అయోమయంలో వైసిపి నాయకులు, ప్రజాప్రతినిధులు
పార్టు ఉంటుందో, విలీనం అవుతుందో తెలియని గందరగోళం
టిడిపి వైపు పలువురి చూపు
ఇందుకు అంగికరించని టిడిపి శ్రేణులు
వై సి పి కి నో ఎంట్రీ అంటున్న పార్టీ అధినేత
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
శాసనసభ ఎన్నికల అనంతరం చిత్తూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. పార్టీని ముందుండి ఎవరు నడుపుతారు అన్న విషయం కార్యకర్తల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి దారిని మోసేసింది. దీంతో వైసిపి నాయకులు, ప్రజాప్రతినిధులకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. వైసీపీ పార్టీలోనే కొనసాగితే భవిష్యత్తు తమకు బాగుంటుందన్న భరోసా కలగడం లేదు. జిల్లాలోని స్థానిక సంస్థలు ఎన్నికల్లో 90 శాతం వైసిపి గెలుచుకుంది. ఆ పార్టీలే కొనసాగితే తమకు నిధులు విడుదలయ్యే అవకాశం ఉండదని ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ నిధులు విడుదలైన తామ ఉత్సవ విగ్రహాలు విగ్రహాలుగా మిగిలిపోతామని, పనులను టిడిపి నాయకులే చేపిస్తారన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
చిత్తూరు జిల్లాలో ఏ డ్ అసెంబ్లీ స్థానాలు ఉండగా 1919 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే జిల్లా పరిషత్, మండల పరిస్థితులను కూడా ఆ పార్టీ కైవసం చేసుకుని, అన్నిటిమీద వైసిపి జెండాను ఎగరవేసింది. జిల్లాలోని అత్యధిక పంచాయతీలను కూడా వైసిపి కైవసం చేసుకుంది. దీంతో జిల్లా నుంచి అప్పట్లో ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహించారు. ఇద్దరు ఎమ్మెల్సీ ఉన్నారు. ఆ సమయంలో వైసీపీ నాయకులకు ఎదురు లేదు. తమ చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్టుగా ప్రవర్తించారు. భూగర్భ వనరులైన ఇసుక, గ్రానైట్ లను భారీగా కొల్లగొట్టారు. అలాగే శేషాచలంలోని ఎర్రచందనం స్మగ్లింగ్ లో కూడా పాల్గొన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు అభ్యర్థుల మీద అలాంటి కేసులో ఉండడం గమనార్హం. 2024 ఎన్నికలలో పరిస్థితి తారుమారయింది. జిల్లాలో ఒక స్థానంలో మాత్రం వైసీపీ ఎమ్మెల్యే గెలువగా ఆరు స్థానాలను తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. గతంలో టిడిపి విజయం సాధించని నియోజకవర్గాలలో కూడా బోనీ కోట్టింది. రాష్ట్రంలో 11 సీట్లకే పరిమితమై, ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. దీంతో రాష్ట్రంలోని ముఖ్య నాయకుల మీద అవినీతి, అవకతవకలు, అక్రమాల కేసులు బనాయించే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాల మీద విచారణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కేసులలో ముఖ్యమైన నాయకులందరూ జైలుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి మీద పలు ఆరోపణలు ఉన్నాయి. ఇసుక, గ్రానైట్ అక్రమ రవాణా విషయంలో ఆయన ప్రేమేయం ఉన్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి మీద కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ విషయం ఇలా ఉంటె, అసలు పార్టీ ఉంటుందా, ఉండదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. వైసిపిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారన్న ఉహాగానాలు జోరుగా ఉన్నాయి. కావున జిల్లాలో వైసిపి కి ఎవరు నాయకత్వం వహిస్తారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీ భరత్ జిల్లా పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. అయితే పార్టీ మీద భరత్ కు అంత పట్టలేదు. పార్టీని, ప్రభుత్వాన్ని గతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నడిపించారు. పేరుకు భారత్ జిల్లా అధ్యక్షుడైన పెత్తనం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే. శాసనసభ ఎన్నికల్లో, కానీ స్థానిక ఎన్నికల్లో గాని అభ్యర్థుల ఖరారు నుంచి ఎవరు జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, మండల పరిషత్ అధ్యక్షులు, మండల ఉపాధ్యక్షులు అలాగే మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఎవరు ఉండాలనే విషయంలో కూడా అంతా పెద్దిరెడ్డి ఇష్టారాజ్యంగా సాగింది. ప్రస్తుతం ఆ పార్టీ కార్యక్రమాలు ఎక్కడా కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ నూతన ఉత్సాహంతో ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి సమాయత్తమవుతున్నారు. వైసీపీ పార్టీలో నాయకత్వలేమి కొట్టుకొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పలువుల ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీ సభ్యులు, జడ్పిటిసి సభ్యులు, మండల పార్టీ పరిషత్ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని సమాచారం. అయితే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. గురువారం కూడా పుంగనూరుకు చెందిన మునిసిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఆ పార్టీ ఇంచార్జ్ చల్లా బాబుని కలిసి తాము తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన సందర్భంగా పలువురు వైసీపీ ప్రజా ప్రతినిధులు టిడిపిలో చేరడానికి ఉత్సాహం తెలిపారు. ఈ విషయమై కుప్పం నియోజకవర్గ పార్టీ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో వైసిపి నుంచి ఎవరిని టిడిపి పార్టీలోకి తీసుకోకూడదని ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు సమాచారం. దీనిని టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఆమోదించారు. ఇలా వైసీపీ నాయకులకు తెలుగుదేశం పార్టీ తలుపులు మూసేసింది. దీంతో ఏం చేయాలో తెలియక వైసిపి ప్రజాప్రతినిధులు, నాయకులు గందరగోళానికి గురవుతున్నారు.