఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. ఇప్పుడు  జగన్ మంత్రి వర్గంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. తన కుమారుడు మిథున్ రెడ్డి, రాజంపేట ఎంపిగా, తమ్ముడు ద్వారకనాధ రెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా ఉన్నారు. 


                       పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆరు సార్లు MLA గా గెలుపొందారు. 1999 నుండి వరుసగా అయిదు సార్లు MLAగా ఎన్నికై రికార్డు సృష్టించారు. పీలేరు నుండి మూడు సార్లు, పుంగనూరు నుండి మరో మూడు సార్లు MLAగా ఎన్నికయ్యారు. 1974 లో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడే విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా, 1985, 1994 లో కాంగ్రెస్ అభ్యర్థిగా పీలేరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 1989, 1999, 2004 లో పీలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008లో పీసీసీ ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యారు. 2009 లో పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే సంవత్సరంలో YS  రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి  రోశయ్య మంత్రివర్గంలో అడవులు, పర్యావరణ శాఖ, సాంకేతిక శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన 2013లో కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి YSR కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 , 2019లో YSR కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.  ఆయన 2019లో YS జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల, భూగర్భ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గ్రామ సచివాలయ, వాలంటీర్ల శాఖ భాద్యతలను 21 సెప్టెంబర్ 2020న ప్రభుత్వం అప్పగించింది.


                           వీటిని అన్నింటిని పార్టీ నాయకులు బేరీజు వేశారు. పుంగనురులో గెలువాలి అంటే అమరనాథ రెడ్డి పోటి చేస్తేనే సాధ్యం అవుతుందని ఒక నిర్ణయానికి  వచ్చినట్లు తెలుస్తుంది. అమరనాధ రెడ్డికి చౌడేపల్లి, పుంగనూరు మునిసిపాలిటి, మండలంలో మంచి పట్టు ఉంది. అయన అక్కడినుండే రాజకీయం ప్రారంభించారు. పుంగనూరు ఎన్నికలను ఈ మండలాలు ప్రభావితం చేస్తాయి. అమరనాధ రెడ్డి అందరికి సుపరిచితం. అమరనాధ రెడ్డి సతీమణి రేణుకా రెడ్డి చౌడేపల్లి మండలం పుదిపట్లకు చెందిన వారు. ఆమె తండ్రి చౌడేపల్లి సమితి అధ్యక్షులుగా పనిచేశారు. వీరి ఏకైక కుమారుడు ప్రసేన్ రెడ్డి విదేశాలలో ఉన్నత విద్యను అభ్యశించి అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. అమరనాధ రెడ్డి పుంగనూరు నుండి పోటి చేస్తే, పలమనేరు టిక్కెట్టును మరదలు అనీషా రెడ్డి అడిగే అవకాశం ఉంది. లేక భార్య రేణుకా రెడ్డి,  కుమారుడు ప్రసేన్ రెడ్డిలకు ఆశక్తి ఉంటే,  పోటి చేయవచ్చు. అనిషా రెడ్డి గతంలో పుంగనూరు నుండి రామచంద్రా రెడ్డి మీద పోటి చేసి ఓడిపోయారు. గతంలో పలమనేరు అభ్యర్థిగా పోటి చేసిన సుభాష్ చంద్ర బోస్ కూడా పలమనేరు టిక్కెట్టును ఆశిస్తున్నారు. అమర్నాథ రెడ్డి పుంగనూరు నుండి పోటీ చేస్తే పలమనేరు, పుంగనూరు రెండు అసెంబ్లీలను గెలువవచ్చని TDP భావిస్తోంది. 



నేనైతే తప్పక గెలుస్తా: అమరనాధ రెడ్డి 

                       పుంగనూరు నుండి పోటి చేయు విషయాన్ని అమరనాధ రెడ్డితో "చిత్తూరు న్యూస్" ప్రస్తావించింది. ఈ సందర్భంగా అమరనాధ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం పలమనేరులో సేఫ్ జోన్ లో ఉన్నాను. పుంగనూరు నుండి పోటి చేసే ఆలోచన ప్రస్తుతానికి లేదు. పార్టీ నిర్ణయమే నా నిర్ణయం. పార్టీ అధినేత నారా చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎక్కడి నుండి పోటిచేయమన్నా, పోటి చేస్తా. పుంగనురులో ప్రస్తుత పరిస్తితిలో నేను అయితేనే గెలుస్తా. వేరే ఎవరు అయినా కష్టమే. నియోజక వర్గంలో ప్రతి ఇల్లు తెలుసు. రాజకీయం ప్రారంభం అయ్యిందే అక్కడి నుండి. నాన్న, నేను MLA లుగా రాజకీయం ప్రారంభించాం. చౌడేపల్లి, పుంగనూరు మండలం, మునిసిపాలిటిలు నియోజక వర్గ గెలుపు, ఓటములను నిర్ణయిస్తాయి. చౌడేపల్లి మండలం పుదిపట్ల అత్తగారిల్లు. పుంగనూరు ముస్లింలు సపోర్ట్ చేస్తారు. పార్టీ వీడిన వెంకటరమణ రాజు, చౌడేపల్లి సర్పంచ్ కూడా తిరిగి పార్టీలోకి వస్తారు. అందరు సమైక్యంగా పనిచేసి పుంగనురులో గెలుస్తాం. ఈ సారి పుంగనురులో గెలువకుంటే, మల్లీ గెలువలేమని అమరనాధ రెడ్డి వివరించారు.



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *