అందరి దృష్టి పుంగనూరు మీదే
నాలుగో పర్యాయం గెలుపు కోసం పెద్దిరెడ్డి వ్యూహం
తిరిగి పట్టు సాధించాలని టిడిపి పోరాటం
పరువు నిలుపుకోవాలని బి సి వై పార్టీ ఆరాటం
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లాలో కుప్పం తర్వాత అందరిదృష్టని పుంగనూరు నియోజకవర్గం ఆకర్షిస్తుంది. కప్పం నుంచి మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేస్తుండగా, పుంగనూరు నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇరువురు నేతలు రాజకీయంగా తలపండిన వారే. ఇద్దరు కళాశాల నుంచి ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. ఒకరిని ఓడించాలని మరొకరు ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడుని ఓడించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబును ఓడించడానికి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. అలాగే పుంగనూరులో మంత్రి రామచంద్రారెడ్డికి చెక్ పెట్టాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారు. చిత్తూరు జిల్లాలో జరిగిన అన్ని బహిరంగ సభలలోనూ మంత్రి పెద్దిరెడ్డి లక్ష్యంగా విమర్శలను సంధించారు. పాపాల పెద్దిరెడ్డి పని అయిపోయిందని, ఇంటికి పోయే రోజులు వచ్చాయని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పెద్దిరెడ్డి అవినీతి, అక్రమములమీద విచారణ జరిపి జైలుకు పంపిస్తామని సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో జరగనున్న ఓటర్ల లెక్కింపులో పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం సాధిస్తారా లేక నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని దెబ్బతీస్తారా అన్న విషయం పైన జోరుగా చర్చ జరుగుతోంది.
పుంగనూరు నియోజకవర్గం నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణకు ముందు వరకు తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత పరిస్థితి మారింది. ప్రస్తుతం వైసిపికి కంచుకోటలా తయారయ్యింది. పుంగనూరు నియోజకవర్గంలో నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో 1983లో బగ్గిడి గోపాల్ తెదేపా పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత జరిగిన ఎన్నికలలో 1985, 19891, 994 జరిగిన ఎన్నికలలో వరుసగా నూతనకాల్వ రామకృష్ణారెడ్డి టిడిపి తరపున హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశారు. 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు అమర్నాథ్ రెడ్డి టిడిపి అభ్యర్థిగా విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీధర్ రెడ్డి గెలుపొందారు. తిరిగి 2004లో జరిగిన ఎన్నికల్లో అమర్నాథరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత 2009, 2014, 2019 ఎన్నికలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుస విజయాలను నమోదు చేస్తూ హ్యాట్రిక్ సాధించారు.
వైసిపి అభ్యర్థిగా పోటి చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటివరకు ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన పీలేరు నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు, పుంగనూరు నుంచి మరో మూడు పర్యాయాలు గెలిచారు. 1999 నుంచి వరుసగా అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొండుతున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య మంత్రివర్గాలలో అడవులు, పర్యావరణ శాఖ, సాంకేతిక శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2013లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికలలో పుంగనూరు నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది, జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గనులు, భూగర్భ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల శాఖ బాధ్యతలు కూడా జగన్ రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఆయన 1974లో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో చదువుతూ విద్యార్థి సంఘ నాయకుడిగా ఎన్నికయ్యారు. 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే 1985,1994 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఓటమి పాలయ్యారు. 1999 తరువాత వరస విజయాలతో విజయకేతనం ఎగురవేస్తున్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా, సర్వం తనై జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు.
టిడిపి అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి చల్లా ప్రభాకర్ రెడ్డి పీలేరు నుండి 1983, 1985 ఎన్నికలలో టిడిపి తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ఆయన కుటుంబం రొంపిచర్ల మండలానికే పరిమితమైంది. ఎంపీపీగా, జడ్పిటిసిగా పదవులను నిర్వహించారు. చల్లా బాబు టిటిడి బోర్డు సభ్యుడిగా కూడా పనిచేశారు. 1985 ఎన్నికలలో పీలేరు నియోజకవర్గం నుంచి చండా రామచంద్రారెడ్డి తండ్రి చల్లా ప్రభాకర్ రెడ్డి చేతులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓడిపోయారు. 1989లో జరిగిన ఎన్నికలలో చల్ల రామచంద్రారెడ్డిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓడించి, మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. రాజకీయ కుటుంబానికి చెందిన చల్లా బాబును 2019 ఎన్నికల తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. అప్పటినుంచి ఆయన నియోజకవర్గ బాధ్యతలను చూస్తున్నారు. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీలేరు రాక సందర్భంగా పోలీసులకు టిడిపి కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. ఈ కేసుకు సంబంధించి వెయ్యి మందికి పైగా పోలీసులు కేసులను నమోదు చేశారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రులు అమర్నాథ్ రెడ్డి, దేవినేని ఉమా, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు ఉన్నారు. ఈ కేసుతో నే రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిన చల్లా బాబు, అనంతరం స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయారు. ప్రస్తుతం తెదేపా అభ్యర్థిగా రంగంలో ఉన్నారు.
పుంగనూరు కు చెందిన బోడె రామచంద్ర యాదవ్ గత ఎన్నికలలో జనసేన పార్టీ తరఫున పుంగనూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయనకు 16 వేల ఓట్లు వచ్చాయి. అనంతరం ఆయన జనసేన పార్టీకి దూరమయ్యారు. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పుంగనూరు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. టిడిపి నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో సొంతంగా భారత చైతన్య యువజన పార్టీని స్థాపించారు. ప్రస్తుతం ఆ పార్టీ అధినేతగా ఆయన పుంగనూరు, మంగళగిరి నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా అందోళనలు చేయడంతో ఒక సారి యాదవ్ మీద దాడి జరిగింది. దీంతో బాబా రాందేవ్ సహకారంతో రామచంద్ర యాదవ్ భారత హోమ్ మినిస్టర్ అమిత్ షాకు పెద్దిరెడ్డి మీద ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. ఎందుకు భారత ప్రభుత్వం యాదవ్ కు వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని ఇచ్చింది. ఆయన బి సి వై పార్టీ తరఫున మొట్టమొదటి సారిగా సొంత నియోజకవర్గంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
పుంగనూరు నియోజకవర్గంలో నుంచి ఇప్పటికీ వరుసగా మూడుసార్లు విజయం సాధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాలుగో పర్యాయం కూడా విజయం సాధించడానికి పకడ్బందిగా పావులు కలుపుతున్నారు. ఆయన రాజకీయంగా, ఆర్థికంగా తిరుగులేని నేత. మంత్రిగా కొనసాగుతున్నారు. అలాగే గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలో పీలేరు నియోజకవర్గంలో ఓటమి చవిచూసిన చల్లా రామచంద్రారెడ్డి మరోసారి పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రారెడ్డితో తలపడుతున్నారు. గత ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన బోడె రామచంద్ర యాదవ్ కూడా ఈ పర్యాయం తన సొంత పార్టీ తరఫున పుంగనూరు నుంచి పోటీ చేస్తున్నారు. ముగ్గురు రామచంద్రులు పుంగనూరు నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తున్నారు. ఓటర్లు ఎవరికీ పట్టం కట్టారో తెలియాలి అంటే నాలుగు రోజులు వేచిచుడక తప్పదు.