19, జూన్ 2023, సోమవారం

ఆ మూడు నియోజక వర్గాలలో వరస ఓటములు ఎందుకు?

* నియోజక వర్గాలలో బలహీనమైన నాయకత్వం 

* బలమైన నాయకులు పార్టీలోకి రాకుండా అడ్డు 

* నియోజకవర్గంలో సమన్వయ లేమి

* మండల పార్టీ అధ్యక్షులే రారాజులు

* అభ్యర్థి ఓడినా, గెలిచినా వారి కనుసన్నల్లో ఉండాలి
 


                         చిత్తూరు, చిత్తూరుకు సరిహద్దుగా ఉన్న గంగాధర నెల్లూరు, పూతలపట్టు, చంద్రగిరి నియోజక వర్గాలలో తెలుగు దేశం పార్టీ వరుస పరాజయాలను చవి చూస్తోంది. 
గంగాధర నెల్లూరు, పూతలపట్టు, చంద్రగిరి నియోజక వర్గాలలో ఓటమిలో హట్రిక్ కొట్టారు. YCP పార్టీ ఆవిర్భవించిన తరువాత గంగాధర నెల్లూరు, పూతలపట్టు, చంద్రగిరి నియోజక వర్గాల్లో TDP ఒక్క సారి కూడా గెలువలేదు.  చిత్తూరు నియోజక వర్గంలో 2014 ఎన్నికలలో TDP అభ్యర్ధి సత్యప్రభ గెలుపొందారు. మిగిలిన రెండు ఎన్నికలలో TDPకి పరాజయం తప్పలేదు. ఈ నాలుగు నియోజక వర్గాల్లో బలమైన కమ్మ నేతలు ఉన్నారు. అయితే TDP మాత్రం గెలువడం లేదు. నియోజక వర్గంలోని కమ్మ నాయకులూ వారి వారి మండలాలకే పరిమితం అవుతున్నారు. నియోజక వర్గం మొత్తం  ప్రభావితం చేసే నాయకుడు లేదు. మండల నాయకుల మధ్య సమన్వయము లేదు. ఎవరి మండలాలకు వారే రారాజులు. ఎవరు అభ్యర్థి అయినా, వారి కనుసన్నల్లో పనిచేయాలి. లేకుంటే అవినీతి, పార్టీ వ్యతిరేక ముద్ర వేస్తున్నారు. నియోజక వర్గంలోని మండల నాయకులను సమన్వయము చేసే నాయకుడు ఈ నియిజక వర్గాలలో కనిపించడం లేదు. ఫలితంగా ఎన్నికలలో TDP వరుసగా పరాజయం పాలవుతోంది. నియోజక వర్గంలోని రెడ్డి నాయకులను కమ్మ నాయకులూ ధీటుగా ఎదుర్కొనలేక పోతున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు పార్టీలోకి రాకుండా, తమ అధిపత్యానికి గండిపడకుండా, ప్రస్తుత నాయకులు జాగర్తలు తీసుకుంటున్నారు.

                                               ఈ నేపధ్యంలో  చిత్తూరు పార్ల మెంట్ నియోజక వర్గం పరిధిలోని చంద్రగిరి, జి డి నెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు నియోజక వర్గాలలో గెలుపు సాధనపై చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఈ మూడు నియోజక వర్గాలలో 2009 నుంచి టిడిపి అభ్యర్ధులు వరుసగా ఓడిపోయి హ్యాట్రిక్ సాధించారు. చంద్రగిరి నియోజక వర్గంలో నాలుగు సార్లు కాంగ్రెస్ టిక్కెట్టుపై పోటీ చేసి ఎమ్మెల్యే అయిన మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి 2014 లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయారు. 2019 ఎన్నికల్లో పులివర్తి నాని టిడిపి అభర్ధిగా పోటీ చేసి ఓడి పోయారు. ప్రస్తుతం ఆయన ఇంచార్జిగా ఉన్నారు. అయితే అక్కడ రెడ్డి సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నందు వల్లే టిడిపి ఓడి పోతున్నారని రాబిన్ శర్మ బృందం నివేదిక సమర్పించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అక్కడ బలమైన రెడ్డి అభ్యర్థిని రంగంలోకి దింపాలని సూచిస్తున్నారు. 


                              ఇక ఎస్సీలకు కేటాయించిన జి డి నెల్లూరులో రెడ్డి సామాజిక వర్గానికి తిరుగులేని బలం ఉంది. పూతలపట్టు నియోజక వర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెప్పుకోతగ్గ బలం ఉన్నప్పటికీ రెడ్ల ప్రాబల్యాన్ని తట్టుకో లేక టిడిపికి ఓటమి తప్పడం లేదు. వేపంజెరి ఎమ్మెల్యేగా ఐదు సార్లు గెలిచిన మాజీ మంత్రి  డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మ 2014 లో జి డి నెల్లూరులో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూసారు. 2019 ఎన్నికల్లో ఆమె కుమారుడు డాక్టర్ హరికృష్ణ టిడిపి టిక్కెట్టుపై పోటీ చేసి ఘోర పరాజయం మూట గట్టుకున్నారు. 

                   2004 లో టిడిపి టిక్కెట్టుపై పలమనేరు ఎమ్మెల్యేగా గెలిచిన లలిత కుమారి 2009 నుంచి వరుసగా మూడుసార్లు పూతలపట్టు నియోజక వర్గంలో ఓడి పోయారు. రెడ్డి నేతలను నిలువరించే సమర్థులు కమ్మ సామాజిక వర్గంలో లేక పోవడం వల్లనే టిడిపి అభ్యర్ధులు ఓడి పోతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. ఆమెకు  కమ్మ నేతల నుండి ఎదురైన అవమానాలు, తిరస్కారాల కారణంగా పార్టీకి రాజీనామా చేశారు. తిరిగి పార్టీలోకి రావడానికి కూడా ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో చిత్తూరు టిడిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సి కె బాబుకు అవకాశం కల్పిస్తే అటు జి డి నెల్లూరు, ఇటు పూతలపట్టు నియోజక వర్గాలలో గెలుపు సాధించ వచ్చని దళిత నేతలు కొందరు చెప్పారు. అయితే  కొందరు నేతలు ఈ ప్రతిపాదనకు అడ్డుపడటంతో, చంద్రబాబు  ఒక నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. 

                          జి డి నెల్లూరు నియోజక వర్గంలో పార్టీ ఏర్పడి నప్పటి నుంచి పార్టీకి కష్ట పడుతున్న వారిని కాదని  మద్రాసులో ఆసుపత్రి పెట్టుకుని వ్యాపారం చేస్తున్న డాక్టర్ ( వైద్యుడు కాదు) థామస్ ను ఇటీవల ఇంచార్జిగా నియమించారు. దీనితో పలువురు దళిత  అసమ్మతితో రగిలి పోతున్నట్టు తెలిసింది తెలిసింది. అలాగే పూతలపట్టు నియోజక వర్గంలో కష్ట కాలంలో వైకాపాతో పోరాడిన వారిని కాదని తిరుపతిలో జర్నలిస్టుగా ఉన్న డాక్టర్ మురళీ మోహన్ ను టిడిపి ఇంచార్జిగా నియమించడం వల్ల అసమ్మతి చోటు చేసుకున్నది. ఈ నేపథ్యంలో రెండు నియోజక వర్గాలలో గెలుపు భాద్యత బలమైన రెడ్డి నేతలకు బాధ్యతలు అప్పగించాలని రాబిన్ శర్మ బృందం నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. అలాగే చిత్తూరు, చంద్రగిరి నియోజక వర్గాల్లో బలమైన రెడ్డి అభ్యర్థులను రంగంలోకి దించడం ద్వారా ఈ సారి అయినా గెలువవచ్చని భావిస్తున్నారు. ఈ నాలుగు నియోజక వర్గాలలో ప్రక్షాళన చేయకుంటే, పరాజయమే మరోసారి పలుకరిస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నెమ్మదిగా నిర్ణయాలు తీసుకునే చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *