28, జూన్ 2023, బుధవారం

మామిడి ధరలపై ప్రభుత్వం జోక్యం చేసుకొని, రైతులను ఆదుకోవాలి



                     మామిడి ధరలపై ప్రభుత్వం జోక్యం చేసుకొని మామిడి రైతులను ఆదుకోవాలని చిత్తూరు మామిడి ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ చైర్మన్ వి. మునిచంద్ర నాయుడు,  సి.ఈ.ఓ. ఎస్. ఆనంద నాయుడు డిమాండ్ చేశారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధరలేకుండా రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు.  ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతులకు గిట్టుబాటు ధర రాకపోగా, మామిడి కాయలు అమ్ముకోవడం పెద్ద సమస్యగా మారిందన్నారు. గుజ్జు ఫ్యాక్టరీలు మామిడి కాయలు తెసుకోవడంలేదని, మళ్ళి తీసుకురమ్మని వెనక్కి పంపుతున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. వాటిని నిల్వ ఉంచలేక రైతులు రోడ్డు పక్కన పరపోస్తున్నారని వాపోయారు. మామిడి కాయలు పక్వానికి వచ్చాయని, కోయకుంటే మాగి, కిందపడి పాడైపోతున్నాయని వివరించారు. కోసినా, ఫ్యాక్టరీలు కాయలు తీసుకోవడం లేదన్నారు. జిల్లాలోని మంత్రులు, MLAలు, MLCలు ఈ విషయం మీద దృష్టిని పెట్టడం లేదన్నారు. ప్రజాప్రతినిధులు మామిడి రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి గిట్టుబాటు ధర వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.   

                 వారు మాట్లాడుతూ.. ధరలు నిలకడగా ఉండటం లేదు.    రోజు రోజుకు, పూటపూటకు మామిడి ధరలు తగ్గిపోతున్నాయి. పరిశ్రమల యజమానులు ధరలు తగ్గించి రైతులకు నష్టం చేస్తున్నారు. ఒకవైపు మచ్చలు వచ్చిన 30 శాతం కాయలు పల్పుకు పనికి రావడం లేదు. ఉన్న 70 శాతం కాయలకు ధరలు లేవు. రైతులు కాయలు కోసి అమ్మితే, కోత కూలి, రవాణా బాడుగలు కూడా రావడం లేదు. పైగా పరిశ్రమల వారు  కాయలు ఎక్కువ అయ్యాయి, నిల్వ చేయడానికి స్థలం లేదు. వద్దు అంటూ తిరస్కరిస్తున్నారు.


                 రైతులు దీనస్థితిలో వున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం మౌనంగా వుంది. ముగ్గురు మంత్రులు వుండి కూడా రైతుల స్థితిగతులను మార్చ లేక పోతున్నారు.  ఇలాగే వుంటే జిల్లాలో మామిడి రైతులు ఉన్న మామిడి చెట్లను నరికివేయల్చిన పరిస్థితి వస్తుందన్నారు. భవిషత్తులో రైతులు మామిడి మొక్కలు నటే పరిస్థితి ఉండదు. ఉన్న  పంటను కూడా రైతులు వదులు కుంటారు. ఇపటికే  వాణిజ్య పంట లైన చెరకు మానుకున్నారు. వేరుశెనగ వదిలేశారు. టొమాటోలలో నిత్యం నష్టాలే. విజయ డైరీ, చెరకు పరిశ్రమలు మూత పడ్డాయి. ఇప్పుడు రైతులు మామిడిని కూడా వదిలేస్తే మామిడి గుజ్జు పరిశ్రమలు అన్నీ మూతపడే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి రానీయవద్దు. వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నది. వ్యవసాయరంగం పై ఆధారపడిన పరిశ్రమలు బతికి బట్ట కట్టాలంటే వాణిజ్య పంట అయిన మామిడి కి గిట్టుబాటు ధర కల్పించండి. 20 రూపాయలకు తక్కువ వస్తే రైతు నష్ట పోతారు. అలాంటిది నేడు 8 రూపాయలకు అమ్మితే రైతు పరిస్థితి ఏమిటిని మునిచంద్ర నాయుడు, ఆనంద నాయుడు ప్రశ్నించారు.  మంత్రులు ముగ్గురు వెంటనే  దృష్టి పెట్టాలని కోరారు. శాసన సభ్యులు ప్రభుత్వం మీద  ఒత్తిడి పెంచాలన్నారు. ఈ విషయంలో అధికార యంత్రాంగం జోక్యం చేసుకొని రైతులకు ఉపశమనం కలుగచేయాలని సూచించారు. లేకుంటే రానున్న ఎన్నికలలో దీని ప్రభావం తప్పక ఉంటుందన్నారు. ప్రభుత్వం భారీగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
      


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *