26, జూన్ 2023, సోమవారం

మంత్రి పెద్దిరెడ్డి అంటే టిడిపిలో భయం.. భయం..



         రాజకీయాలలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు సహజమే. సాధారణంగా అధికార పక్షాన్ని ప్రతిపక్షం ఇరుకున పెట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. అవినీతి, అవకతవకలు, కుంభకోణాలు వెలికితీసి విరచుకపడుతుంటాయి. వాటికి సమాధానం ఇవ్వలేక అధికార పక్షం సతమతం అవుతుంది. ఒక్కొక్క సారి అధికారం పక్షం ప్రతిపక్షంతో లోపాయకారి ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. అయితే చిత్తూరు జిల్లాలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అధికార పార్టీ పతిపక్షం మీద జోరీగా విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి తన చిరకాల రాజకీయ శత్రువు అయిన చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పార్టీ అధినేత మీద విమర్శలు చేస్తున్నా, వాటిని ఖండించడానికి తెదేపా నాయకులు ముందుకు రావడం లేదు.

          మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి  అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టిడిపి నాయకులు భయపడుతున్నారన్న  వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుపై చేసే విమర్శలను ఒకరు కూడా తిప్పి కొట్ట లేక పోతున్నారు. రెండు రోజుల క్రితం పెద్దిరెడ్డి కుప్పంలో మాట్లాడుతూ చంద్రబాబును ఈసారి ఓడిస్తామని ప్రతిజ్ఞ చేశారు. చంద్రగిరిలో ఓడిపోయిన చంద్రబాబు కుప్పం పారిపోయి పోటీ చేసి గెలుస్తారని ఎద్దేవా చేశారు. ఏడు సార్లు గెలిపించిన కుప్పం ప్రజలకు బాబు చేసింది ఏమీ లేదన్నారు. అందుకే ప్రజలు స్తానిక సంస్థల ఎన్నికలు, మునిసిపల్ ఎన్నికల్లో టిడిపిని చిత్తుగా ఓడించారని తెలిపారు. గతంలో 60 వేల మెజారిటీ సాధించిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో 30 వేల మెజారిటీతో బయట పడ్డారని చెప్పారు. ఈసారి బాబును ఓడించి ఇంటికి పంపుతామని ధీమా వ్యక్తం చేశారు. 

       అయితే జిల్లా నాయకులు ఒక్కరు కూడా దీనిపై నోరు మెదపలేదు. ఆఖరికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుప్పం అభివృద్ధిపై చర్చకు రమ్మని పెద్దిరెడ్డికి సవాలు విసిరారు. జిల్లా నేతలు ఎవరు పెద్దిరెడ్డి వ్యాఖ్యలు ఖండించక  పోవడం ఇప్పుడు పార్టీ వర్గాలలో చర్చకు దారి తీస్తోంది. పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించేందుకు చల్లా రామచంద్రా రెడ్డి  (బాబు)కి ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. అంతకు ముందు ఇంచార్జిగా ఉన్న మాజీ ఎంపీ కలవాతి రామకృష్ణా రెడ్డి కోడలు అనీషా రెడ్డి అనుకున్న రీతిలో పనిచేయలేదని ఆమె స్థానంలో చల్లా బాబును  నియమించారు. అయితే ఆయన పెద్దిరెడ్డి అంటే భయపడుతున్నారని అంటున్నారు. మూడు నెలల క్రితం నియోజక వర్గం పరిశీలకునిగా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డిని ఏరికోరి నియమించారు.ఆయన ఇంత వరకు పుంగనూరు పట్టణంలో అడుగే పెట్టలేదని తెలిసింది. మొదట్లో ఒకటి రెండు ప్రకటనలు చేసినా తరువాత అటువైపే చూడలేదని కొందరు అంటున్నారు. 

       అలాగే జిల్లా నుంచి అధికార ప్రతినిధులుగా ఉన్న డాక్టర్ సప్తగిరి ప్రసాద్, గౌనివారి శ్రీనివాసులు పెద్దిరెడ్డి జోలికి వెళ్ళడానికి సుముఖంగా లేరని తెలిసింది. ఇక జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ఎన్ అమరనాధ రెడ్డి కూడా పెద్దిరెడ్డిని ఎదుర్కోలేక పోతున్నారని ఒక నాయకుడు వ్యాఖ్యానించారు. చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఇతర నాయకులు ఎవరు పెద్దిరెడ్డిని విమర్శించడానికి సాహసించడం లేదని అంటున్నారు. కొందరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో వ్యాపార సంబంధాలు ఉన్నాయని, అందుకే విమర్శించడం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును లక్ష ఓట్లతో గెలిపిస్తామని  చెప్పడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. చంద్రబాబు జాగ్రత్త పడక పోతే నష్టపోక తప్పదని సీనియర్ నాయకుడు ఒకరు ఆవేదన వ్యక్తంచేశారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *