18, జూన్ 2023, ఆదివారం

పవన్ వారాహి యాత్రతో అయోమయంలో రాష్ట్ర రాజకీయాలు

 పవన్ వారాహి యాత్రతో అయోమయంలో రాష్ట్ర రాజకీయాలు

* పొత్తులు, వ్యతిరేక ఓట్లు గాలికి...

* ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని వినతి

* అయోమయంలో తెదేపా నాయకులు

* తలలు పట్టుకుంటున్న ప్రజలు

* వైసీపీలో ఉరకలేస్తున్న ఉత్సాహం

         వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనకు చరమగీతం పాడడమే  తన ధ్యేయంగా గతంలో  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డిని గద్దే దించడమే లక్ష్యంగా పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చర్యలు తీసుకునే పూచీ తమదని హామీ ఇచ్చారు. దుష్ట పరిపాలన అంతం చేయడానికే వారాహి యాత్ర అని స్పష్టం చేశారు. అయితే పవన్ వారాహి ఎక్కిన తరువాత ఎం అయ్యిందో ప్రజలకు అర్థం కావడం లేదు. పొత్తుల గురించి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు గురించి పవన్ మాట్లాడ్డం లేదు. తనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఎవరు అపుతారో చూద్దాం అంటున్నారు. పవన్ వ్యాఖ్యలతో ప్రజల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. పొత్తులు ఉంటాయో, ఉండవో తెలియక జుట్టు పిక్కొంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఎం జరుగుతుందో తెలియక తికమక పడుతున్నారు. అయితే అధికార వైసీపీలో మాత్రం ఈ పరిణామాలు  ఉత్సాహం నింపుతున్నాయి. తమకు ఎదురు లేదనే ధీమా వ్యక్తం అవుతోంది.

        జనసేన నేత పవన్ కళ్యాణ్, వారాహి యాత్రలో తనను ముఖ్య మంత్రిగా చేయాలంటూ ప్రజల్ని కోరడంతో, తెలుగుదేశం శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. పవన్ పొత్తు లేదంటే మళ్లీ పరాజయం తప్పదని భయపడుతున్నారు. లోకేష్ పాదయాత్రకు, పవన్ వారాహి యాత్ర తోడైతే జగన్ భయపడుతారని రెండు పార్టీల కార్యకర్తలు భావించారు. రాష్ట్రంలో జగన్ విముక్త పాలనే లక్ష్యంగా పొత్తుకు ప్రయత్నిస్తున్నట్టు మూడు పార్టీలు ప్రచారం చేశాయి. బిజెపి,జనసేన పార్టీలు   కలిసి పనిచేయాలని చాలా రోజుల క్రితమే నిర్ణయించుకున్నారు. గత కొద్ది నెలలుగా చంద్రబాబు, పవన్ దగ్గర అయ్యారు. దాదాపు రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని తేలిపోయింది. సీట్ల సర్దుబాటు కసరత్తులు కూడా జరుగుతున్నాయని ప్రచారంలో ఉంది. బిజెపి కూడా టిడిపితో పొత్తుకు సిద్దమైంది. 

               త్వరలో జరగనున్న తెలంగాణా ఎన్నికల్లో గెలవడానికి టిడిపితో పొత్తు అవసరమని గుర్తించారు. గతంలో జరిగిన అన్ని విషయాలు పక్కన బెట్టి పొత్తు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవల శ్రీకాళహస్తిలో బిజెపి అధ్యక్షుడు నడ్డా, విశాఖపట్నంలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని అందరూ భావించారు. జనసేనకు 25 నుంచి 30 అసెంబ్లీ స్థానాలు, బిజెపికి 10 నుంచి 13 సీట్లు ఇస్తారని అంచనాలు వేశారు. ఇద్దరికీ కలసి ఐదు లోక్ సభ స్థానాలు కేటాయిస్తారని వార్తలు వచ్చాయి. మూడు పాటీలు కలసి పోటీ చేసి అధికారంలోకి వస్తే చంద్రబాబు ముఖ్య మంత్రి, పవన్ కల్యాణ్ ఉప ముఖ్య మంత్రి అవుతారని ఊహాగానాలు  వినిపించాయి. 

          అయితే వారాహి యాత్రలో  పవన్ తనకు ముఖ్యమంత్రి అవకాశం కల్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో ఇప్పటి వరకు ఊహించిన వన్నీ గాలికి ఎగిరిపోయాయి. గతంలో పవన్ మాట్లాడుతూ 25 స్థానాలు గెలిస్తే ముఖ్య మంత్రి కాలేమని అన్నారు. అయితే హఠాత్తుగా తనకు ముఖ్యమంత్రి కావాలని ఉందని ప్రకటించడంతో పొత్తు ఉండదేమో అన్న సందేహం తలెత్తింది. జనసేన, బిజెపి కలసి అన్ని స్థానాలకు పోటీ చేసే అవకాశం ఉందని ఒక వర్గం మీడియా ప్రచారం ప్రారంభించింది. అదే కాని జరిగితే మళ్ళీ టిడిపి చతికిల పడక తప్పదని అంటున్నారు. కొందరు టిడిపి నేతల తీరు నచ్చకపోవడం వల్లనే జనసేన కార్యకర్తలు పనన్ పై వత్తిడి పెంచారని అంటున్నారు.

           పొత్తు ఉంటే అధికారం ఖాయం అన్న నమ్మకం కలగడం వల్ల నెల్లూరు జిల్లాకు చెందిన వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని పవన్ భావిస్తున్నారు. అలాగే టిడిపి రాష్ట్ర వ్యాప్తంగా బలం పుంజు కుంటున్నదని అనుకుంటున్నారు. అయితే టిడిపి నేతలు జనసేనకు 25 సీట్లకు మించి ఇవ్వడం దండగ అన్న ప్రచారం ప్రారంభించారు. బిజెపికి 10 ఎమ్మెల్యే స్థానాలు చాలని చులకనగా మాట్లాడుతున్నారు. టిడిపిలో ఉన్న కమ్మ సామాజిక వర్గం నేతలు పవన్ తో పొత్తు లేకపోయినా అధికారంలోకి వస్తామని అంటున్నారు. అలాగే బిజెపితో పొత్తు వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని విశ్లేషిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో  బిజెపిని ఓడించడంలో తమ సామాజిక వర్గం కీలక పాత్ర పోషించిన విషయం గుర్తుకు తెస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, ఆ పార్టీలో పెత్తనం చేసే కమ్మ సామాజిక వర్గం నాయకులకు బుద్ది చెప్పాలని పవన్ ముఖ్య మంత్రి మంత్రం జపిస్తున్నారని కొందరు భావిస్తున్నారు.

         దీంతో ఇప్పుడు రాష్ట్రంలో ఎవరిని కదిలించినా పవన్ పొత్తు కాదంటే  టిడిపికి అధికారం కల్ల అంటున్నారు. దీనితో టిడిపి నేతలు కొందరు పవన్ మతి తప్పి మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. బిజెపి కూడా గతి లేక టిడిపి పొత్తు కోరు కుంటున్నదని హేళన చేస్తున్నారు. దీంతో చంద్రబాబు  సిగ్గు లేకుండా పవన్ వెంట తిరుగుతున్నారని జనసేన కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అధికార వైసీపీలో మాత్రం ఈ పరిణామాలతో  పండుగ వాతావరణం నెలకొంది. కార్యకర్తలు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. తమకు ఇక ఎదురు లేదనే ధీమా వ్యక్తం అవుతోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *