* మంచి ముహూర్తం చూసుకొని పార్టీలో చేరాలని ఆదేశం.
* ఇతర నియోజకవర్గాల బాధ్యతలు కూడా చూడాలని సూచన
* సమన్వయంతో పార్టీని పటిష్టం చేయాలని హితవు
శ్రీకాళహస్తి తెదేపా నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జల సుధీర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నా, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్ సి వి నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారం రోజుల తర్వాత మంచి రోజు చూసుకుని పార్టీలో చేరాల్సిందిగా కోరారు. సత్యవేడుతో పాటు కొన్ని నియోజకవర్గాల బాధ్యత కూడా చూడాల్సి వస్తుందని ఎస్ సి వి నాయుడుతో చంద్రబాబు నాయుడు అన్నారు. వారం రోజుల పాటు తను మంగళగిరిలో బస్సు యాత్రలో ఉంటానన్నారు. వారం రోజుల తర్వాత మంచి ముహూర్తం చూసుకొని ఎస్సివి నాయుడును తెలుగుదేశం పార్టీలో చేరమని సూచించారు.
శ్రీకాళహస్తికి చెందిన SCV నాయుడు 2004 సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. అలాగే 2009 ఎన్నికల్లో కూడా బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరో సారి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దీనితో కాంగ్రెస్ పార్టీలో నుండి తెలుగుదేశం పార్టీలో చేరి, సత్యవేడు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా పనిచేశారు. 2014 ఎన్నికలలో ఆయన శ్రీకాళహస్తి టిడిపి టికెట్ ను ఆశించారు. టిడిపి టిక్కెట్టు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డికి దక్కింది. తరువాత కొంత కాలం పార్టీకి దూరంగా ఉన్న SCV నాయుడు తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2019 ఎన్నికలలో బియ్యపు మధుసూదన్ రెడ్డి విజయానికి కృషి చేశారు. అయితే పార్టీ అధికారంలోకి వస్తే MLC ఇస్తామని పార్టీ అధినేత జగన్, జిల్లా మంత్రి రామచంద్రారెడ్డి ఎస్ సి వి నాయుడుకు హామీ ఇచ్చారు. ఎస్ సి వి నాయుడు పార్టీ కోసం పనిచేస్తున్నా, చివరి నిమిషంలో ఎమ్మెల్సీగా సిపాయి సుబ్రహ్మణ్యంకు ఇచ్చారు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి YCPలో చేరిన కొద్ది రోజులకే ఎమ్మెల్సీ ఇవ్వడం SCV నాయుడు, ఆయన అనుచరులకు మింగుడు పడటం లేదు. ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంతో నాయుడు YCP పార్టీకి రాజీనామా చేశారు. తెదేపాలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.
ఎస్ సి వి నాయుడు దేశం పార్టీలో చేరడాన్ని మొదటినుంచి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న సుధీర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఆయన ఈ నెల 8వ తేదీన పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. అయితే ఎస్ సి వి నాయుడు పార్టీలో చేరే విషయమై తనకు సమాచారం లేదనీ, తనను ఆహ్వానించలేదని బొజ్జల సుధీర్ రెడ్డి మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఎవరు హాజరు కావద్దని సుధీర్ రెడ్డి కోరారు. ఈ మేరకు వాట్సాప్ గ్రూపులో వాయిస్ మెసేజ్ పెట్టారు. అలా కాదని ఎస్ సి వి నాయుడుతో వెళితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
దీంతో ఎస్ సి వి నాయుడు పార్టీలో చేరడం తాత్కాలికంగా వాయిదా పడింది. ఈనెల 14వ తేదీన కుప్పం రావలసిందిగా చంద్రబాబు నాయుడు బొజ్జల సుధీర్ రెడ్డి, ఎస్ సి వి నాయుడులను కోరారు. అయితే అక్కడ కార్యక్రమాల బిజీ కారణంగా ఆ భేటీ జరగలేదు.
ఈనెల 18వ తేదీన అమరావతిలో జరిగిన తెదేపా సర్వసభ్య సమావేశనికి ఎస్సివి నాయుడు కూడా హాజరయ్యారు. పార్టీ సమావేశం పూర్తయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎస్ సి వి నాయుడు చేరే ప్రస్తావన వచ్చింది. వారం రోజుల తర్వాత మంచి రోజు చూసుకుని పార్టీలో చేరాల్సిందిగా ఎస్సీవి నాయుడును పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. వారం రోజులపాటు తాను మంగళగిరిలో బస్సు యాత్రలో ఉంటానని అనంతరం తన అందుబాటులో ఉంటానని అన్నారు. మంచి రోజు చూసుకోని పార్టీలో చేరాలని సూచించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ ఛార్జ్ సుధీర్ రెడ్డి కలగజేసుకుంటూ నన్ను బలపరచమని చెప్పండి అంటూ చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. అందుకు ఎస్ఏవి నాయుడు సమాధానం ఇస్తూ బి ఫారం ఇచ్చిన తర్వాత కదా ఎవరు ఎవరిని బలపరిచేది, ఇప్పుడు ఎందుకు అన్నట్టు తెలిసింది. చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుంటూ మీరు ఆబ్రాడ్ లో తిరగండి సరిపోతుంది అని బొజ్జల సుధీర్ ఉద్దేశించి అన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎస్సీవి నాయుడుతో చంద్రబాబు మాట్లాడుతూ పార్టీలో చేరిన తర్వాత సత్యవేడు వెళ్లాల్సి వస్తుందన్నారు. అలాగే రెండు మూడు నియోజకవర్గాలలో కూడా తిరిగి పార్టీని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని, ఆ విషయం తర్వాత చెప్తానన్నారు. పార్టీ కార్యక్రమాలను పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ సంభాషణ జరుగుతున్న సమయంలో శాసన మండలి సభ్యులు రాంభూపాల్ రెడ్డి కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం అందింది.
మాజీ ఎమ్మెల్యే ఎస్ సి వి నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని ఆ పార్టీ లోని ఒక బలమైన వర్గం ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. బొజ్జల సుధీర్ రెడ్డి అందుబాటులో లేకపోవడం, అప్పుడప్పుడు వచ్చి కార్యక్రమాలకు హాజరు కావడంతో కార్యకర్తలు, నాయకులు కొంత అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తుంది. ఈమధ్య వైసీపీ నాయకులు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక నేత పైన దాడి చేయగా దానిని సమర్థవంతంగా నియోజకవర్గ ఇన్చార్జ్ ఎదుర్కొనలేదన్న అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్ సివి నాయుడు స్థానికంగా ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటారు. కార్యకర్తలకు ఏదైనా ఆపద వచ్చినా, సహాయము అవసరమైన ముందు వెనుక ఆలోచించరు. కావున ఎస్సీవి నాయుడు చేరికను నియోజకవర్గ ఇన్చార్జ్ సుధీర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నా, తెలుగుదేశం పార్టీలోనే మరో వర్గం ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సివి నాయుడు పార్టీలో చేరితే ఆ ప్రభావం శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట నియోజకవర్గాల మీద కూడా ఉంటుందని భావిస్తున్నారు.
శ్రీకాళహస్తిలో సుధీర్ రెడ్డి, ఎస్ సి వి నాయుడు ఇద్దరు కలిసి సమన్వయంతో పనిచేస్తే ఈసారి ఎన్నికలలో ఈజీగా విజయం సాధించవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈసారి అధికార పార్టీ వ్యతిరేక, తెలుగుదేశం పార్టీ అనుకూల గాలి ఈస్తుండడంతో తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించి శాసనసభలో అడుగు పెట్టాలని సుధీర్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎస్సీవి నాయుడు పార్టీలో చేరితే తన టికెట్ కు ఎక్కడ ముప్పు వస్తుందోనని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఎస్సివి నాయుడు గతంలో చంద్రబాబు నాయుడును కలిసినప్పుడు నియోజకవర్గంలో రెండు, మూడు సర్వేలు నిర్వహించి ఎవరికి గెలిసే అవకాశం ఉంటే వాళ్లకే టిక్కెట్టు ఇవ్వమని చంద్రబాబు నాయుడును కోరినట్లు తెలుస్తోంది. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా అంకిత భావంతో పనిచేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఎస్సీవి నాయుడును పార్టీలోకి తీసుకొని పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష బాధ్యతను అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే సుధీర్ రెడ్డి, ఎస్ సి వి నాయుడులో ఒకరికి ఎమ్మెల్యే, మరోకరికి ఎమ్మెల్సీ ఇస్తే సమ న్యాయం చేసినట్లు అవుతుందని, మూడు నియోజక వర్గాలలో పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.
కొసమెరుపు
SCV నాయుడు తెదేపాలో చేరకుండా తాను అడ్డుపడుతున్నాను అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను స్వయంగా SCV నాయుడు ఇంటికి వెళ్లి పార్టీలో చేరాలని ఆహ్వానించనున్నట్లు తెలిపారు. నాయుడు చేరికను తాను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.