10, మే 2024, శుక్రవారం

మూడు నియోజకవర్గాలలో ప్రచారం చేస్తున్న సి కే బాబు


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

చిత్తూరు టైగర్, మాజీ ఎమ్మెల్యే సి కె బాబు చిత్తూరు జిల్లాలో మళ్ళీ క్రియాశీల నేతగా మారారు. పదేళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు టిడిపికి ఊపిరిగా మారారు. చిత్తూరు, జి డి నెల్లూరు, పూతలపట్టు నియోజక వర్గాలలో పావులు కదుపుతున్నారు. చిత్తూరులో టిడిపి అభ్యర్థి గురజాల జగన్ మోహన్ నాయుడును గెలుపు బాట వైపు నడిపిస్తున్నారు. చిత్తూరులో సరైన అభ్యర్థి కోసం టిడిపి అన్వేషిస్తున్న దశలో జగన్ మోహన్ నాయుడు రంగ ప్రవేశం చేశారు. ఆ దశలో సి కె బాబు ఆయన ప్రచారానికి సారథ్యం వహించారు. దీనితో వైసిపి అభ్యర్థి విజయానంద రెడ్డి గట్టి పోటీ ఎదుర్కోవలసి వస్తోంది. సి కె బాబు పనిలో పనిగా తన కుమారుడు సి కె సాయి కృష్ణా రెడ్డిని కూడా తన వారసునిగా వెంట తిప్పుతున్నారు. చిత్తూరులో సి కె బాబు సంచలన నాయకుడుగా ఎదిగారు. 1981 లో తన అనుచరులు పలువురిని ఏకగ్రీవంగా కౌన్సిలర్లుగా గెలిపించారు. తాను మునిసిపల్ వైస్ చైర్మన్ అయ్యారు. 1989 లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 1994,1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. చిత్తూరులో హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేగా రికార్డ్ సృష్టించారు. 1994 లో జిల్లాలోని ఉన్న 15 నియోజక వర్గాలలో 14 చోట్ల టిడిపి అభ్యర్థులు గెలువగా సి కె బాబు ఏకైక కాంగ్రెస్ ఎమ్మేల్యే అయ్యారు. 2009 లో మరొక సారి ఎమ్మేల్యే అయ్యారు. అయితే పరిస్థితులు అనుకూలించక పోవడంతో పదేళ్లు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు చిత్తూరు టిడిపి అభ్యర్థి జగన్ మోహన్ నాయుడు గెలుపే ద్వేయంగా వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారు. ఆయన ప్రభావం జి డి నెల్లూరు, పూతలపట్టు నియోజక వర్గాలలో కూడా ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గాలకు కేటాయించిన ఆ రెండు నియోజక వర్గాలలో టిడిపి హ్యాట్రిక్ అపజయాలను మూట కట్టుకొన్నది. ఈ సారి ఎలాగైనా గెలవాలని చంద్రబాబు పట్టుదలతో అన్నారు. దీనికి సి కె బాబు ప్రభావం తోడైతే సానుకూల ఫలితాలు ఉంటాయని భావిస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *