ఆలస్యంగా ప్రారంభమైన మామిడి సీజన్
తెరచుకుంటున్న మామిడి గుజ్జు పరిశ్రమలు
నాలుగు ఫ్యాక్టరీలలో మామిడి ప్రాససింగ్ ప్రారంభం
మామిడి కాయల కోసం ఫ్యాక్టరీల ఎదురుచూపు
జిల్లాలో భారీగా తగ్గిన మామిడి దిగుబడి
ఖాదర్ టన్ను రూ. 45 వేలు, సిందూర రూ. 20 వేలు
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లాలో మామిడి సీజన్ ఈ సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ సంవత్సరం పంట ఆలస్యమైంది. సీజన్ ప్రారంభంలో వాతావరణం తడిగా ఉండడం కారణంగా, మామిడి పూత రాలేదు. వచ్చిన మామిడి పూత కూడా మూడు నాలుగు దఫాలుగా వచ్చింది. దీంతో ఈ పర్యాయం ఆలస్యంగా పంట రావడమే కాకుండా గత సంవత్సరంతో పోల్చుకుంటే 20 శాతం పంట కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సాధారణంగా మామిడి ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు విజయవాడ నుంచి వచ్చే కాయలతో తొలుత ప్రాసెసింగ్ ప్రారంభిస్తారు. ఈ పర్యాయం అక్కడ కూడా మామిడి దిగుబడి తక్కువగా ఉండడం, కాయల నాణ్యత లేకపోవడంతో అక్కడి నుంచి కూడా దిగుబడి చేసుకోలేదు. జిల్లాలో ఖాదర్, సింధూర రకం కాయలు తొందరగా పక్వానికి వస్తాయి. కావున జిల్లాలో ఖాదర్ పక్కవానికి వచ్చేవరకు ఆగి, జిల్లాలో ఫ్యాక్టరీలు ప్రారంభమవుతున్నాయి. ప్రారంభంలో ఖాదర్ రకానికి టన్నుకు 45,000 సింధూరకు 20,000 రూపాయలు చొప్పున చెల్లిస్తున్నారు. ఇది చాలా తక్కువ మొత్తం రైతులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది మామిడి పూత చాలా తగ్గువ వచ్చింది. వచ్చిన పూత కూడా నిలువలేదు. వచ్చిన పూత కూడా మూడు, నాలుగు దఫాలుగా వచ్చింది. జిల్లాలో ఇప్పుడు కూడా మామిడిలో పూత కనిపిస్తుంది.వాతావరణం అనుకూలించక మామిడి పూతంతా మాడిపోయింది. మరోవైపు పిందే అడుగు భాగాన మచ్చలతో పంట కూడా పూర్తిగా దెబ్బతింతోంది. కాయ తోటిమ దగ్గర నుండి పాలు కారుతూ, కాయ రంగు మారి కింద పడిపోతుంది. మరో వైపు మామిడి తోటలను మంగు ముంచి ఎత్తుతోంది, మంగు కారణంగా మామిడి ఆకులు నల్లగా మారిపోతున్నాయి. దాని ప్రభావం కాయ మీద పడి, మామిడి పిందెలు కూడా నలుపు రంగులోకి మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాలో సుమారుగా 90 శాతం మామిడి పంట దెబ్బతిన్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మామిడి రైతులకు ప్రభుత్వం బీమా కల్పించి, పంటకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.జిల్లాలో సుమారుగా లక్షా, 50 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నయి. ఇందులో 20వేల ఎకరాలు లేత తోటలు కాగా లక్ష యాభై వేల ఎకరాల్లో కాపు వస్తుంది. జిల్లాలో సగటున 5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావాల్చిఉంది. అయితే పూత రాకపోవడంతో 10 శాతం పంట వచ్చే అవకాశం ఉంది. సగటున జిల్లాలో సంవత్సరానికి 5 లక్షల టన్నుల మామిడి దిగిబడి రావల్చి ఉండగా, ఈ సంవస్తరము ఒకటి లేక రెండు లక్షల తన్నులు దిగుబడి రావచ్చని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటేవల కురిచిన అకాల వర్షం, ఎదురు గాలుల కారణంగా, పంట చాలా వరకు వేలరాలింది. తూర్పు మండలాల్లో ఎక్కువగా విస్తీర్ణంలో మామిడి తోటలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా పండిన పంటంతా చిత్తూరు, దామలచెరువు, బంగారుపాళ్యం, పుత్తూరు, తిరుపతి కేంద్రంగా కలకత్తా, ఢిల్లీ వంటి కేంద్రాలకు ఎగుమతి అవుతోంది. ఈ ఏడాది జిల్లాలో మామిడి నిరాశాజనంగానే ప్రారంభం అయ్యింది. మంచు, అకాలంగా వీస్తున్న గాలుల వల్ల మామిడి పూత రాలిపోవడంతో పాటు పిందెలకు మచ్చలు ఏర్పడడంతో పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. ఇలా జిల్లా వ్యాప్తంగా లక్ష ఎకరాల్లో మామిడి పంట నష్టపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి మామిడి సాగు దారుల్లో అత్యధికులు కౌలుదార్లే. ఎకరాకు రూ.15 వేలు నుంచి రూ.20 వేలుకు లీజుకు తీసుకున్న సాగుదారుడు, దుక్కులు దున్నడం, పురుగు మందుల వాడకానికి ఎకరాకు మరో రూ.20 వేలు వరకు ఖర్చు చేస్తున్నారు. అంటే ప్రతి ఎకరాకు రైతుకు రూ.40 వేలు వరకూ ఖర్చవుతోంది. అయితే ఈసారి పెట్టు బడులు కూడా తిరిగి రావని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు నష్టపోయారని రైతు సంఘాలు ఆందోళ చేస్తున్నారు. మామిడి రైతు గత రెండేళ్లుగా వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో నష్టపోతున్నాడు. ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించి, ఆదుకోవడంలో విఫలమవుతోంది. ఈ ఏడాది వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ వైఎస్‌ఆర్ భీమా కల్పించ లేదు. కనీసం ఇప్పటి వరకు బీమా నమోదుకు మార్గదర్శకాలు రూపొందించ లేదు. ప్రతి పథకానికి ఇ-క్రాప్ నమోదు తప్పని సరి చేయడంతో వెబ్‌ల్యాండ్లలో తప్పులు తడకలు, రికార్డుల్లేక రైతు భరోసా కేంద్రాల్లో ఇ-క్రాప్ అంతంత మాత్రంగానే జరుగుతోంది. మామిడి పంట విషయంలో పూర్తిగా కౌలుదార్లు కావడంతో దాదాపు సాగుదార్లకు బీమా వర్తించని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.