21రోజుల ఉత్కంటకు తెర
నేడే ఓట్ల లెక్కింపు
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు
ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు మంగళవారం తెరపడనుంది. 21రోజుల సస్పెన్సుకు తెర పడనుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలవడనున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్, 8.30 నుంచి ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా పోలైన నేపథ్యంలో ఫలితాలకు కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు, ప్రజలకు మధ్యాహ్నానికి జిల్లాలో ఎవరు గెలుస్తారు అనే విషయం మీద ఓక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఓట్ల లెక్కింపును విజయవంతంగా పూర్తి చేసి, తొందరగా ఫలితాలను వెల్లడించడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఎక్కడా, ఏ విధమైన పోరబాట్లకు ఆస్కారం లేకుండా జాగర్తలు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారులు లెక్కింపు కేంద్రంలోనే ఉండనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించడానికి, ఇ వి ఎం లోని ఓట్లను లెక్కించడానికి వేరు వేరుగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ఎన్నికల అధికార ప్రత్యేక పరిశీలకులను కూడా నియమించింది. ఇందుకు తోడు ఎన్నికలలో పోటి చేసిన అభ్యర్థులు, వారి తరపున ఏజెంట్లు డేగ కన్నులతో లెక్కింపు ప్రకియను పరిశిలిమ్చానున్నారు. లెక్కింపు కేంద్రం వద్ద కానీ, జిల్లాలో కానీ ఎటువంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జిల్లాలో పోలీస్ 30 యాక్టు, 144 సెక్షన్ అమలులో ఉంది. ఎక్కడా జనం గుమికూడకుండా జాగర్తలు తీసుకుంటున్నారు. అల్లర్లు సృస్తిస్తారనే అనుమానం ఉన్న వారిని ముందుగానే బైండ్ ఓవర్ చేసుకున్నారు. ముఖ్య కూడళ్ళలో పోలీస్ పికెట్లు ఏర్పాట్లు చేశారు. మొబైల్ వాహనాల ద్వార పహారా కాస్తున్నారు. ముందు జాగర్త చర్యగా జిల్లాలో మద్యం దుకాణాలను మూసేశారు. జిల్లాలో పోటి ముఖ్యంగా తెలుగుదేశం, వైసిపి ల మధ్య ఉంది. జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులు పోటి చేసినా, వారి ప్రభావం నామమాత్రంగా తెలుస్తుంది. పుంగనూరు నుండి పోటి చేస్తున్న బిసివై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదన్ ప్రభావం కూడా పెద్దగా ఉండదని సమాచారం. పోటి టిడిపి, వైసిపి మధ్య ఉండటంతో పోటి అభ్యర్థులు విజయం కలుగాలని మొక్కని మొక్కులు లేవు. దర్శించని ఆలయం లేదు. అందరు అభ్యర్థులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తమకు విజయం ప్రసాదించమని కోరుకున్నారు. అభ్యర్థుల తరపున స్థానిక నేతలు కూడా దేవుళ్ళకు మొక్కులు మొక్కుకున్నారు. సోమవారం చిత్తూరు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో చిత్తూరు మాజీ ఎం ఎల్ ఏ ఏ ఎస్ మనోహర్ ఆధ్యర్యంలో టిడిపి గెలువాలని కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో సుమారుగా 82.65 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే 17,885 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. అధికారులు ముందుగా సైన్యానికి సంబంధించిన సర్వీసు ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. సర్వీస్, పోస్టల్.. ఈ రెండు రకాల ఓట్లు తపాలా ద్వారా ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు చేరతాయి. ఉదయం 8 గంటలకు కౌటింగ్ వీటితోనే ప్రారంభం అవుతుంది. వీటి లెక్కింపు పూర్తవగానే తొలి రౌండ్ ఫలితం వెల్లడిస్తారు.