జి డి నెల్లూరు టిడిపిలో ముదిరిన వర్గపోరు
జి డి నెల్లూరు టిడిపిలో ముదిరిన వర్గపోరు
ఇన్ ఛార్జ్ నియామకంతో నేతల్లో అసంతృప్తి
పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్దం
గంగాధర నెల్లూరు నియోజక వర్గం టిడిపిలో వర్గ పోరు తీవ్ర రూపం దాల్చింది. డాక్టర్ థామస్ ను ఇంచార్జిగా నియమించిన తరువాత మరింత ముదిరింది. సమన్వయ కర్త భీమినేని చిట్టిబాబు నాయుడును తిరిగి పదవిలో కొనసాగించాలని ఆయన వర్గం పావులు కదుపుతున్నారు. ఇంచార్జిని నియమించిన తరువాత సమన్వయ కర్త అవసరం లేదని ఆరు మండలాల అద్యక్షులు అడ్డు పడుతున్నారు. పైగా ఎస్సీలకు కేటాయించిన నియోజక వర్గంలో కమ్మ సామాజిక వర్గ నేత పెత్తనం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. అధిష్టానం మొండిగా వ్యవహరిస్తే, పార్టీనే తమకు అవసరం లేదని అంటున్నారు.
చిట్టిబాబు వ్యతిరేక వర్గానికి టి ఎన్ టి యు సి రాష్ట్ర కార్యదర్శి లోకనాధ నాయుడు, మండల అధ్యక్షులు రుద్రయ్య నాయుడు, జయశంకర్ నాయుడు, రాజేంద్ర, చెంగలరాయ యాదవ్, స్వామి దాస్, లోకనాధ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మండల అధ్యక్షులు అందరినీ తొలగించి కొత్త వారిని నియమించాలని ఇంచార్జి థామస్ తో కలసి చిట్టిబాబు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఎస్ అర్ పురంలో జరిగే విస్తృత స్థాయి సమావేశంలో రెండు వర్గాలు మోహరించే అవకాశం ఉందని అంటున్నారు. చిట్టిబాబు వర్గం జనసమీకరణ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా చిట్టిబాబును సమన్వయ కర్తగా నియమించడం చంద్రబాబు చేసిన మొదటి తప్పని సీనియర్ కార్యకర్తలు కొందరు అంటున్నారు. ఆయన వల్లనే గత ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్ హరికృష్ణ, ఆయన తల్లి మాజీ మంత్రి డాక్టర్ కుతూహలమ్మ పార్టీకి దూరమయ్యారు. రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి నియోజక వర్గానికి రావడం మానుకున్నారు. కాగా తొలి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న స్తానిక నాయకులను కాదని చెన్నైలో ఉన్న థామస్ ను ఇంచార్జిగా నియమించడం చంద్రబాబు చేసిన రెండవ తప్పు అంటున్నారు.
ఆరుగురు మండల కమిటీల అధ్యక్షులు వ్యతిరేకించినా చంద్రబాబు పట్టించుకో లేదని సమాచారం. పైగా నియోజక పరిశీలకుడు మబ్బు దేవ నారాయణ రెడ్డి, నియోజక వర్గానికి చెందిన అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డిని మాట మాత్రంగా కూడా సంప్రదించ లేదని తెలిసింది. వరుసగా పార్టీ అభ్యర్ధులు ఓడి పోతున్న నియోజక వర్గంలో ఇలాంటి పోరు వల్ల పార్టీ మరింత దిగజారి పోతుందని కార్యకర్తలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్దం అవుతున్నారు.