పోటికి దూరంగా గల్లా అరుణ, జయదేవ్
పూర్తి స్థాయి వ్యాపారవేత్తగా జయదేవ్
పరిస్థితులు అనుకూలిస్తే జయదేవ్ వచ్చే అవకాశం
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాజకీయాలు నేర్పిన గల్లా కుటుంబంఈ ఎన్నికలలో పోటికి దూరంగా ఉంటోంది. తాము రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే గల్లా అరుణ కుమారి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రాజకీయ కార్యక్రమాలలో ఎక్కడ పాల్గొనడం లేదు. తిరుపతిలో ఏర్పాటుచేసిన అమర హాస్పిటల్ లో బిజీగా కాలం గడుపుతున్నారు. ఆమె కుమారుడు గల్లా జయదేవ్ ప్రస్తుతం గుంటూరు ఎంపీగా ఉన్నారు. ఈ ఎన్నికలలో అయన కూడా పోటి చేయడం లేదు. రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు అయన ప్రకటించారు. ఆయన కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఢిల్లీకి పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ వెళ్ళితే తప్ప ఆయన ఎవరినీ కలవడం లేదు. పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. లోకేష్ పాదయాత్రలో కానీ, ముగింపు సమావేశంలో గానీ పాల్గొనలేదు.
గల్లా కుటుంబం చిత్తూరు జిల్లాలో రాజకీయంగా ఒక వెలుగు వెలిగింది. పాటూరు రాజగోపాల్ నాయుడు చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం దిగువ మాఘానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు. ఆయన రైతు నాయకుడిగా, సాహితీవేత్తగా, సంఘసంస్కర్తగా, రచయితగా పేరుగన్చారు. అభిమానులు ఆయనను రాజన్న అని గౌరవంగా పిలుచుకుంటారు. ఆయన స్వతంత్ర పార్టీ తరఫున చిత్తూరు నుండి 1955లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1973లో శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. చిత్తూరు పార్లమెంటు నుండి 1977,1979 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యులుగా గెలుపొందారు. ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ మెంబర్ గా పని చేశారు. ఆయన చత్రపతి శివాజీ, రామానుజన్ ప్రతిజ్ఞ, కురుక్షేత్రం, సారా సీసా, కులోళ్ళు, తమసోమ, చంద్రగిరి దుర్గం, ఓరుగల్లు పీఠం, అనార్కలి, తేజవ్వ, లకుమ వంటి రచనలు చేశారు. రాస్ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఆయన శిష్యుడినని చంద్రబాబు నాయుడు గర్వంగా చెప్పుకుంటారు.
పాటూరు రాజగోపాల్ నాయుడు కుమార్తె గల్లా అరుణకుమారి. తండ్రి వారసురాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, పిసిసి ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 1989 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 1994 ఎన్నికల్లో నారా రామూర్తి నాయుడు చేతిలో ఓడిపోయారు. 1999, 2004, 2009 ఎన్నికలలో చంద్రగిరి నుంచి వరుసగా మూడుసార్లు హ్యాట్రిక్ విజయం సాధించారు. ఆమె వైద్య విద్య, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గంపై చెరగని ముద్ర వేశారు. భారీగా అనుచరులను కలిగి ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు 2014 ఎన్నికలలో చంద్రగిరి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలలో ఆమెను కాదని పులివర్తి నానికి చంద్రగిరి టిక్కెట్లను ఇవ్వడం జరిగింది. దీంతో మనస్థాపం చెందిన ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఆమెకు పార్టీ పదవులు ఇచ్చినా, సమావేశాలకు హాజరు కాలేదు. చంద్రగిరి అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఒక సామాజికవర్గం ఎక్కువగానున్న గ్రామాలలో ఆమెకు తక్కువ ఓట్లు పడ్డట్టు గుర్తించారు. ఈ విషయమే చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేసిన ఆయన స్పందించలేదు. అలాగే ఇటీవల పూతలపట్టు నియోజకవర్గ ఇన్చార్జిని నియమించినప్పుడు కూడా ఆమె అభిప్రాయం కూడా తీసుకోలేదు. కావున ఆమె పార్టీకి దూరంగా ఉండాలని దృఢ నిశ్చయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గల్లా కుటుంబానికి తిరుపతి, చంద్రగిరి, పూతలపట్టు, పలమనేరు నియోజకవర్గాలలో పరిశ్రమలు ఉన్నాయి. బలమైన ఓటు బ్యాంకు కూడా ఉంది.
గల్లా అరుణ కుమారి కుమారుడు గల్లా జయదేవ్ గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారు. పార్లమెంటులో పదునైన మాటలతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టారు. దీంతో రాష్ట్రంలో అనధికార మిత్ర పక్షంగా కొనసాగుతున్న వైసిపి గల్లా కుటుంబం మీద కక్ష గట్టింది. వారి ఫ్యాక్టరీకి పర్యావరణ అనుమతులు లేవంటూ కొద్దిరోజులు ఫ్యాక్టరీని మూసివేసింది. చిత్తూరు సమీపంలో ఆ ఫ్యాక్టరీకి ఇచ్చిన స్థలాన్ని తిరిగి ప్రభుత్వం తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఫ్యాక్టరీకి విద్యుత్తును కూడా కట్ చేశారు. ఇలా వ్యాపార మనుగడను దెబ్బ కొట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విఫల ప్రయత్నం చేశారు. కోర్టులు గల్లా కుటుంబానికి అండగా నిలవడంతో, తిరిగి స్థలాన్ని కూడా దక్కించుకున్నారు. ఫ్యాక్టరీ విస్తరణను సొంత రాష్ట్రంలో కాకుండా చెన్నై, తెలంగాణలో చేపట్టారు. తాను రాజకీయ నాయకుడుగా ఉండడం కారణంగానే తమ పరిశ్రమ అమరరాజా అభివృద్ధికి నిరోధకంగా మారుతున్నదని గల్లా కుటుంబం ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. కావున రాజకీయాలకు దూరంగా ఉండాలని కటిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకే గల్లా అరుణ కుమారి, గల్లా జయదేవులు ఇటీవల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఈ విషయమై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఉండడం ద్వారా
వివాదాలు వస్తున్నాయని,
అందుకే తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదురవుతున్న ఇబ్బందుల్ని చూస్తూ పార్లమెంట్ లో
మౌనంగా ఉండలేక పోతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే తన వ్యాపార విధులను కూడా పూర్తి స్థాయిలో నిర్వహించ లేకపోతున్నానని
తెలిపారు. 2024లో మళ్లీ పోటీ చేసినా గెలుస్తాను, కానీ, రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు
వివరించారు. రెండేళ్ల క్రితం వ్యాపారాల నుంచి తన తండ్రి గల్లా రామచంద్ర నాయుడు రిటైర్ అయ్యారని చెప్పారు. ఈ నేపథ్యంలో రాజకీయాలు, వ్యాపారాన్ని సమన్వయం చేయడం కష్టంగా మారిందని వివరించారు. అందుకే
రాజకీయాల నుంచి వైతొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీ గల్లా జయదేవ్ వెల్లడించారు. ఇక
నుంచి పూర్తి స్థాయిలో వ్యాపారాలపైనే దృష్టి సారించాలనుకుంటున్నట్లు గల్లా జయదేవ్
చెప్పారు.