ప్రాణాలు తీస్తున్న ఆన్ లైన్ బెట్టింగ్
కుటుంబాలు నాశనం అవుతున్నాయి
యువత పెడదారి పడుతోంది.
దంపతులు విపోతున్నారు
విధిన పడుతున్న కుటుంబాలు
ఆంధ్ర ప్రభ బ్యూరో, చిత్తూరు.
ఆధునిక సమాజంలో ఆన్ లైన్ బెట్టింగ్ ఒక వ్యసనంగా మారి పోయింది. తమ అభిమాన సినీ నటులు వీటిని ప్రమోట్ చేయడంతో, వారి అభిమానులు కూడా రెచ్చిపోయి బెట్టింగ్ కడుతున్నారు. సప్త వ్యసనాలు ఒకటైన జూదం ఇప్పుడు ఆధునిక పుంతలు తొక్కుతున్న సాంకేతిక ప్రగతి కొందరిని గతి తప్పించి వ్యసన పరులుగామారుస్తున్నది. ప్రధానంగా కొంత మంది యువత దారి తప్పు తున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ వల్ల అప్పుల పాలై కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ ఇతర వ్యసనాల లాగే స్నేహితుల వల్ల అలవడుతుంది. కొందరు సరదాగా ఆడటం ప్రారంభించి వ్యసనంగా మార్చుకుంటారు. పోగొట్టుకున్న డబ్బులు తిరిగి సంపాదించడానికి బెట్టింగ్ అనే కొంతమంది మార్గంగా ఎంచుకుంటున్నారు. లక్షలాది రూపాయలు అప్లై చేసి బెట్టింగులు కట్టి నష్టపోతున్నారు. ఆ అప్పులు తీర్చలేక కుటుంబ సమేతంగా ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. ప్రభుత్వం బెట్టింగ్ అప్స్ నిషేదించినా, తిరిగి కొత్త రూపంలో పుట్టుకువస్తున్నాయి. యువత వీటి మోజులో పడి తమ జీవితాలను, భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. వీటి వాళ్ళ కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి. దంపతులు విడిపోతున్నారు. కొన్ని కుటుంబాలు విధిన పడుతున్నాయి.
ఆన్ లైన్ బెట్టింగ్ గత సంవత్సరం అక్టోబర్ 24న ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని చిత్తూరు జిల్లాలో బలితీసుకున్నది. జి.డి నెల్లూరు మండలం ఎగువూరుకు చెందిన నాగరాజ రెడ్డి కుమారుడు దినేష్ ( 23) ఆన్ లైన్ బెట్టింగ్ వ్యసనానికి బానిస అయ్యారు. ఆయన చేసిన మితిమీరిన అప్పులు తీర్చలేక దినేష్ తో పాటు తండ్రి నాగరాజ రెడ్డి (61), తల్లి జయంతి (51), అక్క సునీత ( 26) శుక్రవారం మధ్యాహ్నం ఆత్మ హత్యా ప్రయత్నం చేసారు. అయితే గ్రామస్తులు నలుగురినీ తమిళనాడుకు చెందిన రాణీపేట సి ఎం సి ఆసుపత్రిలో చేర్పించారు. నాగరాజ రెడ్డి ఆరోజు రాత్రి చనిపోగా, జయంతి, సునీత శనివారం ఉదయం మృతి చెందారు. దినేష్ ఆదివారం రాత్రి మరణించారు. చిత్తూరు జిల్లాలో ఆన్‌లైన్ మోసాలకు మరొక కూడా యువకుడు బలయ్యారు. ఉద్యోగ వేటలో ఉన్న యువకుడు సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటయ్యాడు. మొదట్లో కొంత మేర లాభం వచ్చినా.. తర్వాత క్రమంగా డబ్బులు పోయాయి. దీంతో మళ్లీ సంపాదించాలని ప్రయత్నంలో అప్పులు చేశాడు. పుంగనూరు మండలం చండ్రమాకులపల్లెకు చెందిన జయరాం, సుజాతల కుమారుడు వెంకటేష్ (23) డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగం వేటలో ఉన్నారు. తల్లి చిన్నప్పుడే మరణించగా తండ్రి వెళ్లిపోయారు. వెంకటేష్ అతని మేనమామ భాస్కర్ దగ్గర పెరిగాడు. చదువు పూర్తయిన తర్వాత ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డారు. వరుసగా డబ్బులు పోవడంతో.. తెలిసిన వారి నుంచి రూ. 6 లక్షల మేర అప్పు చేసి కూడా పెట్టుబడులు పెట్టారు. అవి తిరిగి రాకపోవడం, అప్పులు తీర్చే దారి తెలియలేదు. అప్పుల విషయం మేనమామకు తెలిస్తే మందలిస్తాడనే భయంతో ఉదయాన్నే మేడపైన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుమృతిచెందాడు. ఇలాంటి వార్తలు అప్పుడప్పుడు మనం చూస్తున్నాము. డబ్బు పోగొట్టుకోవడం వల్ల తిరిగి సంపాదించాలన్న తపన ప్రారంభం అవుతుంది. దీనితో ఇంటిలో దొంగతనం చేయడం ప్రారంభిస్తారు.అలాగే తెలిసిన వారి వద్ద అప్పులు చేస్తుంటారు. అధిక వడ్డీలకు డబ్బు తీసుకుని నష్టపోతుంటారు. అప్పుల వారు వెంటపడడంతో దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉంది. కొంత మంది గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేయడానికి పూనుకుంటారు. అలాగే కొందరు మత్తు వ్యసనాలకు బానిసలు అవుతారు. కొంత మంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. ఒక్కో సారి హత్యలు చేయడానికి కూడా వెనకాడరు అంటారు. ఇలాంటి వ్యసన పరులు నెమ్మది, నెమ్మదిగా మానసిక రుగ్మతల బారిన పడుతారని పలు అధ్యయనాల ద్వారా వెల్లడైంది. వీరిలో మానసిక ఒత్తిడి, భయం, ఆందోళన, మితిమీరిన కోపం, డిప్రెషన్, నిద్రలేమి లక్షణాలు కనిపిస్తుంటాయి. వారి ప్రవర్తనలో కొట్టొచ్చినట్టు పలు మార్పులు కనిపిస్తాయి. ఈ వ్యాసం ఎక్కువగా కౌమార దశలో ప్రారంభం అవుతుందని పరిశోధనల్లో తేలింది. అది యవ్వన దశలో తీవ్ర రూపం దాలుస్తుందని చెపుతారు. కొందరు పెద్దవారు కూడ ఈ వ్యసనానికి గురయ్యే అవకాశం ఉండటారు. ఏది ఏమైనా ఆన్ లైన్ బెట్టింగ్ అలవాటు వల్ల ఇల్లు, వల్ల గుళ్లవుతుందని సామాజిక వేత్తలు అంటున్నారు. ఇలాంటి దశలో తల్లి తండ్రులు గుర్తించి మానసిక నిపుణుల వద్ద కౌన్సెలింగ్ చేయిస్తే మార్పు వస్తుందని నిపుణులు చెపుతున్నారు. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం మానసిక వైద్యుల ద్వారా చికిత్స చేయించ వలసి ఉంటుంది. అలాగే ముందు నుంచే జాగ్రత్త వహించాలి. అవసరం లేకుండా స్మార్ట్ ఫోన్ కొనివ్వడం తగదు. ఒక వేళ కొనిచ్చినా అప్పుడప్పుడు పరిదీలిస్తుండాలి. బ్యాంకు అకౌంట్ లను పరిదీలిస్తుండాలి. పిల్లల పట్ల ప్రేమ చూపడంతో పాటు, పర్యవేక్షణ ఉండాలి అంటారు. ఇదిలా ఉండగా చిన్న చిన్న నేరాలు, దొంగ తనాలు చేసి పట్టు బడిన బాలురు, యువకులపై పోలీసులు ప్రత్యెక దృష్టి పెట్టాలి. వారిలో ఆన్ లైన్ బెట్టింగ్, మాదక ద్రవ్యాల వ్యసనాలు ఉంటే తప్పకుండా కౌన్సెలింగ్ చేయించాలి. మైనర్లు అయితే ప్రభుత్వ సంక్షేమ గృహాలలో పెట్టు వారిలో పరివర్తన తీసుకుని రావాలి. తల్లి తండ్రులను కూడా హెచ్చరించాలి. విద్యా సంస్థల్లో అప్పుడప్పుడు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు నిర్వహించాలి. వ్యసనానికి గురైన యువకులు కూడ ఆత్మ పరిశీలన చేసుకుని మారడానికి ప్రయత్నించాలి. ప్రభుత్వం వీటి మీద ఉక్కు పాదం మోపాలి.
*పరివర్తనే పరిష్కారం !*
ఆన్ లైన్ బెట్టింగ్ వ్యాసనపరులలో పరివర్తన తీసుకుని రావడమే చక్కని పరిష్కార మార్గమని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి చెప్పారు. ఆదిలోనే గుర్తించి కౌన్సెలింగ్ చేస్తే తప్పకుండా మార్పు వస్తుందన్నారు. ఇతర మానసిక రుగ్మతలు ఉంటే మాత్రం సైకియాట్రిస్ట్ ద్వారా చికిత్స చేయించాలి అన్నారు. అవసరం అయితే వ్యసన విముక్తి కేంద్రాలలో పెట్టు చికిత్స చేయించాలని చెప్పారు. పిల్లలను మార్చ లేక అప్పులు తీర్చ లేక ఆత్మ హత్యలు చేసుకోవడం తగదని చెప్పారు. అధిక వడ్డీలకు అప్పు ఇవ్వడం, వత్తిడి చేయడం చట్ట విరుద్ధం కావున పోలీసుల సాయం తీసుకోవాలని సూచించారు. సమస్య తలెత్తినప్పుడు ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు అన్వేషించాలని చెప్పారు. అవసరం అయితే నిపుణులను కలవాలని సూచించారు. అంతే తప్ప ఆత్మహత్యలు ఏ సమస్యకు పరిష్కారం కాదన్నారు.
గంగ 2 సైకాలజిస్ట్ సుధాకర్ రెడ్డి

