10, జూన్ 2023, శనివారం

జి డి నెల్లూరు టిడిపి సమావేశంలో అరుపులు, కేకలు, తోపు లాటలు

జి డి నెల్లూరు టిడిపి సమావేశంలో బగ్గుమన్న విభేదాలు !
* అరుపులు, కేకలు, తోపు లాటలు
* రెండు వర్గాలుగా విడిపోయి నినాదాలు
* అర్థాంతరంగా సమావేశం వాయిదా

                జి డి నెల్లూరు నియోజక వర్గం టిడిపి  సమావేశంలో విభేదాలు బగ్గుమన్నాయి. సమన్వయ కర్త, ఆరుగురు మండల అధ్యక్షుల మధ్య రాజీ కుదర్చడానికి శనివారం ఎస్ అర్ పురం పార్టీ కార్యాలయంలో ప్రారంభమైన  సమావేశంలో గందరగోళం చోటుచేసుకోవడంతో  మాజీ మంత్రి అమరనాధ రెడ్డి  సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేశారు. 

         గత వారం నియోజక వర్గానికి డాక్టర్ థామస్ ను ఇంచార్జిగా నియమించారు. దీనితో  సమన్వయ కర్త భీమినేని చిట్టిబాబు నాయుడు పదవి ముగిసిందని అధిష్టానం తెలిపింది. అయితే తాను సమన్వయ కర్త పదవిలో కొనసాగాలని చిట్టిబాబు పట్టుబట్టారు. దీనికి రెండు పార్లమెంటు నియోజక వర్గాల పరిశీలకుడు బీదా రవి చంద్ర, ప్రధాన కార్యదర్శి అమరనాద రెడ్డి వీలు కాదని చెప్పారు. దీనితో చిట్టి బాబు అలిగి సమావేశం నుంచి వెళ్ళిపోయారు. 

        ఆరు మండల పార్టీ అధ్యక్షులు ఇతర కార్యకర్తలు, పార్టీ అధిష్టానం నాయకులతో మంతనాలు కొనసాగించారు. అమర్నాథ్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు మబ్బు దేవనారాయణ రెడ్డి, డాక్టర్ థామస్ సమావేశాన్ని మొదలు పెట్టుటకు సహకరించాలని కోరారు. కానీ చిట్టిబాబు నాయుడు వర్గం సమావేశం జరపరాదని,  జరిపిస్తే గొడవలు జరుగుతాయని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా పార్టీ అధిష్టానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. చిట్టిబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాలకు తోపులాట జరిగింది. కొందరు కార్యకర్తలు సమావేశం నుంచి పరుగులు తీయాల్సి వచ్చింది. 

          ఇరు వర్గాల అరుపులు, కేకలతో సమావేశం దద్దరిల్లింది. కుర్చీలు గాల్లోకి లేచాయి. దీంతో అమరనాధ రెడ్డి సమావేశాన్ని  అర్ధాంతరంగా వాయిదా వేశారు. ఈ వారంలోగా చిట్టి బాబు నాయుడుతో సంప్రదించి మళ్లీ సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, నగరి ఇంచార్జి భాను ప్రకాష్, పార్లమెంటు తెలుగు మహిళ అధ్యక్షురాలు అరుణ, తెలుగు రైతు అధ్యక్షుడు నాగేశ్వర రాజు రాష్ట్ర సాంస్కతిక విభాగం ప్రధాన కార్యదర్శి ఎన్ ముని చంద్రా రెడ్డి, మండల అధ్యక్షులు రుద్రయ్య నాయుడు, జయశంకర్ నాయుడు,రాజేంద్ర, స్వామి దాస్, చంగల్రాయ యాదవ్, లోకనాధ రెడ్డి ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *