24, జూన్ 2023, శనివారం

సీమ రెడ్డి నేతలకై పవన్ కళ్యాణ్ అన్వేషణ

* కుల ముద్ర నుండి దూరం కావడానికి యత్నాలు

* అన్ని వర్గాలకు సమ ప్రాతినిధ్యం 

* జనసేనలోకి వచ్చే రెడ్ల కోసం సర్వే

* రాష్ట్రంలో రెడ్లకు పది స్థానాలు


         ముఖ్య మంత్రి కావాలన్న తన లక్ష్య సాధన కోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని  సామాజిక వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్నారని తెలిసింది. జనసేన అంటే ఒక కులానికి చెందిన పార్టీ అనే ముద్ర ఉంది. రాయలసీమ జిల్లాల్లో బలిజ కుల నాయకులు ఎక్కువ జనసేనలో ఉన్నారు. రానున్న ఎన్నికలలో వారే టిక్కెట్లు ఆశిస్తున్నారు. కుల ముద్రను దూరం చేస్తూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, బిసి, మైనారిటీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని భావిస్తున్నారు. అలాగే జనసేనకు సీమ పౌరుశాన్ని జత చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. సీమ పౌరుశానికి ప్రతీకలు రెడ్లు. కావున
 సేన అధినేత  పవన్ కళ్యాణ్ రాయల సీమ రెడ్డి సామాజిక వర్గం నేతలపై దృష్టి సారించినట్లు  విశ్వసనీయంగా తెలిసింది.

           ఉభయగోదావరి జిల్లాల్లో కాపులకు, ఉత్తరాంధ్రలో బిసిలకు, రాయల సీమలో రెడ్లకు పెద్దపీట వేయాలని ఆలోచిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ సార్లు రెడ్డి సామాజిక వర్గీయులు ముఖ్య మంత్రులుగా ఉన్నారు. అందులో  రాయలసీమ నుంచి నీలం సంజీవ రెడ్డి (అనంతపురం), కోట్ల విజయ భాస్కర్ రెడ్డి (కర్నూలు), డాక్టర్ వై ఎస్ రాజ శేఖర్ రెడ్డి (కడప ), నారా చంద్రబాబు నాయుడు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (చిత్తూరు ) సిఎంలుగా  పనిచేశారు. రాష్ట్రం విడిపోయిన తరువాత 2014లో నారా చంద్రబాబు నాయుడు ( చిత్తూరు) ముఖ్య మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ( కడప) 151 స్థానాలు గెలిచి ముఖ్య మంత్రిగా పనిచేస్తున్నారు. 

         ఈ నేపథ్యంలో భవిష్యత్తులో తాను ముఖ్య మంత్రి కావాలంటే రాయలసీమలో బలమైన పునాది వేసుకోవాలని చూస్తున్నారు. అక్కడ బలిజ సామాజిక వర్గీయులు ఉన్నప్పటికీ రాజకీయాలలో ప్రధాన పాత్ర పోషించలేకపోతున్నారు. కమ్మ సామాజిక  వర్గం వారు టిడిపిని కాదని జన సేనకు రారు. అయితే రెడ్లు అన్ని పార్టీలలో ఉంటారు. ఈ నేపథ్యంలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి దూరమయ్యే రెడ్డి  నేతలను ఆకర్షిస్తే మంచిదని పవన్ భావన. రెడ్లు టిడిపి కంటే జనసేన వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో టిడిపితో పొత్తు పెట్టు కున్నప్పటికి టిక్కెట్ల కేటాయింపులో రెడ్డి వర్గీయులకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. 

            ప్రస్తుత శాసన సభలో రెడ్డి వర్గానికి చెందిన 50 మంది ఎమ్మెల్యేల ఉన్నారు. వీరిలో 95 శాతం మంది రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన వారే. కాబట్టి జనసేనకు ఉమ్మడి జిల్లాకు మూడు సీట్లు ఇచ్చినా ఏడు జిల్లాలలో కనీసం 10 మంది రెడ్లకు టిక్కెట్లు ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలలోని కొందరు రెడ్డి నేతలను పార్టీలో చేర్చుకోవడానికి చూస్తున్నారని జనసేన నేత ఒకరు చెప్పారు. చిత్తూరు జిల్లాలో చిత్తూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే CK బాబు విషయమై పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. తిరుపతిలో YCP అభ్యర్థిని ఎలాగైనా ఓడించాలని జనసేన అధిష్టానం కృతనిశ్చయంతో ఉంది. కావున  తిరుపతికి చెందిన  ఇద్దరు టిడిపి రాష్ట్ర నాయకుల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. తిరుపతి, చిత్తూరు, జి డి నెల్లూరు పుంగనూరు, మదనపల్లి నియోజక వర్గాలలో కనీసం మూడు స్థానాలు జనసేనకు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డిపై మంచి పేరు ఉన్న రెడ్డిని పోటీ పెట్టాలని  పవన్ భావిస్తున్నట్టు తెలిసింది. తిరుపతిలో రెడ్డికి సీటు ఇస్తే చిత్తూరులో బలిజ కులానికి టిక్కెట్టు దక్కవచ్చు. తిరుపతి బలిజలకు ఇస్తే, చిత్తూరు రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది.

        అలాగే నెల్లూరుకు చెందిన నేదురుమల్లి జనార్ధనరెడ్డి,  గుంటూరుకు చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి కూడా ముఖ్య మంత్రులుగా పనిచేశారు. తెలంగాణాకు చెందిన మర్రి చెన్నారెడ్డి  సీఎం గా ఉన్నారు. కాగా ప్రకాశం జిల్లాకు చెందిన రోశయ్య ( వైశ్య) రెడ్డి సామాజిక వర్గం మద్దతుతో ఏడాది పాటు సీఎం గా ఉన్నారు. అంటే రెడ్ల పలుకు బడి ఉన్న ఏడు జిల్లాల నుంచి ముఖ్య మంత్రులు ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో రెడ్ల మద్దతు అవసరమని పవన్ గుర్తించారని తెలుస్తోంది. కుల ముద్రను చెరిపేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు అనుగుణంగా జనసేనలోకి వచ్చే రెడ్డి నాయకులపై సర్వే జరుపుతున్నట్లు సమాచారం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *