కుప్పం ఫలితంపై సర్వత్రా ఆశక్తి
కుప్పంలో గెలుపుపై జోరుగా చర్చలు
లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా టిడిపి
ఎం ఎల్ సి కలిచెర్ల శ్రీకాంత్ ఆధ్యర్యంలో ప్రచారం
చంద్రబాబును ఓడిస్తామంటున్న మంత్రి పెద్దిరెడ్డి
గెలుపు కోసం సర్వశక్తులు వడిన వైసిపి
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
కుప్పం నియోజకవర్గం నుండి ఎనిమిదో పర్యాయం విజయం సాధించి, జూన్ తొమ్మిదో తేదిన అమరావతిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి టిడిపి అధినేత నారాచంద్రబాబు నాయుడు సమాయత్తం అవుతున్నారు. అయితే ఈ ఎన్నికతో చంద్రబాబు పని అయిపోయిందని, కుప్పంలో చంద్రబాబును ఓడించి ఇంటికి పంపుతామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రకటిస్తున్నారు. ఇందుకు మంత్రి పెద్దిరెడ్డి భారీ కసరత్తే చేశారు. కుప్పంలో చంద్రబాబును ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ఇందుకు స్థానిక సంస్థల ఎన్నికలలో మంత్రి పెద్దిరెడ్డి భీజం వేశారు. నియోజకవర్గంలోని వార్డు, సర్పంచ్, ఎం పి టి సి, జడ్ పి టి సి, ఎం పి పి, కుప్పం మునిసిపాలిటిలను మొట్టమొదటిసారిగా గెలుచుకున్నారు. ఇదే తరహాలో సార్వత్రిక ఎన్నికలలో చంద్రబాబును ఓడించడానికి పధక రచన చేశారు. ఇంతే ధీటుగా చంద్రబాబు ప్రతివ్యుహం రచించారు. ఎం ఎల్ సి కలిచెర్ల శ్రీకాంత్ ను కుప్పం ఇన్చార్జిగా నియమించారు. అయన ఆధ్యర్యంలో ప్రచార కార్యక్రమాలు జరిగాయి. యువ గళం పాదయాత్ర కుప్పం నుండి ప్రారంభించారు. ఇంటి నిర్మాణం చేపట్టారు. ఎన్ టి ఆర్ ట్రస్ట్ ఆధ్యర్యంలో ఉచిత వైద్య శిభిరాలను ఏర్పాటు చేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా ప్రత్యేకంగా ప్రచారంలో పాలుపంచుకున్నారు. ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు కూడా ఇంటింటి ప్రచారాన్ని చేశారు. ఓట్ల లెక్కింపు దగ్గర పడేకొద్దీ సామాజిక మాధ్యమాలలో చంద్రబాబు ఓడిపోతున్నారని ప్రచారం ఎక్కువ అయ్యింది. ఈ ప్రచారం వైసిపి శ్రేణులలో ఉత్సాహం నింపుతోంది. టిడిపి శ్రేణులు కొంత కలవరపాటుకు గురతున్నారు. అధినేత మాత్రం గెలుపు ధీమాతో, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వికరానికి కసరత్తులో నిమగ్నమయ్యారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కుప్పం నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా నిలుస్తోంది. ఇంతవరకు జరిగిన తొమ్మిది సాధారణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తప్ప ఏ పార్టీ విజయం సాధించలేదు. 1983, 1985 ఎన్నికలలో రంగస్వామి నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. 1989 నుంచి ఏడు పర్యాయాలు వరుసగా తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్రతిహస్తంగా విజయం సాధిస్తున్నారు. ఈ ఎన్నికలలో ఎనిమిదవ సారి కూడా విజయం సాధించి, తనదైన రికార్డును సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు మీద కుప్పంలో పోటీ చేయడానికి ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు విజయం లాంచనమే. చంద్రబాబు నాయుడు ప్రచారానికి కానీ, నామినేషన్ వేయడానికి కూడా కుప్పం నియోజక వర్గంలో అడుగుపెట్టకనే గెలిచిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.
ఒకనాడు కుప్పం అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే కుప్పం అనే పరిస్థితి ఉండేది. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకు పెట్టని కోటగా కుప్పం ఉండేది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక క్రమంగా వైసిపి పుంజుకుంటోంది. ఈ పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆందోళన కలిగిస్తోంది. అధికార బలంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులను అణగదొక్కడానికి వైసిపి వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. చంద్రబాబు పర్యటనలను సైతం అడ్డుకున్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తల మీద ఎడాపెడా కేసులు పెట్టి జైళ్ళ పాలు చేస్తున్నారు. స్థానిక ఎన్నికలలో పరాజయం తెలుగుదేశం పార్టీకి గొడ్డలి పెట్టులా తయారైంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తిరిగి పుంజుకోవడానికి, పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ సారి ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీ సాధించాలన్న ధ్యేయంతో చంద్రబాబు నాయుడు నియోజకవర్గ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ కలిచర్ల శ్రీకాంత్ ను నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమించారు. ఏడు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా, ఏనాడు కుప్పంలో ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడుకు రాలేదు. ఇప్పుడు YCP దెబ్బతో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు.