పూతలపట్టు తమ్ముళ్ళలో అగ్రహ జ్వాలలు
పూతలపట్టు తమ్ముళ్ళలో అగ్రహ జ్వాలలు
* అవమానంతో రగిలిపోతున్న తమిళ దళితులు
* ఆగ్రహ ఆవేశాలతో కమ్మ నేతలు
చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజక వర్గం ఇన్ ఛార్జ్ నియామకం విషయంలో తెలుగు తమ్ముళ్లులో అసంతృప్తి జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. అధిష్టానంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధం అవుతున్నారు. నియోజకవర్గ దళిత సామాజిక వర్గం ఆవేదనతో కృంగి పోతోంది. కమ్మ సామాజిక వర్గం అసంతృప్తితో రగిలిపోతున్నారు. మూడు సార్లు నియోజకవర్గంలో ఓటమిని చవిచూసిన తమ్ముళ్లు ఈ సారి కూడా అందుకు సిద్ధంగా లేరు. ఎలాగయినా గెలవాలని కృతనిశ్చయముతో ఉన్న తెలుగు తమ్ముళ్ళు సిగపట్లుకు సైతం సిద్ధమవుతున్నట్టు సమాచారం.
నియోజక ఇంచార్జిగా జర్నలిస్టు డాక్టర్ కలికిరి మురళీ మోహన్ నియామకం పట్ల పలువురు నాయకులు అసంతృప్తితో రగిలి పోతున్నారని తెలిసింది. జి డి నెల్లూరు తరహాలో ఇక్కడ కూడా గొడవ పాడటానికి ఎస్సీ సామాజిక వర్గం నేతలు సిద్దమవుతున్నారు. బలమైన కమ్మ సామాజిక వర్గం నాయకులకు నిలయమైన పూతలపట్టులో టిడిపి హ్యాట్రిక్ అపజయాలు మూటకట్టు కున్నది. నియోజక వర్గం ఏర్పడినప్పటి నుంచి వరుసగా మూడు సార్లు టిడిపి అభ్యర్థిగా లలిత కుమారి పోటీ చేసి ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ పి రవి చేతిలో కేవలం 951 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి ఎం సునీల్ కుమార్ ఆమెపై 902 ఓట్ల మెజారిటీ సాధించారు. 2019లో వైసిపి అభ్యర్థి ఎం ఎస్ బాబు చేతిలో ఆమె 29,163 ఓట్ల భారీ తేడాతో పరాజయం పాలైంది.
టిడిపికి వెన్ను దన్నుగా ఉండే కమ్మ సామాజిక వర్గం నాయకుల నమ్మక ద్రోహం వల్లనే తాను ఓడి పోయానని భావించిన ఆమె పార్టీకి గుడ్ బై చెప్పారు. చిత్తూరు నగరంలో ఒకప్పుడు చక్రం తిప్పిన మాజీ ఎం పిలు ఎన్ పి (నలగాం పల్లి) చంగల్రాయ నాయుడు, ఎన్ పి ఝాన్సీ లక్ష్మి, ఎన్ పి దుర్గ ఈ నియోజక వర్గంలోని తవణం పల్లి మండలానికి చెందిన వారు. అలాగే మాజీ ఎం పి పాటూరు రాజగోపాల్ నాయుడు కుమార్తె, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కూడా అదే మండలానికి చెందిన వారే. ఆమె భర్త అమర రాజా అధినేత గల్లా రామచంద్ర నాయుడు, ఆమె కుమారుడు, గుంటూరు ఎం పి గల్లా జయదేవ్ పూతలపట్టు మండలానికి చెందిన వారు. నియోజక వర్గంలో వారికి వేల కోట్ల విలువ గల పరిశ్రమలు ఉన్నాయి. కాగా రామోజీ రావు వియ్యంకుడు ఫౌల్ట్రీ రంగ రారాజు సుందర నాయుడు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, టిడిపి జిల్లా మాజీ అధ్యక్షుడు మహాదేవ నాయుడు కూడా నియోజకవర్గానికి చెందిన వారే.
ఇంత మంది బలమైన నాయకులకు పుట్టిల్లు అయిన పూతలపట్టు నియోజకవర్గంలో టిడిపి ఓడిపోవడం వెనుక వర్గపోరు, వెన్ను పోటు రాజకీయాలే కారణం అంటున్నారు. 2019లో లలిత కుమారి పార్టీని వీడిపోయిన తరువాత ఇప్పటి వరకు పార్టీకి ఇంచార్జి లేరు. అయితే మాజీ మంత్రి అమరనాధ రెడ్డి, దొరబాబు, చిత్తూరు పార్లమెంటు అద్యక్షుడు పులివర్తి నాని ఇక్కడ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్, ఆనగల్లు మునిరత్నం, పుష్పరాజ్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. తమలో ఒకరికి ఇంచార్జి పదవి వస్తుందని ఆశించారు.
కనీసం పది కోట్లు డిపాజిట్ చేస్తేనే ఇంచార్జి పదవి ఇస్తామని చంద్రబాబు వీరికి తేల్చి చెప్పారని అంటున్నారు. అయితే తిరుపతిలో జర్నలిస్టుగా ఉన్న మురళీ మోహన్ ను శుక్రవారం ఇంచార్జిగా నియమించారు. అతనికి తగిన ఆర్గిక సామర్ధ్యం లేక పోయినా యువ రాజులు నాయుడు, తేజో మూర్తి నాయుడు హామీ ఇవ్వడంతో చంద్రబాబు సంతృప్తి పడి పదవి ఇచ్చారని ప్రచారంలో ఉంది. అలాగే అమరనాధ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయంటున్నారు. నియోజక వర్గంలో 55 వేల మంది అరవ మాల సామాజిక వర్గం వారు ఉండగా, కేవలం తొమ్మిది వేల మంది ఉన్న తెలుగు మాల సామాజిక వర్గం వ్యక్తిని ఇంచార్జిగా నియమించడం ఏమిటని మండి పడుతున్నారు.
నియోజక వర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తే అమీ తుమీ తేల్చుకోవాలని చూస్తున్నారు. ఇక్కడ టిడిపి అభ్యర్థి గెలవాలని నాయకులు ఎవరూ కోరుకోవడం లేదని ఒక దళిత నాయకుడు చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్య మంత్రి అయితే తాము ఇక్కడ చక్రం తిప్పవచ్చని కమ్మ సామాజిక వర్గం నేతలు భావిస్తున్నారని తెలిపారు. అమరనాధ రెడ్డి కూడా ఇక్కడ దళితుడు ఎమ్మెల్యే అయితే తన మంత్రి పదవికి అడ్డు వస్తారని భయపడి కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొందరు నాయకులు వైసిపి కోవర్టులుగా పనిచేస్తున్నారని విమర్శిస్తున్నారు. నేపథ్యంలో గొడవ పాడటానికి సమయం కోసం కొందరు అరవ దళిత నేతలు సిద్ధ పడుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది.