టిడిపి టిక్కెట్ల కేటాయింపులో కమ్మ వారికే పెద్దపీట ?
* ఉమ్మడి జిల్లాలో ఆరు వారికే
* రెడ్లకు తగ్గుతున్న ప్రాధాన్యత
* లోలోన రగులుతున్న రెడ్లు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తమ సామాజిక వర్గానికి పెద్ద పీట వేయడానికి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. 2024 ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం అభ్యర్థులకు ఎక్కువ స్థానాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. జిల్లాలో ఉన్న 14 స్థానాలలో కనీసం ఆరు స్థానాలు ఇస్తారని అంటున్నారు. ఈ సారి పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నందు వల్ల తమ వారిని ఎక్కువగా గెలిపించుకోవాలని భావిస్తున్నారని ఒక నాయకుడు చెప్పారు. ఆ మేరకు తగిన అభ్యర్ధుల కోసం సర్వేలు కూడా చేయిస్తున్నారని అంటున్నారు.
2024 ఎన్నికల్లో తనతో పాటు చంద్రగిరిలో పులివర్తి నాని, నగరిలో గాలి భాను ప్రకాష్, మదనపల్లిలో దొమ్మలపాటి రమేష్ పోటీ చేశారు. అలాగే రెడ్డి సామాజిక వర్గానికి నాలుగు స్థానాలు, బలిజ వర్గానికి రెండు, బిసి సామాజిక వర్గానికి ఒక స్థానం కేటాయించారు. మూడు రిజర్వుడు స్థానాలలో ఎలాగూ వారికే సీట్లు ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. అయితే కుప్పంలో తాను మినహా అన్ని స్థానాలలో ఓటమి పాలయ్యారు. జగన్ తమ సామాజిక వర్గానికి చెందిన ఏడు మంది రెడ్లను పోటీ పెట్టి పెట్టారు. అలాగే బిసి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి, బలిజ, మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఒక్కొక్కరికి టిక్కెట్లు ఇచ్చారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురిని పోటీ పెట్టారు. వీరిలో కుప్పం మినహా అన్ని స్థానాల్లో పోటీ చేసిన వైసిపి అభ్యర్ధులు విజయం సాధించారు. అప్పుడు వైసిపి గాలి ఉన్నందున రెడ్లు ఏడుగురు గెలిచారు.
ఈ సారి TDP గాలి వీస్తున్నందున తమ సామాజిక వర్గానికి చెందిన వారికి అధిక స్థానాలు కేటాయించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి నుంచి ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డిని కాదని మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడుకు టిక్కెట్టు ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఆయన పార్టీలో చేరడానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ఎస్సీవీ నాయుడు చాపకింద నీరులా ప్రచారం ప్రారంభించారు. ఆయన జనసేన నియోజక వర్గం కన్వీనర్ వినుతను పరామర్శించారు. ఆమె భర్త చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించారు. అలాగే ఇప్పటికే సూళ్లూరుపేట, సత్యవేడు నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు.ఈ రోజు అమరావతిలో పార్టీలో చేరారు.
అలాగే చిత్తూరు నియోజక వర్గంలో తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టిక్కెట్టు ఇవ్వాలని చూస్తున్నరని అంటున్నారు. గుడిపాల మండలానికి చెందిన గురజాల జగన్మోహన్ నాయుడు ఇటీవల చిత్తూరులో రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ ఇల్లు కొనుక్కుని గృహ ప్రవేశం చేశారు. బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న GJM గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ జగన్మోహన్ కు చిత్తూరు టిక్కెట్టు అని టీడీపీ వర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా జిల్లాలో ఇతర పార్టీలలోని తమ వారిని పార్టీలో చేర్చుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఆయన కుప్పం వచ్చినపుడు మాజీ ఎమ్మెల్యే బి ఆర్ దొరస్వామి నాయుడు కుమారుడు, డిసిసి అధ్యక్షుడు డాక్టర్ సురేశ్ ను పార్టీలో చేర్చుకున్నారు. ఇతర నియోజక వర్గాలలో పార్టీకి దూరంగా ఉన్న పలువురు నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. నగరి నుండి గాలి భానుప్రకాష్, మదనపల్లి నుండి సాగర్ రెడ్డికి పార్టీ టిక్కెట్టు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.
కాగా జి డి నెల్లూరు, పూతలపట్టు రిజర్వుడు నియోజక వర్గాల ఇంచార్జిలుగా తమ సామాజిక వర్గం వారు సూచించిన డాక్టర్ థామస్, డాక్టర్ మురళీ మోహన్ ను నియమించారని ప్రచారం జరుగతున్నది. ఈ నేపథ్యంలో కుప్పం, చిత్తూరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి, మదనపల్లి స్థానాలను కమ్మ సామాజిక వర్గం వారికి కేటాయిస్తారని అంటున్నారు. జనసేన బిజెపితో పొత్తు ఖరారు అయితే తిరుపతి, పుంగనూరు, తంబళ్లపల్లె నియోజక వర్గాలను కేటాయిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికలలో పలమనేరు నుండి అమరనాధ రెడ్డి, పుంగనూరు నుండి అనీషా రెడ్డి, పీలేరు నుండి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, శ్రీకాళహస్తి నుండి బొజ్జల సూదీర్ రెడ్డి పోటి చేశారు. YCP గాలిలో ఒక్కరు కూడా గెలువలేదు. కమ్మ సామాజిక వర్గం నుండి కుప్పం నుండి చంద్రబాబు బాబు నాయుడు, మదనపల్లి నుండి దొమ్మలపాటి రమేష్, నగరి నుండి గాలి భానుప్ర్తకాష్ పోటి చేశారు. బలిజ సామాజిక వర్గం నుండి చిత్తూరు నుండి AS మనోహర్, తిరుపతి నుండి సుగుణమ్మ పోటి చేశారు. BC సామాజిక వర్గాలికి చెందిన శంకర్ యాదవ్ కు తంబళ్ళపల్లి కేటాయించారు.
గతంలో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు సమ ప్రాతినిధ్యం లభించింది. ఈ పర్యాయం రెడ్డి సామాజిక వర్గానికి మూడు మాత్రమే కేటాయించి, 6 స్థానాలను కమ్మ కులస్తులకు కేటాయించే అవకాశాలు ఉన్నాయని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే పలమనేరు నుండి అమరనాధ రెడ్డి, పీలేరు నుండి కిషోర్ కుమార్ రెడ్డి, పుంగనూరు నుండి చల్లా రామచంద్రా రెడ్డి మాత్రమే పోటిలో ఉంటే అవకాశాలు ఉన్నాయి. దీనితో రెడ్డి సామాజిక వర్గం నాయకులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఎంత కాలం పార్టీని నమ్ముకొని ఉన్నా, తమకు తగిన న్యాయం జరగడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇది వరకు కాంగెస్ పార్టీలో గానీ, ప్రస్తుత YCP పార్టీలో గానీ, రెడ్లకు ప్రాముఖ్యత ఇవ్వడం కారణంగా జిల్లాలో ఆ పార్టీలో పటిష్టంగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సమర్థవంతమైన కమ్మ అభ్యర్థులు కాకున్నా వారికీ ఇం ఛార్జ్ పోస్టులు ఇవ్వడం, టిక్కెట్టు ఇవ్వడం, పార్టీ పదవులు ఇవ్వడంతో చంద్రబాబు సొంత జిల్లాలో పార్టీ చతికిల పడుతోందని విశ్లేషిస్తున్నారు. సమర్థులైన రెడ్డి నాయకులను పార్టీలోకి తీసుకువచ్చి అవకాశాలు కల్పిస్తే, రానున్న ఎన్నికలలో పార్టీ ఘనవిజయం సాధించడం తధ్యమని జోష్యం చెపుతున్నారు.