26, మే 2024, ఆదివారం

ఉహల పల్లకిలో ఊరేగుతున్న ఇరు పార్టీల అభ్యర్థులు

భారీ పోలింగ్ తమకే లాభిస్తుండంటున్న ఇరు పార్టీలు 

ప్రభుత్వ అనుకూల ఓటు అంటున్న వైసిపి నేతలు 

వ్యతిరేక ఓటు అనుతున్న టిడిపి నాయకులు 

4న విజయోత్సావానికి ఇరు పార్టీల అభ్యర్థులు సిద్దం 

మంత్రి పదవుల మీద జోరుగా ఉహగానాలు 

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు. 


 చిత్తూరు జిల్లాలో అనూహ్యంగా పెరిగిన పోలింగ్ శాతం కారణంగా ఇరుపార్టీల అభ్యర్థులలో గెలుపు ధీమా వ్యక్తం అవుతుంది. పెరిగిన ఓటింగ్ శాతం తమకంటే, తమకు అనుకూలిస్తుందని ఇరు పార్టీల అభ్యర్థులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కారణంగానే ఈసారి భారీగా ఓటింగ్ పెరిగిందని వైసిపి అభ్యర్థులు, నాయకులు అంటున్నారు. కాదు, ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే భారీగా ఓటింగ్ పెరిగిందని తెలుగుదేశం పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఎలా ఉన్నా, మీరు పార్టీల నేతలలో గెలుపు ధీమా వ్యక్తం అవుతుంది. ఇరు పార్టీల నేతలు నాలుగవ తేదీన విజయోత్సవం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాము ఇప్పుడే గెలిచిపోయినట్లు, మంత్రులు అయినట్లు  అభ్యర్థులు ఊహల పల్లకిలో ఊరేగుతున్నారు. 


సార్వత్రిక ఎన్నికలలో గతంలో ఎన్నడో లేని విధంగా చిత్తూరు జిల్లాలో 82.65 శాతం ఓటింగ్ నమోదు అయింది. పుంగనూరు నియోజకవర్గంలో 80.25 శాతం , నగరి నియోజకవర్గంలో 81.05 శాతం, గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో 82 శాతం, చిత్తూరు నియోజకవర్గంలో 80.65 శాతం, పూతలపట్టు నియోజకవర్గం లో 85.35 శాతం, పలమనేరు నియోజకవర్గంలో 82.9 శాతం, కుప్పం నియోజకవర్గంలో 85.87 శాతం, చంద్రగిరి నియోజకవర్గంలో 79.34% ఓటింగ్  నమోదయింది. ఈ ఓటింగ్ సరళి గత ఓటింగ్ తో పోల్చుకుంటే ఎక్కువ. గతంలో ఎన్నడు ఎంత భారీ స్థాయిలో జిల్లాలో ఓటింగ్ నమోదు కాలేదు. ఈ ఓటింగ్ ను తెలుగుదేశం, వైసీపీ పార్టీలు ఎవరికి అనుకూలంగా వారు భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన నవరత్నాల కార్యక్రమాలు తమకు ఓట్లను రాలుస్తాయని వైసీపీ నాయకులు ధీమాతో ఉన్నారు. జగనన్న అమ్మఒడి కింద ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గురుకులు, జూనియర్ కళాశాలలో ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో ఏడాదికి 15,000 రూపాయలు వంతున అందజేశారు. వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్య భీమాను కల్పించి  ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి  అయిదు లక్షల  వరకు పూర్తిగా ఉచిత వైద్యాన్ని అందజేశారు. వైయస్సార్ పెన్షన్ కానుక  కింద 60 ఏళ్ల దాటిన వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఒంటరి మహిళలు, ట్రాంజెండర్లు, డప్పు కళాకారులు, ఎయిడ్స్ బాధితులు, కుష్టు వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నెలకు మూడు వేల రూపాయల నుండి అయిదు వేల వరకు పెన్షన్ అందజేస్తున్నారు. వైఎస్సార్ కాపు నేస్తం కార్యక్రమం కింద కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన కుటుంబాల ఆర్థిక స్వావలంభన కోసం ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి 15,000 చొప్పున అందచేస్తున్నారు. ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు అర్హులైన వారికి ఇళ్లపట్టాలుగా అందజేసి పక్క ఇళ్ళను మంజూరు చేశారు. వైయస్సార్ నేతన్న నేస్తం కింద చేనేత మగ్గాల మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు సంవత్సరానికి 24 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జగనన్న విద్యాదీవెన  పథకం కింద ఉన్నత విద్య జరుగుతున్న విద్యార్థులకు చేయూతనివ్వడానికి ఫీజు మొత్తని చెల్లించే కార్యక్రమాన్ని చేపట్టారు. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద చిన్న,సన్న కారు రైతులకు సంవత్సరానికి 13,500 పెట్టుబడి సాయాన్ని అందజేశారు. వైయస్సార్ చేయూత పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కింద కుటుంబాలకు ఆర్థికసావనం కోసం ఏడాదికి ఒక మహిళకు 18,750 చొప్పున అందజేశారు. వైయస్సార్ వాహన మిత్ర పధకం కింద స్వయం ఉపాధి కోసం ఆటో, టాక్సి వంటి నడుపుతున్న వారికి ఏడాదికి పదివేల రూపాయలు చొప్పున అందజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు జరిగాయని, ప్రతి ఇంటికి లబ్ధి చేకూరిందని వైసిపి నాయకులు నమ్ముతున్నారు. ప్రతి కుటుంబంలో వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అయ్యాయని, కావున ఈ ఎన్నికలలో పాజిటివ్ ఓటు నమోదు అయిందని, రానున్న ఎన్నికల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వైసీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. 


అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు అభ్యర్థుల విశ్లేషణ మరో రకంగా ఉంది. నవరత్నాల కార్యక్రమాలను కొనసాగిస్తూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం లేదంటున్నారు. దళితులకు, బిసిలకు గతంలో ఉండిన పలు పధకాలను రద్దు చేశారని అనుతున్నారు. కనీసం గుంతల రోడ్లను బాగుచేసే కార్యక్రమం కూడా చేపట్టలేదని, పెట్రోల్, డీజిల్ ధరలు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, సంక్షేమ పథకాల పేరుతో ఆదాయం మార్గాలను అన్వేషించకుండా అప్పులు చేసి, పంచి పెట్టాలని ఆరోపిస్తున్నారు. దీనికి తోడు అమరావతిని అభివృద్ధి చేయకుండా, మూడు రోజుల్లో పేరుతో వైసిపి నాయకులు నాటకమాటారని అంటున్నారు. ముఖ్యమంత్రి, ప్రజలకు గానీ, శాసనసభ్యులకు గానీ  అందాలు నడపలేదని, ఇవి కూడా తమకు అనుకూలిస్తాయని భావిస్తున్నారు. రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి కోరేవారెవరూ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయరని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి వ్యతిరేక ఓటు రూపంలో భారీగా ఓట్లు పోలయ్యాయని భావిస్తున్నారు. విద్యను పూర్తి చేసిన విద్యార్థులకు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకుండా ఇతరు రాష్ట్రాలకు వలస పోవాల్సి వస్తుందని అంటున్నారు. దీంతో మొదటిసారిగా ఓటు హక్కు పొందిన యువత వ్యతిరేక ఓటు వేసిందని భావిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ కోరుకునే రాష్ట్ర ప్రజలు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేశారని భావిస్తున్నారు. నాలుగవ తేదీన విజయోత్సవాలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు.


 ప్రభుత్వం వస్తే మంత్రి పదవులు ఎవరెవరికి అనే విషయం మీద కూడా జిల్లాలో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. వైసీపీ నాయకులు తమ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రులు ఎవరనే విషయం పైన కూడా చర్చ జరుగుతుంది. చిత్తూరు జిల్లా నుండి ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే రోజా కొనసాగే అవకాశం ఉందని, కొత్తగా ఎస్సై కోటాలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె కృపాలక్షికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీలో కుప్పం నుంచి విజయం సాధించి, నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవి చేపడుతారని ఆశాభావంతో ఉన్నారు. గతంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన అమర్నాథరెడ్డి ఈ పర్యాయం కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని భావిస్తున్నారు. అలాగే ఒక ఎస్సీ నియోజకవర్గం నుంచి ఈసారి కొత్తగా పోటీ చేసిన అభ్యర్థి తాను వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రచారం చేసుకుంటున్నారు.  గతంలో ఒకసారి మంత్రి పెద్దిరెడ్డి మీద పోటీ చేసి, ఓటమిపాలై, ప్రస్తుతం పోటీ చేస్తున్న ఒక నాయకుడు తన పోలీసులను ఎదిరించి జైలుకి వెళ్లి వచ్చా నని, తాను హోంశాఖ మంత్రి కావడం తధ్యమని సన్నిహితులతో అంటున్నారు. ఇలా ఎవరికివారు ఊహల పల్లకిలో ఊరేగుతూ తాము విజయం సాధించినట్లు కలల ప్రపంచంలో విహరిస్తున్నారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *